..
- 22/03/2012
TAGS:
నిజామాబాద్,
మార్చి 21: అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి ఉప ఎన్నికలో ముందు
ఊహించిన విధంగానే తెలంగాణ రాష్ట్ర సమితి తన ‘సెంటిమెంటు’ ప్రాభవాన్ని
చాటుకుంది. తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్, తన సమీప ప్రత్యర్థిగా నిలిచిన
కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్ల రాజిరెడ్డిపై 44,465ఓట్ల మెజార్టీతో విజయం
సాధించారు. మొదటి రౌండ్ నుండి మొదలుకుని ఓట్ల లెక్కింపు పూర్తయిన మొత్తం
16రౌండ్ల వరకు కూడా తెరాస అభ్యర్థిదే ఆధిపత్యంగా కొనసాగింది. గడిచిన 2009
సార్వత్రిక ఎన్నికల్లో ‘గంప’ 47,708 ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేశారు. గతంలో
పోలిస్తే ఈసారి మెజార్టీ కొంతమేర తగ్గినప్పటికీ, ఉప పోరు జరిగిన
తెలంగాణలోని ఆరు స్థానాలలో విజేతలెవరూ సాధించని రీతిలో అత్యధిక మెజార్టీని
కైవసం చేసుకున్న ఘనతను గంప గోవర్ధన్ దక్కించుకున్నారు. టిడిపి నామమాత్రపు
పోటీకే పరిమితమై కనీసం డిపాజిట్‌ను సైతం దక్కించుకోలేకపోయింది. గుడ్డిలో
మెల్ల అన్న చందంగా అధికార కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లను
సాధించి ధరావతును నిలుపుకుంది. మొత్తం 1,37,051ఓట్లు పోల్ అవగా, తెరాస
అభ్యర్థి గంప గోవర్ధన్ 75,699ఓట్లను సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్ల
రాజిరెడ్డికి 31,234ఓట్లు దక్కగా, తెదెపా అభ్యర్థి నిట్టు వేణుగోపాల్‌రావు
ఖాతాలో కేవలం 17,839ఓట్లు మాత్రమే జమ అయ్యాయి.స్టేషన్ ఘన్‌పూర్‌లో..
వరంగల్: స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో తెలంగాణ రాష్టస్రమితి విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ రాజయ్య తన సమీప ప్రత్యర్థి టిడిపికి చెందిన కడియం శ్రీహరిపై 32,678 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజారపు ప్రతాప్ తృతీయ స్థానంలో నిలిచారు. మొత్తం ఓట్లు 221451, పోలయిన ఓట్లు 169907, డాక్టర్ టి.రాజయ్య( టిఆర్‌ఎస్) 81279, కడియం శ్రీహరి (టిడిపి) 48641, రాజారపు ప్రతాప్(కాంగ్రెస్)28965, దైద ఇలీషాన్(సిపిఎం) 4788, భాస్కుల ప్రసాద్(ఇండి) 6234 ఓట్లుపోలయ్యాయ.
ఆదిలాబాద్‌లో ..
ఆదిలాబాద్: ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్న సమీప కాంగ్రెస్ అభ్యర్థి సి రాంచంద్రారెడ్డిపై 31,396 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి గెలిచిన రామన్న ఆ తరువాత ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో విబేధించి టిఆర్‌ఎస్‌లో చేరిన విషయం విధితమే. తెలంగాణవాదమే ప్రధాన ఏజెండాగా బరిలో నిలిచిన జోగు రామన్నకు ఈ ఎన్నికల్లో 59,452 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సి రాంచంద్రారెడ్డికి 28,056 ఓట్లు, టిడిపి అభ్యర్థి పాయల శంకర్‌కు 24,288 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 70.01 శాతం ఓటింగ్ జరిగితే, వీటిలో టిఆర్‌ఎస్ అభ్యర్థి రామన్నకు 49 శాతం, కాంగ్రెస్ అభ్యర్థికి 24 శాతం, టిడిపి అభ్యర్థికి 21 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలకు ఓట్ల శాతం గణనీయంగా తగ్గినా, డిపాజిట్ దక్కడంతో పరువు నిలుపుకున్నట్లయింది. అయితే ఉద్యమాల పార్టీ సిపిఎంకు ఈ ఎన్నికల్లో కేవలం 2,423 ఓట్లు మాత్రమే రావడంతో పార్టీ నేతలు ఫలితాలతో ఖంగుతినాల్సి వచ్చింది.
కొల్లాపూర్ లో..
మహబూబ్‌నగర్: కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 15,024 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తొలి రౌండ్ నుండే కాంగ్రెస్ అభ్యర్థి మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డిపై ఆధిక్యతను చాటుకుంటూ వచ్చారు. కొల్లాపూర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు 58,107 ఓట్లు రాగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డికి 43,083 ఓట్లు వచ్చాయి. తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 15,024 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
నాగర్‌కర్నూల్‌లో నాగం పాగా
నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ నాగం జనార్ధన్‌రెడ్డి 27,325 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్థన్‌రెడ్డి తొలి రౌండ్ నుండే కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిపై ఆధిక్యతను సాధించుకుంటూ వచ్చారు. గర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధన్‌రెడ్డికి 71,001 ఓట్లు రాగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కె.దామోదర్‌రెడ్డికి 43,676 ఓట్లు వచ్చాయి. నాగం జనార్ధన్‌రెడ్డి 27,325 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
మహబూబ్‌నగర్‌లో వికసించిన కమలం
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 1879 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 16వ రౌండ్ వరకు వెనుకంజలో ఉన్నారు. 17, 18వ రౌండ్లల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంపై 1879 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్‌లో గెలుపొందిన బిజెపి అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 39,385 ఓట్లు రాగా, తెరాస అభ్యర్థి ఇబ్రహీంకు 37,506 ఓట్లు వచ్చాయి. 1,879 ఓట్ల మెజారిటీతో బిజెపి విజయం సాధించింది.
కోవూరులో ప్రసన్న గెలుపు
నెల్లూరు టౌన్, మార్చి 21: రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన కోవూరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 23,496 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రసన్నకు మొత్తం 73,876 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థిగా నిలిచిన తెలుగుదేశం అభ్యర్థి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి 50,380 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి తృతీయ స్థానంలో నిలిచారు. ఈయనకు 41,397 ఓట్లు వచ్చాయి. ఒక రకంగా పార్టీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో టిడిపి ఓటమి ఆ పార్టీకి గట్టి దెబ్బగానే భావించవచ్చు.
ఈ విజయం జగన్‌దే: ప్రసన్న
తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిదే ఈ విజయమని కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్టు ప్రకటించిన అనంతరం రిటర్నింగ్ అధికారి వద్ద ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించేందుకు మాజీ ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి, వైఎస్‌ఆర్‌సి జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధనరెడ్డిలతో కలసి వచ్చిన ప్రసన్న విలేఖర్లతో మాట్లాడుతూ తనను ఓడించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు అనైతికంగా వ్యవహరించాయన్నారు. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసినా తనను ఆదరించారని, పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి