20, మార్చి 2012, మంగళవారం

బూతు మంత్రులే కాదు, డజను పైన బూతు ఎం.ఎల్.ఏ లు కూడా


 
కర్ణాటక అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం మాని, ముగ్గురు మంత్రులు బూతు వీడియోలు చూసి టెలివిజన్ కెమెరాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు మంత్రులే కాకుండా ఇంకా డజను కంటే ఎక్కువ మంది ఎమ్మేల్యేలు కూడా ఆ రోజు బూతు వీడియోలు చూసి తరించినట్లు అసెంబ్లీ కమిటీ పరిశోధనలో బైట పడినట్లు తెలుస్తోంది.
మంత్రులు సవాది లక్ష్మణ్, సి.సి.పాటిల్, కృష్ణ పాలేమార్ లు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో బూతు వీడియోలు చూస్తూ దొరికిపోయి ఆనక రాజీనామా చేశారు. ఈ సంఘటన ఎందుకు, ఎలా జరిగిందీ తేలుసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్ ఏడుగురు ఎమ్మెల్యేలతో కమిటీ నియమించాడు. అందులో నలుగురు పాలక పార్టీ బి.జె.పి ఎమ్మేల్యేలే. మంత్రులు ముగ్గురునీ అసెంబ్లీ నుండి దిస్మిస్ చేయకుండా తాము కమిటీ విచారణలో పాల్గొనబోమని చెబుతూ ప్రతి పక్ష ఎమ్మేల్యేలు ముగ్గురు సమావేశాలను బహిష్కరిస్తున్నారు. దానితో బి.జె.పి ఎమ్మెల్యేలపై, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కూడిన కమిటీయే విచారణ చేస్తోంది.
కమిటీ నివేదిక మార్చి 13 న సమర్పించవలసి ఉండగా నివేదిక ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. మరో 15 మంది ఎమ్మేల్యేలు కూడా బూతు వీడియోలు చూశారనీ, వారిని కూడా విచారించవలసి ఉన్నందున నివేదిక ఆలస్యం కావచ్చుననీ ఎన్.డి.టి.వి తెలిపింది. చట్టపరంగా ఎటువంటి ప్రాతిపదిక ఉన్నదీ పరిశీలిస్తున్నామనీ, ఆ తర్వాత మిగిలినవారిని కూడా పిలిచి విచారిస్తామనీ కమిటీ ఛైర్మన్ శ్రీశైలప్ప బీదరూర్ తెలిపాడు.
ఇదిలా ఉండగా, మంత్రులు బూతు సినిమాలు చూస్తుండగా రికార్డు చేసినందుకు మీడియాను కూడా కమిటీ తప్పు పడుతోంది. మీడియా కూడా తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కమిటీ కోరింది. టెలివిజన్ మీడియా కంపెనీలకు కూడా ప్రశ్న పత్రాలను అందించాలని కమిటీ భావించిందట. అసెంబ్లీ లోపల అధికారికంగా జరిగే కార్యకలాపాలను మాత్రమే వార్తా టెలివిజన్ చానెళ్లు కవర్ చేయాల్సి ఉండగా అంతకు మించి రికార్డు చేయడం కరెక్టేనా అని కమిటీ మీడియాను ప్రశ్నించదలిచింది. “మంత్రులు చూస్తున్న విజువల్స్ ‘అన్ పార్లమెంటరీ’ అని తెలిసినప్పటికీ మంత్రులు బూతు వీడియోలు తిలకిస్తున్న దృశ్యాన్ని స్ధానిక చానెళ్ళు ఎందుకు చిత్రీకరించవలసి వచ్చిందీ తెలుసుకోగోరుతూ ప్రశ్నలు రూపొందించారు. మంత్రులు బూతు వీడియో చూస్తున్న దృశ్యాన్ని టి.వీ చానెళ్లలో ప్రసారం చేయడం ద్వారా మంత్రుల ‘భావ ప్రకటనా స్వేచ్ఛను’ హరించి వేసినట్లు కాదా అని కూడా కమిటీ తెలుసుకోగోరింది.
ప్రజా పాలనను, ప్రజా సమస్యల పరిష్కారాన్నీ గాలికి వదిలేసి సాక్ష్యాత్తూ అసెంబ్లీలోనే బూతు వీడియోలు చూడడం ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ అవుతుందని కమిటీ పెద్దలు ఎలా భావించారు? ఇంకా నయం. సభా హక్కుల ఉల్లంఘన నేరాన్ని మీడియా కంపెనీలపై మోపలేదు! ప్రజా స్వామ్య వ్యవస్ధలో పత్రికలపై ఉన్న బాధ్యతల విషయం కమిటీ పట్టించుకుంటున్నట్లు లేదు. ప్రజల ఓట్లతో గెలిచి కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే పని చేస్తామని ప్రమాణం చేసిన వారు ఎమ్మెల్యేలూ, మంత్రులు.   ఆ పని చేయకపోగా పోకిరీల లెక్కన వారు బూతు వీడియోలు తిలికిస్తే దానిపై నిఘా పెట్టి ప్రజలకు వారెన్నుకున్న ప్రతినిధులు ఎలా వ్యవహరిస్తున్నదీ తెలియజెప్పే బాధ్యత పత్రికలు, చానెళ్లపై ఉంటుందని కమిటీ తెలుసుకోవాలి.
అధికారిక అసెంబ్లీ కార్యకలాపాలను మాత్రమే కవర్ చేసి అనధికారికంగా జరిగే అనైతిక కార్యకలాపాలను చూసీ చూడనట్లు పత్రికలు వదిలేయాలని కమిటీ కోరుతోందా?
మంత్రుల గుట్టు రట్టయ్యాక స్పీకర్ కొన్ని చర్యలు ప్రకటించాడు. ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తనను అరికట్టడానికి ఆ చర్యలు ఉద్దేశింపబడ్డాయనుకుంటే పొరబాటే. ఎమ్మేల్యేలు, మంత్రులు అసెంబ్లీలో కూర్చుని ఎంత చెత్త పనులు చేసినా వాటిని రికార్డు చేసే అవకాశం, నిఘా పెట్టే అవకాశం ప్రభుత్వానికి తప్ప మరొకరికి లేకుండా చేయడానికే ఈ చర్యలు ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వమే తన సొంత కెమెరాలను అసెంబ్లీలో వాడుతుందట. పాతిక కోట్లు ఖర్చు పెట్టి ఆ ఏర్పాట్లు చేయాలని స్పీకర్ నిర్ణయించాడు. అసెంబ్లీలో ప్రవేటు టెలివిజన్ చానెళ్ల కెమెరాలను అనుమతించరాదని కూడా నిర్ణయించారు. తప్పులు బైటపడకుండా ఉండడానికే స్పీకర్ ఆసక్తి తప్ప తప్పులు చేయనీయకుండా ఉండడానికి కాదు.
ఇదంతా భారత దేశ సంస్కృతిని పరిరక్షించడానికే కంకణం కట్టుకున్న హిందూత్వ పార్టీ బి.జె.పి పాలనలోనే జరుగుతోంది. వీరి అనుచర సంస్ధలు హిందూ సంస్కృతి గంగలో కలుస్తోందని నానా హైరానా పడతాయి. ప్రేమికుల రోజున పార్కుల వెంట బడి ప్రేమికులను చెరబట్టి వారికి పెళ్ళిళ్ళు చేసేస్తాయి. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారంటూ పబ్ లపై దాడులు చేసి ఆడవాళ్లపై చేయి చేసుకోవడానికి కూడా వెనకాడవు.  బి.జె.పి అధికారంలో ఉన్న చోట్ల సైతం పబ్ లు అలరారుతున్నా వాటిని రద్దు చేయించడానికి మాత్రం పూనుకోవు. ఈ సంస్కృతీ పరి రక్షకులకు బి.జె.పి పాలనలో పబ్బులు ఒక వ్యాపారంగానూ, ఇతర పార్టీల పాలనలో సంస్కృతీ వినాశకారులుగానూ కనిపిస్తాయి మరి. వీరి పార్టీల మంత్రులు అసెంబ్లీలల్లో బూతు సినిమాలు చూస్తూ భారతీయ సంస్కృతిని కాపాడే బృహత్తర కృషిలో నిమగ్నమై  ఉన్నారని జనం నమ్మాలి.
నవ్విపోదురుగాక!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి