26, మార్చి 2012, సోమవారం

మరో భారీ కుంభకోణం


  • బొగ్గు కేటాయింపుల్లో ఖజానాకు
  • 10.6 లక్షల కోట్ల గండి
  • వెల్లడించిన కాగ్‌ నివేదిక
  • దర్యాప్తునకు ప్రతిపక్షం డిమాండ్‌
కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణం వరుసలోనే మరో కుంభకోణం యుపిఎ సర్కారు మెడకు చుట్టుకుంది. దాదాపు 1.76 లక్షల కోట్ల రూపాయల మేర ఖజానాకు గండికొట్టిన 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణం కంటె ఇది మరింత పెద్దది కావటం గమనార్హం. 2004-2009 మధ్య దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవకతవకల కారణంగా ఖజానాకు రూ.10.6 లక్షల కోట్ల మేర గండి పడిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించిన సమాచారం తీవ్ర దుమారం రేపింది. బొగ్గు గనులను ఆయా సంస్థలకు వేలం పద్ధతిని కాక ఇతర విధానాల్లో కేటాయించటం వల్ల గత ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అప్పటి ధరల ఆధారంగా అంచనా వేసిన కాగ్‌ ఈ కేటాయింపుల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు 3.37 లక్షల కోట్లు, ప్రైవేటు సంస్థలు 2.94 లక్షల కోట్ల మేర 'గాలివాటు లాభాలు' ఆర్జించాయని తన ముసాయిదా నివేదికలో తేల్చి చెప్పింది.
భారీ నిక్షేపాలున్న దాదాపు 155 బొగ్గు గనుల కేటాయింపునకు వేలం పద్ధతిని అనుసరించకుండా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కేటాయించటం ద్వారా ప్రభుత్వం దాదాపు 10.67 లక్షల కోట్ల ఆదాయానికి నీళ్లొదులుకుంది. 2004 నుండి 2009 వరకూ ప్రభుత్వం అనుసరించిన ఈ వైఖరి ద్వారా దాదాపు వంద ప్రైవేటు కంపెనీలు అనుచిత లబ్ధి పొందాయని, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందని కాగ్‌ నివేదికను ఉటంకిస్తూ కొన్ని ప్రముఖ పత్రికలు గురువారం వార్తా కథనాలను ప్రచురించాయి.

వేలం వేయకుండా ఏకపక్షంగా గనులు కట్టబెట్టినందువల్ల ప్రస్తుత ధరల ప్రకారం 10 లక్షల కోట్లకు పైగా నష్టం వచ్చిందన్న కాగ్‌ కేటాయింపుల నాటి ధరలను పరిగణనలోకి తీసుకున్నా ఈ నష్టం రు.6 లక్షల కోట్ల పైమాటేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం అనుసరించిన విధానం ద్వారా వీటిలో ప్రతి ఒక్క కంపెనీ ప్రభుత్వ రంగంలోని కోల్‌ ఇండియా సంస్థ విక్రయాల కన్నా భారీగానే లాభాలను మూటకట్టుకున్నదని కాగ్‌ అంచనా వేసింది. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరు అయిన బొగ్గును ప్రైవేటు సంస్థలకు కేటాయించేందుకు వేలం విధానాన్ని అనుసరిస్తే కేటాయింపు మరింత పారదర్శకంగా వుండేదని కాగ్‌ వ్యాఖ్యానించింది. దేశంలోని సహజ వనరులకు ప్రజల తరపున యాజమాన్య బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రభుత్వం వీటి ప్రయోజనాలను పౌరులకు అందచేసే పద్ధతిని నిర్ధారించుకోకుండా ప్రైవేటు సంస్థలకు కేటాయించ జాలదని కాగ్‌ స్పష్టం చేసింది.
దీనిపై బొగ్గు మంత్రిత్వ శాఖ సమాధానమిస్తూ 2004 జూన్‌లో కోల్‌ ఇండియా సంస్థ సరఫరా చేసిన బొగ్గు ధరలకు, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన గనుల్లో కేప్టివ్‌ మైనింగ్‌ ఉత్పత్తుల ధరలకు భారీ వ్యత్యాసం వుందని వివరించింది. ఇందువల్ల కేటాయింపులు పొందిన ఆయా సంస్థలకు లాభాలు భారీగానే వుంటాయని భావించినట్లు తెలిపింది.
దద్దరిల్లిన పార్లమెంటు... ఉభయ సభలూ వాయిదా
గురువారం పత్రికల్లో ప్రచురితమైన బొగ్గు కుంభకోణం వార్తలు పార్లమెంటులో పెను దుమారాన్నే సృష్టించాయి. ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సభ్యులను అదుపు చేయటంలో విఫలమైన సభాపతులిరువురూ ఉభయ సభలను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే జెడియు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ దానిపై తక్షణమే చర్చకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు స్పీకర్‌ మీరా కుమార్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టటంతో బిజెపి, జెడియు సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తంచేస్తూ పోడియంను చుట్టుముట్టారు. సభ్యులను సముదాయించేందుకు ప్రయత్నించిన స్పీకర్‌ పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా ఇదే తరహా వాతావరణం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్‌ చేసి ఈ కుంభకోణంపై చర్చను చేపట్టాలంటూ తాను సభాధ్యక్షుడికి నోటీసు ఇచ్చినట్లు బిజెపి సభ్యుడు ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పినపుడు తీవ్ర గందరగోళం చెలరేగింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్‌ చేసేందుకు ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ నిరాకరించటంతో సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభాధ్యక్షుడి అనుమతి లేకుండా ఈ అంశాన్ని ప్రస్తావించరాదని ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి వి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. సభ్యులు వార్తా కథనాలు ప్రచురితమైన పత్రికలను చూపుతూ నినాదాలు చేస్తుండటంతో ఆగ్రహించిన ఛైర్మన్‌ అప్రస్తుత అంశాలను సభ్యులు సభలో ప్రస్తావించరాదని రూలింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా రాజ్యసభలో వున్నారు. స్వయంగా ప్రధాని నిర్వహణలోనే వున్న బొగ్గు శాఖలో ఈ భారీ కుంభకోణం చోటు చేసుకున్నదని బిజెపి నేత జవదేకర్‌ ఎద్దేవా చేశారు. సభ్యులను నివారించేందుకు విఫలయత్నం చేసిన ఛైర్మన్‌ తరువాత సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తరువాత కూడా ఇదే వాతావరణం కొనసాగటంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కుంభకోణం వార్తలను తోసిపుచ్చిన ప్రధాని
తన నిర్వహణలోని బొగ్గు శాఖలో గనుల కేటాయింపునకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తోసిపుచ్చారు. కాగ్‌ తన కార్యాలయానికి రాసిన లేఖను ఆయన ప్రస్తావిస్తూ బొగ్గు గనుల వేలంపై ప్రచురితమైన పత్రికా కథనాలు ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వున్నాయన్నారు. ప్రస్తుతం ప్రాథమిక చర్చల దశలో వున్న ఈ వ్యవహారంపై ప్రచురితమైన పత్రికా కథనాలకు కనీసం ముందస్తు ముసాయిదా నివేదిక కూడా ఆధారం కాదని, ఇవి పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా వున్నాయని కాగ్‌ రాసిన లేఖను ఆయన లోక్‌సభలో చదివి వినిపించారు.
పారదర్శక పద్ధతిలోనే గనుల కేటాయింపు: జైస్వాల్‌
బొగ్గు గనుల కేటాయింపులో ప్రభుత్వ ఖజానాకు రు.10.67 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్న వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. పారదర్శక విధానంలోనే తాము ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు బొగ్గు గనులను కేటాయించామని బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్‌ జైస్వాల్‌ వెల్లడించారు. బొగ్గు గనుల కేటాయింపునకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనలు జారీ చేశామని, తమకు అందిన దరఖాస్తులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన అనంతరమే ఆయా సంస్థలకు గనులను కేటాయించామని ఆయన ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
సిబిఐ దర్యాప్తునకు బిజెపి డిమాండ్‌
బొగ్గు గనుల కేటాయింపులో వేలం పద్ధతిని అనుసరించకపోవటం వల్ల ఖజానాకు రు.10.67 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్న కాగ్‌ నివేదిక ముసాయిదాపై ప్రధాన ప్రతిపక్షం బిజెపి తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయస్థానం పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసింది. బిజెపి ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ బొగ్గు గనులను వేలం వేయకుండా నేరుగా ఎందుకు కేటాయించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. యుపిఎ సర్కారు కుంభకోణాల సర్కారుగా మారిపోయిందని, నింగి (విమానయానం) నుండి నేల (గనుల) వరకూ అనేక కుంభకోణాల్లో ప్రభుత్వం కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి