27, మార్చి 2012, మంగళవారం

పనికిరాని వాహనాల కొనుగోలుకు ఆర్మీ చీఫ్ కి రు.14 కోట్ల లంచం ఆఫర్

600 సబ్ స్టాండర్డ్ వాహనాల కొనుగోలుకు ఆర్మీలోనే ఉన్న మరొక ఉన్నతాధికారి తనకు రు.14 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ వెల్లడించాడు. తనకు లంచం ఇవ్వజూపిన అధికారి ప్రస్తుతం రిటైర్ అయ్యాడని ఆయన తెలిపాడు. సంఘటన జరిగిన వెంటనే ఈ విషయం రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని కి తెలియజేశానని వి.కె.సింగ్ తెలిపాడు. అయితే వి.కె.సింగ్ పత్రికలకు ఈ సంగతి వెల్లడించాక మాత్రమే, సోమవారం, రక్షణ మంత్రి సి.బి.ఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. “ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఈ సంగతి చూడవలసిందే. దీనిపై చర్య తీసుకున్నాను” అని సి.బి.ఐ విచారణను ఉద్దేశిస్తూ ఏ.కె.ఆంటోని పత్రికలతో చెప్పాడు.
లంచం ఇవ్వడానికి ఒక ఆర్మీ అధికారి నేరుగా తనవద్దకే రావడం ఆందోళనకరమైన విషయమని వి.కె.సింగ్ పత్రికలతో వ్యాఖ్యానించాడు. “ఒక్కసారి ఊహించండి. వీరిలో ఒక వ్యక్తి నేరుగా నా దగ్గరికే వచ్చి వాహనాల కొనుగోలుకు అనుమతీస్తే రు.14 కోట్లు చెల్లిస్తానాని ధైర్యంతో చెప్పగలిగాడు. అతను నాకు, ఒక ఆర్మీ చీఫ్ కి లంచం ఇస్తానని ఆఫర్ చేశాడు. ఇంతకు ముందూ లంచం తీసుకున్నారనీ, తన తర్వాత కూడా లంచం తీసుకుంటారని అతను నాతో అన్నాడు” అని వి.కె.సింగ్ ‘ది హిందూ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నిర్ధిష్ట మోడల్ కి చెందిన పనికి రాని వాహనాలు ఒకేసారి 600 కొనుగోలు చేయడానికి ఆమోదం చెప్పడానికే తనకు లంచం ఇవ్వజూపారని సింగ్ వెల్లడించాడు.
తనకు లంచం ఇవ్వజూపిన సంగతి ఆర్మీ చీఫ్ మీకు చెప్పాడా అని రక్షణ మంత్రిని ప్రశ్నించగా ‘పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున తాను ఆ సంగతి చెప్పలేనని ఏ.కె.ఆంటోని బదులిచ్చాడు.
తనకు లంచం ఇవ్వజూపిన వాహనాలు అప్పటికే 7000 ఆర్మీలో ఉన్నాయని కూడా వి.కె.సింగ్ వెల్లడించాడు. అనేక సంవత్సరాల పాటు ఆర్మీ ఈ వాహనాలు కొనుగోలు చేసిందని ఆయన తెలిపాడు. ఈ వాహనాలు ఉపయోగించడానికి ఆర్మీకి అవకాశాలు లేవనీ అయినా సంవత్సరాల తరబడి వాటిని కొంటూ పోయారని వెల్లడించాడు. తనకు లంచం ఇవ్వజూపిన వారి ధైర్యానికి తాను షాక్ తిన్నాననీ, నేరుగా రక్షణ మంత్రి వద్దకి వెళ్ళి విషయం చెప్పాననీ సింగ్ తెలిపాడు. “నేనీ పదవికి తగనని భావిస్తే చెప్పండి. వెంటనే తప్పుకుంటాను” అని ఆంటోనీ తో చెప్పానని సింగ్ తెలిపాడు.
ఎక్కడో ఆర్మీకి చెందిన నైతిక ధృతి, సమగ్రత పతనం అయినందువల్లనే ఒక లాబీయిస్టు నేరుగా ఆర్మీ చీఫ్ కే లంచం ఇవ్వజూపే పరిస్ధితి ఏర్పడిందని వి.కె.సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆర్మీలో అవినీతి నిర్మూలనకు కృషి చేసినందునే తన పుట్టిన రోజు విషయమై వివాదం రేకెత్తించారని సింగ్ ఆరోపించాడు. పరిస్ధితులను దారిలో పెట్టడానికి తాను తీవ్రంగా శ్రమించాననీ, జవాన్లకు అందజేసే రేషన్లు, దుస్తులు లాంటివి ఉన్నతాధికారులతో ఏ మాత్రం స్ధాయి, క్వాలిటీ తగ్గకుండా ఉండడానికి శ్రమించాననీ సింగ్ తెలిపాడు. తన కృషి నచ్చని వారే తన పుట్టిన రోజు విషయమై వివాదం రేకెత్తించారని సింగ్ ఆరోపించాడు.
వి.కె.సింగ్ పుట్టిన రోజు విషయంలో గత రెండు సంవత్సరాలుగా వివాదం నలిగిన సంగతి విదితమే. వి.కె.సింగ్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ లో పుట్టిన సంవత్సరం 1950గా నమోదు కాగా ఆర్మీలో ఒక విభాగంలో చేరే సమయంలో పొరబాటున 1951 గా నమోదయింది. ప్రమోషన్లు పొందే సమయంలో ఈ సంగతిని సింగ్ ఎత్తిచూపి సరిచేయాలని కోరినప్పటికీ ప్రమోషన్ వ్యవహారం పూర్తయ్యాక సరి చేస్తామన్న మాట హామీతో అప్పటికి తాను ఊరకున్నాననీ సింగ్ తెలిపాడు. ఆ తర్వాత కూడా అదే తేదీ కొనసాగడంతో దాన్ని సరి చేయాలని సింగ్ సుప్రీం కోర్టును కోరాడు. ప్రభుత్వం దానికి నిరాకరించడంతో సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వ వాదనను అంగీకరిస్తూ తీర్పు చెప్పింది.
తాను ఆర్మీ చీఫ్ గా అయ్యాక మాత్రమే మరొక సంవత్సరం పదవిలో కొనసాగడానికి వీలుగా పుట్టిన రోజు సంగతిని వి.కె.సింగ్ లేవనెత్తాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను సింగ్ తిరస్కరిస్తూ వచ్చాడు. తన వాస్తవ పుట్టిన రోజు 1951 సంవత్సరమేనని ప్రభుత్వం అంగీకరిస్తే వెంటనే రాజీనామా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వానికి చెప్పినట్లుగా వి.కె.సింగ్ తెలిపాడు. ప్రభుత్వ నిర్ణాయనికి ఒక ఆర్మీ చీఫ్ విధేయుడుగా ఉండాలని భావిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి తాను ఒప్పుకున్నానని వి.కె.సింగ్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అందుకే సుప్రీం కోర్టు నిర్ణయాన్ని సవాలు చేయలేదని ఆయన తెలిపాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి