26, మార్చి 2012, సోమవారం

“బొగ్గు నష్టం” నివేదికపై చర్చలు ఇంకా పూర్తి కాలేదు -కాగ్


సంవత్సరాలవారీగా జరిగిన కేటాయింపులు, ఖజానాకి వాటిల్లగల నష్టాలను కాగ్ పై విధంగా లెక్కించింది.
ప్రవేటు, ప్రభుత్వ కంపెనీలకు బొగ్గు గనులను చౌకగా కేటాయించడం వల్ల కేంద్ర ఖజానాకు రు. 10.67 లక్షల కోట్ల నష్టం వచ్చిందంటూ తాను తయారు చేసిన నివేదిక పై చర్చలు ఇంకా పూర్తి కాలేదని కాగ్ ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నది. చర్చలు పూర్తిగా కాక మునుపే, నివేదికను ఇంకా పూర్తి చేయక ముందే లీక్ కావడం తమను నిశ్చేష్టుల్ని చేసిందని కాగ్ తన లేఖలో తెలిపింది. తాను పేర్కొన్నంత నష్టం వాస్తవానికి సంభవించిందీ లేనిదీ తామింకా చర్చిస్తున్నామని కాగ్ తెలిపింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వం వైపు నుండి వచ్చిన వాదనలను తాము ఇంకా పరిశీలించి నిర్ణయించవలసి ఉందని కనుక అప్పుడే నష్టంపై ఒక అవగాహనకి రాలేమని తెలిపింది. ప్రభుత్వం వాదనలు పూర్తిగా విన్న తర్వాత తమ ఆలోచనలో మార్పు రావడానికి అవకాశాలున్నాయని కాగ్ తెలిపింది.
ప్రభుత్వం వినిపించిన వాదనలు కొన్నింటిని కాగ్ తన నివేదికలోనే తిరస్కరించింది. కాప్టివ్ బొగ్గు గనులను వ్యాపారం కోసం వినియోగించే అవకాశం లేదనీ కనుక గనులను పూర్తిగా కంపెనీలకు వశం చేసినట్లు భావించరాదనీ, బొగ్గు ద్వారా కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్ ధరలను నియంత్రించేందుకు రెగ్యులేటరీ బోర్డులు ఉన్నాయనీ కనుక కంపెనీలకు చేకూరిన ఆయాచిత లాభాలు వినియోగదారులకు చేరుతుందని బొగ్గు మంత్రిత్వ శాఖ వాదించింది. అయితే వ్యాపార కంపెనీలకు రెగ్యులేటరీ బోర్డు నియంత్రణలు వర్తించవని చెబుతూ ఈ వాదనను కాగ్ తిరస్కరించింది. సహజ వనరులు ప్రజల తరపున ప్రభుత్వం నిర్వహించాలనీ, ప్రవేటు కంపెనీలకు చౌకగా అప్పజెపితే ఆ లాభం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది.
దేశంలో అనేక విద్యుత్, స్టీల్, సిమెంట్ కంపెనీలకు కేటాయించిన బొగ్గు గనులు నిర్దేశిత వినియోగానికి కాకుండా ఎగుమతులకు వినియోగిస్తున్న పరిస్ధితి ఉంది. క్యాప్టివ్ (నిర్దిష్ట ఉపయోగాలకు -విద్యుత్, సిమెంట్, స్టీల్ పరిశ్రమలకు- మాత్రమే వినియోగించాలంటూ కేటాయించడం) ప్రయోజనాలకు మాత్రమే బొగ్గు ను వినియోగిస్తున్నారా లేదా అని పరిశీలించే వ్యవస్ధలు కూడా పని చేస్తున్న దాఖాలు లేవు. ఈ నేపధ్యంలొ కాగ్ మరింతగా చర్చించి తీసుకునే నిర్ణయాలేవిటో తెలియవలసి ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి