26, మార్చి 2012, సోమవారం

కేంద్ర మంత్రి పదవిపై కన్నేసిన రేణుక


Publish Date:Mar 26, 2012
వివాదాస్పద కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి తెలంగాణా కోటా క్రింద కేంద్రమంత్రి పదవిని పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణా ప్రాంతం నుంచి ఎన్నికైన జైపాల్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన రేణుకా చౌదరి 1997-98 మధ్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగానూ 2006-2009 మధ్య మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ చార్జ్) గా పనిచేశారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో ఆమె లక్షా యాభైవేల వోట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలయ్యారు. అయినా అధిష్టానం దగ్గర ఆమె పలుకుబడి ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు నోటి దురుసుతనం ఉందని తెలిసినప్పటికీ ఆమెను సోనియా గాంధీ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. 2000 వ సంవత్సరలో ఆమె హాసన్ ఆలీ అనే నగల వ్యాపారి నుంచి సుమారు కోటిన్నర రూపాయల విలువైన వజ్రపుటుంగరాన్ని బహుమతిగా స్వీకరించి వివాదాల పాలయ్యారు.



1993 జనవరిలో ఢిల్లీ లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చేయిచేసుకోవడంతో ఆమెపై కేసు నమోదైంది. 2009 లో ఆమె పరాజయం పాలైనప్పటికీ ఢిల్లీలోని ప్రభుత్వ నివాస భవనాన్ని ఇప్పటి వరకు ఖాళీ చేయలేదు. స్పీకర్ కార్యాలయం అనేక నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె ఖాతరు చేయలేదు. ఇటువంటి నేపథ్యం ఉన్న రేణుకా చౌదరి ఇప్పుడు తెలంగాణా కోటాలో కేంద్రమంత్రి పదవికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోనియా గాంధీతో సన్నిహితంగా ఉంటున్న ఆమెకు మంత్రి పదవి దక్కితే తమ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని కోస్తాకు చెందిన కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు భయపడుతున్నారు. నిజానికి వీరిద్దరూ ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రేణుకా చౌదరి తెలుగుదేశం పార్టీనుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వలస పక్షి. అయితే ఈ వలస పక్షి కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరై సీనియర్లకు దక్కాల్సిన అవకాశాలను ఎగరేసుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి