2, మార్చి 2012, శుక్రవారం

కింగ్‌ ఫిషర్‌ క్యాలెం'డర్‌'


Shareఆదివారం అనుబంధం - సింహాద్రి నాగశిరీష   Sun, 12 Feb 2012, IST 
'ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరో దారి' అన్న సామెత వినే వుంటారు. అది కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌కు సరిగ్గా సరిపోతుంది. సన్నటి, పొడవాటి అమ్మాయిలు కనిపించీ కనిపించని వస్త్రాలతో సుందర ప్రకృతి రమణీయ ప్రదేశాలలో దిగిన ఫొటోలు ఈ క్యాలెండర్‌ ప్రధాన ఆకర్షణ. ఇందుకోసం కోట్లాది రూపాయలను నీళ్లలా వెచ్చిస్తారు. అలాగని ఇది అందరికీ అందుబాటులో వుండదు. వివిపైపీలకు మాత్రమే కింగ్‌ఫిషర్‌ అధినేత స్వహస్తాలతో అందజేస్తారు. ఇంతకీ ఈ కింగ్‌ఫిషర్‌ క్యాలండర్‌ కహానీ ఏంటి? మోడళ్ల ఎంపిక ఎలా చేస్తారు? లొకేషన్లను ఎలా ఎంచుకుంటారు? వంటి అనేకానేక అంశాలు ఈ వారం అట్టమీది కథలో.
సాధారణంగా క్యాలెండర్‌ గురించి తెలీనివారుండరు. మనకు తెలిసినంతవరకు క్యాలెండర్‌ అంటే ప్రతి ఏడాదీ ఆ సంవత్సరానికి సంబంధించిన తేదీలు, వారాలు, పండుగలు, పబ్బాలు, ప్రముఖుల జయంతులు, వర్థంతులు, ప్రభుత్వ సెలవు దినాలు వంటివి ఉంటాయి. అదే తెలుగు క్యాలెండర్‌ అయితే నక్షత్రాలు, ఘడియలు, విఘడియలు, మూఢాలు, తిథులు, వారాలు అంటూ మరికొన్ని విషయాలు ఉంటాయి. ఈ క్యాలెండర్‌ ఖరీదు బహుశా ఓ ఐదు, మహా అయితే పది రూపాయల దాకా ఉండొచ్చు. ఇక ఇప్పటి సంగతైతే అసలు క్యాలెండర్‌ కొనవలసిన అవసరం కూడా ఉండడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ, ప్రయివేటు అనే భేదం లేకుండా ప్రతి సంస్థా క్యాలెండర్లు ప్రచురిస్తోంది. వాటిని తమ సంస్థ ఉద్యోగులకు, ఖాతాదార్లకు అందిస్తోంది. ఇక దుకాణాల సంగతికొస్తే, తమ వద్దకు వచ్చే వినియోగదారులకు కొనుగోలు చేసిన వస్తువులతో పాటుగా ఇచ్చేస్తున్నారు. తద్వారా ఆయా సంస్థలకు, వస్తువులకు దుకాణాలకు, బ్రాండ్లకు తగిన ప్రచారం కలుగుతోందని వారి ఉద్దేశ్యం. ఆ ఉద్దేశ్యం వాస్తవం కూడాను. కొన్ని క్యాలెండర్లు కేవలం సంస్థల లోగోలకే పరిమితమౌతున్నాయి. అయితే కొన్ని సంస్థలు తెలివిగా దేవతలు, ప్రముఖులు, సినీ తారలు, ఇంకా తమ తమ ఆలోచనలకు తగిన విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాయి. ఇదంతా సామాన్య ప్రజానీకానికి కూడా తెలిసిన కనీస విషయం. కానీ ఒక సంస్థ కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో, అనేక వ్యయ ప్రయాసలకోర్చి సంవత్సరం పొడవునా అదే పనిగా పెట్టుకుని క్యాలెండర్లు ప్రచురించి అమ్మకుండా కేవలం కొందరికే అందజేస్తోంది. ఫలితంగా ప్రపంచఖ్యాతి గడించింది. ఆ క్యాలెండర్‌ సృష్టికర్త, యజమాని ఒక భారతీయుడేనంటే నమ్మశక్యం కాదు. కోట్ల వ్యయంతో ప్రచురితమైన క్యాలెండర్‌ అంటే కచ్చితంగా దానిలో ఏదో విశేషం ఉండి తీరాలి. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైంది అంటే దానిలో కచ్చితంగా విషయం ఉండి తీరాలి. దానివల్ల సంస్థకు బాగా ప్రాచుర్యం కలిగి లాభాల దిశగా దూసుకెళ్లిందంటే అందులో విషయం మంచిదా కాదా? నిజంగా విశేషం ఉందా? లేదా అని రకరకాల ప్రశ్నలు మనలో తలెత్తడం సర్వ సాధారణం. మనలో ఇన్ని ఆలోచనలు రేకెత్తించిన ఆ క్యాలెండర్‌ పేరే 'కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌'.
కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ను మొట్టమొదటిసారిగా 2003వ సంవత్సరంలో విడుదల చేశారు. ఫ్యాషన్‌ ఇండిస్టీలోనే ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్లు, ఫ్యాషన్‌ కొరియోగ్రాఫర్లు, మోడళ్లు, ఫొటోగ్రాఫర్‌ కృషి ఫలితమే ఈ స్విమ్‌ సూట్‌ క్యాలెండర్‌. ప్రతి సంవత్సరం ఆరుగురు మోడళ్లను ప్రత్యేకంగా ఈ క్యాలెండర్‌ కోసం ఎంపిక చేస్తారు. వీరు బికినీలు ధరించి ప్రతి నెలా వివిధ భంగిమల్లో ఉంటారు. మరో ప్రత్యేకత ఏమంటే...ఈ క్యాలెండర్‌ అందరికీ అందుబాటులో ఉండదు. ఇక ఫొటో షూట్‌ విషయానికొస్తే ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రకృతి అందాలతో విలసిల్లే, సామాన్యులు ఎన్నడూ చూడని ప్రదేశాలను ఎంపిక చేసి అక్కడ నిర్వహిస్తారు. 2012 కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ షూట్‌ శ్రీలంకలో జరిగింది. ప్రముఖులంతా ఈ క్యాలెండర్‌ను ఇండియన్‌ పీరెల్లీ క్యాలెండర్‌గా అభివర్ణిస్తారు. ఈ క్యాలెండర్‌కు ఫొటోగ్రాఫర్‌గా అతుల్‌ కస్బేకర్‌ వ్యవహరిస్తున్నారు.
ప్రపంచంలోని ఇతర దేశాలకు ధీటుగా బికినీ ధరించి అంగాంగ ప్రదర్శన చేయడానికి భారతీయ (మహిళ) మోడల్‌ ఏమాత్రమూ తీసిపోదని నిరూపించిన 'ఘనత' ఈ క్యాలెండర్‌దే. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, కింగ్‌ఫిషర్‌ బీర్‌ సంస్థలు యునైటెడ్‌ బ్రేవరీ గ్రూప్‌కు చెందినవి. భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా దీనికి అధినేత. వివిధ సంస్థలు సాధారణంగా గ్లామర్‌తో కూడిన క్యాలెండర్లను తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు ఎరలా వాడుకోవడం చూస్తుంటాం. మిగతా సంస్థల మాట ఎలా వున్నా ఎలిగెంట్‌, సెన్సువస్‌ అనే పేర్లతో అంగట్లో అంగాంగ ప్రదర్శన చేసే బొమ్మగా స్త్రీని నిలబెట్టినందుకుగాను, మన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ నిస్సందేహంగా దేశంలోనే విజయవంతమైన ప్రయివేటు ఎయిర్‌లైన్‌గా కొంతకాలం నిలబడిన మాట వాస్తవమే. ఇదంతా కూడా క్యాలెండర్‌ అమ్మకాల వల్లే జరిగిందనుకుంటే పొరపాటే. కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌ కూడా పీరెల్లి క్యాలెండర్‌ బాటలోనే నడుస్తోంది. ఈ క్యాలెండర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొంతమంది వి.ఐ.పిలకు మాత్రమే విజరుమాల్యా స్వయంగా అందజేస్తారు. అసలు ఇలాంటి ఒక క్యాలెండర్‌ను భారతదేశంలో కూడా విడుదల చేయాలి అనే 'గొప్ప ఆలోచన' మాట్రిక్స్‌ అనే ఎంటర్‌టైన్‌మెంట్‌ కన్సల్టెన్సీ ఫర్మ్‌, విజరుమాల్యా దగ్గర మొదటిసారిగా ప్రస్తావించిందట.
పీరెల్లి క్యాలెండర్‌
పీరెల్లి క్యాలెండర్‌ ఒక వాణిజ్య (ట్రేడ్‌) క్యాలెండర్‌. పీరెల్లి కంపెనీ అనుబంధ వ్యాపార సంస్థ యుకె దీనిని నిర్వహిస్తోంది. ఈ క్యాలెండర్‌ ఫ్రాన్స్‌ దేశానికి (చెందినది) సంబంధించినది. ఇది 1964లో వార్షిక క్యాలెండర్‌గా అవతారమెత్తింది. పీరెల్లి క్యాలెండర్‌ పరిమిత విడుదలకు అంటే పరిమితంగా లభ్యమయ్యే క్యాలెండర్‌గా ప్రసిద్ధికెక్కింది. ఎందువల్లనంటే ఇది అమ్మకానికి ఉద్దేశించిన క్యాలెండర్‌ కాదు. ఒక పరిమిత సంఖ్యలో తయారయ్యే ఈ క్యాలెండర్‌ను చాలా ముఖ్యమైన పీరెల్లి ఖాతాదారులకు, ప్రముఖులైన విఐపిలకు మాత్రమే సంస్థ తరపు నుండి గిఫ్ట్‌గా అందిస్తారు. ఈ క్యాలెండర్‌లో ఆకర్షణీయమైన చిత్రాలతో పాటు నగంగా ఉండే స్త్రీల చిత్రాలు కూడా ఉంటాయి. పైగా ఇది ఆడవారి క్యాలెండర్‌గా ప్రపంచ ఖ్యాతి గాంచిందని సంస్థ ఎంతో గర్వంగా చెప్పుకునే తీరు చూస్తే అసహ్యంగానూ, అసభ్యంగానూ అనిపించక మానదు. 1974 తర్వాత ఓ దశాబ్దం పాటు దీనిని నిలిపేసి, ఆ తర్వాత మళ్లీ పునరుద్ధరించారు.

అవార్డులు
2004, 2005 సంవత్సరానికి గాను 'కింగ్‌ ఫిషర్‌ స్విమ్‌ సూట్‌ స్పెషల్‌' లండన్‌లో 'ఎఫ్‌.ఎ.బి' (ఫ్యాబ్‌) అవార్డును వరుసగా రెండుసార్లు గెలుచుకుంది. బిజినెస్‌ పరంగా తమ అమ్మకాలను పెంచుకునే ప్రచారంలో భాగంగా ఎంతో సృజనాత్మకత పదర్శించిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 'ఎఫ్‌.ఎ.బి' అంటే ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ అవార్డు. ఇదే కాకుండా క్యాలెండర్‌ వెబ్‌సైట్‌ www.kingfisher calender.com కూడా అవే సంవత్సరాలలో అనగా 2004, 2005లో వెబ్‌ సైట్‌ డిజైనింగ్‌లో ప్రతిభ చూపినందుకు ఇంటర్నేషనల్‌ డిజైన్‌ ఫర్మ్స్‌ అవార్డును అందుకుంది.
విజయ్ మాల్యా
విజయ్ మాల్యా భారతదేశపు లిక్కర్‌, ఎయిర్‌లైన్స్‌ అధినేత. ప్రముఖ వ్యాపారవేత్త విఠల్‌ మాల్యా కుమారుడు. యునైటెడ్‌ బ్రేవరీస్‌ గ్రూప్‌, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌కు ఛైర్మన్‌. మద్యం తయారీలో ఈయన 'యునైటెడ్‌ స్పిరిట్స్‌' ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. ఈయన రాజ్యసభ సభ్యులు కూడా. స్వంత విమానం వేసుకొని అప్పుడప్పుడు ఆటవిడుపుగా పార్లమెంటు సమావేశాలకు వెళ్లివస్తుంటారు.
అంతేకాకుండా ఫార్ములా వన్‌ రేసింగ్‌లో ఫోర్స్‌ ఇండియాకు, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌లో ఐ-లీగ్‌కు భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ వారి అంచనా ప్రకారం ఆయన ఆస్తి అక్షరాలా 140 కోట్ల డాలర్లు. మాల్యాకు సంబంధించిన విలాసవంతమైన పార్టీల నుండి భవంతులు, ఆటోమొబైల్స్‌, ఫోర్స్‌ ఇండియా, రాయల్‌ ఛాలెంజెస్‌ బెంగుళూరు, ఆయన వ్యక్తిగత విలాస నౌకగా చెప్పబడే 'ద ఇండియన్‌ ఎంప్రెస్‌'కు ఎప్పుడూ పత్రికల బలమైన కవరేజ్‌ ఉంటూనే ఉంటుంది. మాల్యా విలాసనౌక 'ద ఇండియన్‌ ఎంప్రెస్‌' ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద విహార నౌక కావడం విశేషం. దీని పొడవు 95 మీటర్లు (311 అడుగుల 8 అంగుళాలు). ఇక దీని ఖరీదు 8.9 కోట్ల డాలర్లు. అంటే సుమారు రు.450 కోట్లు.
లొకేషన్లు
ప్రతి సంవత్సరం కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ ఫొటో షూట్‌ ప్రపంచంలో పలు అందమైన లొకేషన్లను ఎంచుకుని అక్కడే నిర్వహిస్తారు. 2003 నుంచి ఇప్పటివరకు గల లొకేషన్ల వివరాలు...
2003 క్యాలెండర్‌ చిత్రీకరణ మారిషస్‌లోను, 2004 క్యాలెండర్‌ థారులాండ్‌లోను, 2005 దక్షిణాఫ్రికాలోను, 2006 ఆస్ట్రేలియాలోనూ జరిగింది.
ఇక 2007లో ఫొటోషూట్‌ను 'ద ఇండియన్‌ ఎంప్రెస్‌' అనే నౌకలో నిర్వహించారు. ఈ నౌక ఫ్రెంచ్‌ రెవేరియా (ఫ్రాన్స్‌కు ఆగేయ దిశగా ఉన్న మధ్య ధరా సముద్రతీర ప్రాంతాన్ని ఫ్రెంచ్‌ రెవేరియా అంటారు. ఈ ప్రాంతంలో మొనాకో దేశం కూడా చేరి ఉంటుంది. దీనికి అధికారికంగా ఎలాంటి సరిహద్దులూ లేవు. అయితే సాధారణంగా తూర్పున ఇటలీ సరిహద్దు నుండి పశ్చిమాన సెయింట్‌ ట్రోపెజ్‌ లేదా కాసిస్‌ వరకు ఉన్న ప్రాంతంగా పరిగణిస్తారు. ఫ్రెంచ్‌ రెవేరియా తీరప్రాంతం 560 మైళ్ల మేర విస్తరించి వుంటుంది. ఈ తీరం ఇసుక, చిన్న గులకరాళ్ల వంటి వాటితో కప్పబడి ఉంటుంది) తీరం గుండా ప్రయాణిస్తూ పలు అందమైన లొకేషన్ల వద్ద నిలిపి ఫొటో షూట్‌ నిర్వహించారు. ఆ లొకేషన్లు నైస్‌లోని హోటల్‌ నెగ్రెస్సో, సెయింట్‌.జీన్‌.క్యాప్‌- ఫెర్రెట్‌ లోని విల్లా ఎఫ్రూస్సీడీ రాడ్స్‌ చైల్డ్‌లు. విజరుమాల్యా కోరినందున 2007 క్యాలెండర్‌ కోసం ప్రముఖ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ డిజైన్‌ చేసిన స్విమ్‌సూట్లు ఎంపిక చేశారు.
2008 క్యాలెండర్‌ను భారతదేశంలో హిమాలయాల నుంచి రాజస్థాన్‌ రాజమహళ్లు, ఎడారులలో ఫొటో షూట్‌ జరిగింది.
2009లో థారులాండ్‌లోను, 2010లో హిందూమహాసముద్రంలోని నీలి జలాలు, పరిశుభ్రమైన బీచ్‌లతో ఉన్న మాల్దీవులకు చెందిన సొనేవా ఫుషీ, సొనే వాగిలీ అనే ప్రాంతాలలో తీశారు. 2011 క్యాలెండర్‌ను మారిషస్‌లోను, 2012 క్యాలెండర్‌ను శ్రీలంకలోని జట్‌ వింగ్‌లో చిత్రీకరించారు.

ఎన్‌.డి.టీవీ గుడ్‌ టైమ్స్‌ అనే ఫ్యాషన్‌ టీవీ ఛానెల్‌కు కూడా విజరుమాల్యానే అధినేత. చెప్పుకుంటూ పోతే ఈయనకు చాలా వ్యాపారాలున్నాయి. ఆయన ఛానెల్‌లో క్యాలెండర్‌ ఫొటోసెషన్‌ కష్టాలను కూడా చూపెడుతుంటారు.
కొన్ని కారణాల వల్ల కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఈ ఎయిర్‌లైన్స్‌ వ్యాపారం కోసం ప్రభుత్వం వద్ద నుంచి రుణాలు తీసుకుని నేడు నష్టాల వల్ల వాటిని తీర్చలేనని చేతులెత్తేసింది. పైగా ప్రభుత్వం బాధ్యత వహించవలసిందిగా కోరింది. ఒకవేళ ఈ ప్రయత్నం ఏ మాత్రమైనా సఫలమైందీ అంటే నష్టాలు భర్తీ చేయవలసిన భారం ప్రభుత్వంపై పడుతుంది. అంటే పరోక్షంగా మనపైనే. నష్టాల పూరింపు కార్యక్రమం కింద మొదటగా ప్రభుత్వం పన్నుల రూపంలోనో, మరే ఇతర రూపంలోనో ప్రజలపై ఆ భారాన్ని మోపుతుంది. లాభాలు మాత్రం విజరుమాల్యా ఒక్కడివే. కానీ నష్టం మాత్రం మనందరిదీ. అదే గమ్మత్తు మరి.
2012 క్యాలెండర్‌కు ఎంపికైన మోడళ్లు
1. ఏంజీలా జాన్సన్‌, 2. మెయా హైడన్‌, 3. మిమీ బ్లిక్స్‌, 4. తేనా దేసియా, 5. సెయామీ ఖేర్‌, 6. నథాలియా పిన్‌హైరో.
మోడల్స్‌ వేట
ఈ క్యాలెండర్‌కు అవసరమైన మోడళ్ల ఎంపిక మూడు అర్హతలపై ఆధారపడి ఉంది.
మొదటిది : ఎదుటివారిలో మోహం రేకెత్తించగలగడం
రెండోది : యాటిట్యూడ్‌ అంటే దృక్పథం
మూడవది : పరిపూర్ణ ఆకృతి
ఎంపికైన మోడళ్లందరిలో అత్యధిక మార్కులు స్కోర్‌ చేసుకున్న ఒకరిని కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ గర్ల్‌గా నిర్ణయిస్తారు. 2012 క్యాలెండర్‌ గర్ల్‌గా మోడల్‌ నథాలియా పిన్‌హైరో ఎంపికయ్యారు. మొదట్లో మోడళ్ల ఎంపిక విధానం సాధారణంగా ఉండేది. అంటే అప్లికేషన్‌ పంపిన ప్రతి అభ్యర్థినీ ఒక్కొక్కరుగా ఇంటర్వ్యూ చేసి అర్హత గల వారిని ఎంపిక చేసేవారు. కానీ క్రమంగా ఎన్‌డిటీవీ గుడ్‌ టైం ఛానెల్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని రియాలిటీ షోలను నిర్వహిస్తున్నారు. వారిలో అన్ని లెవల్స్‌ దాటుకుంటూ వచ్చి, అత్యధిక మార్కులతో నిలిచిన ఆరుగురిని చివరిగా ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో కూడా ఫొటో షూట్‌ ముఖ్యమైన అంకం అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఫొటోషూటే కదా అని తేలికగా కొట్టివేయకూడదు. ఎందుకంటే బికినీ ధరించడం ఒక ఎత్తైతే.... అందరి ముందు బికినీలో సౌకర్యంగా ఉండగలగడం, ఫొటోగ్రాఫర్‌ కోరిన భంగిమను ఎలాంటి బిడియం లేకుండా ప్రదర్శించడం మరో ఎత్తు. ఒక్కోసారి పులులు, సింహాలు, షార్క్స్‌ వంటి ప్రమాదాల మధ్య ఎడారుల్లో, సముద్రాల్లో జంతువులపై, భవంతుల మినార్‌లపై ఇలా...రకరకాల విన్యాసాలు కూడా చేయవలసి ఉంటుంది. టాప్‌లెస్‌ భంగిమలు కూడా ఇందులో ఓ భాగమే. ఇంత అసభ్యకరమైన అంగాంగ ప్రదర్శన అవసరమా అని కొందరంటే, అందులో ఫొటోగ్రఫీని మాత్రమే చూడాలి తప్ప వేరే దృష్టితో చూస్తే అది చూసిన వారిదే తప్పు అని వాదించేవారు మరికొందరు. 'ఫొటోగ్రఫీ కోసమే ఐతే ఇంతకుమించి వేరే దారిలేదా? ప్రకృతిలో ఎన్నో అందాలు ఇమిడి ఉన్నాయి. ఆ అందాలను బంధిస్తే సరిపోదూ...!' అని వాదించేవారూ లేకపోలేదు. తప్పొప్పుల సంగతి పక్కన పెడితే మోడళ్లకు కావలసింది డబ్బు. యాజమాన్యానికి కావలసింది ప్రచారం. ఫొటోగ్రాఫర్లకు, డిజైనర్లకు కావలసింది కీర్తి. క్యాలెండర్‌ అందుకోబోయే 'విఐపి'లకు కావలసింది అశ్లీలతతో కూడిన అందాలు. ఏ రకంగా చూసినా ఏదో ఒక రకంగా లాభపడడమే ధ్యేయం.
నేడు మన అందరికీ సుపరిచితమైన తారలు యానా గుప్త, కత్రినాకైఫ్‌, దీపికా పదుకొనే, ప్రియా త్రివేదీ, మోని కంగనా, నర్గీస్‌ ఫక్రీ, సుషారెడ్డి తదితరులంతా ఒకనాడు ఈ క్యాలెండర్‌లో బికినీలు ధరించి ఫోజులిచ్చినవారే. వీరే కాకుండా మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ తమ కెరియర్‌ను ఈ క్యాలెండర్‌ ద్వారా ఆరంభించడానికి ఇష్టపడేవారే. ఎంతోమంది మోడళ్లు తమ ఫొటోను ఈ క్యాలెండర్‌లో చూసుకోవాలనే కోరికతో కింగ్‌ ఫిషర్‌ ఆఫీసు ముందు బారులు తీరి ఉంటారు. క్యాలెండర్‌లో కన్పిస్తే మోడల్‌గా తమ మార్కెట్‌ పెరుగుతుందట. ఇదండీ ఫ్యాషన్‌ ప్రపంచం తీరుతెన్నులు. కింగ్‌ఫిషర్‌ ప్రత్యేకతలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి