అంగట్లో సొరకాయ ధర ఒక్కింటికి 18 రూపాయలు పల్కుతోంది. తగ్గిస్తాం...తగ్గిస్తాం అనే భీకర కోతలకు కొరుకుడు పడటం లేదు. ముంగిట్లోకి వచ్చే గ్యాస్‌బండ 400 రూపాయలకు అతి కష్టం మీద వంటింట్లోకి వచ్చి, వెలుగుతుంది. మీట నొక్కగానే వెలిగే బల్బు షాక్ కొట్టించే చార్జీలతో దెబ్బతీస్తుంది. నీటి కుళాయి తిప్పితే దూసుకువచ్చే నీరు నెలాఖరుకల్లా కళ్లు తిరిగేలా చేసే బిల్లులను కురిపించి, గుండె గుబేల్ మన్పిస్తుంది. ఇక మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో అమ్మా యిల పెళ్లిళ్లు చేయడం గగనకుసుమం తెచ్చినంతకష్టం. ఇక ప్రభుత్వకార్యాలయాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు, ఎక్కడ సర్కారు అనే పేరిట ఉన్న కార్యాలయానికి వెళ్లినా లంచం ఏకాదశావతారంలా తానున్నంటూ తళుక్కుమంటూ సగటు జీవిని సాధిస్తుంది. అక్కడ ఎక్కడో అన్నాహజారే అవినీతిపై దీక్ష వహిస్తూ, మధ్యలో అడ్డంకులతో విరమణ ప్రకటన చేస్తుంటాడు. అవినీతి భూతం వికటాట్టహాసం చేస్తూనే ఉంటుంది. సామాన్యుడు, మధ్యతరగతి సగటు జీవి దినదినగండం నూరేళ్ల ఆయుష్షు బతుకులీడుస్తాడు. 'సబ్ ఠీక్‌హై అంటూ సచివాలయంలో మంత్రులంతా బ్రేవో అంటూ బ్రేవుస్తారు. మంత్రాంగం జరుపుతారు. వారి భేటీల అనంతరం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు గారంగా సాగనంపేసుకుంటారు. సీఎం పేషీ నుంచి తమతమ కార్ల వరకూ వచ్చేంత వరకూ లోపాయి కారీగా మాట్లాడుకుంటారు. భేటీలలో ఎక్కడా ప్రజా సమస్యలపై సీరియస్ చర్చలు జరిపిన దాఖలాలు ఉండవు. మంత్రులంతా ఓ రకమైన భ్రాంతిలోనే ఉంటారు.
అసలు సమస్యలు ఏమిటి? ప్రజలు ఎందుకు ఆందోళనకు దిగుతారు? అనవసరపు ప్రకటనలతో, అర్థనగ్న ప్రదర్శనలతో ప్రజల యాగీ ఎందుకు? తాను చేసిందే శాసనం, చెప్పిందే వేదంగా వారంతా ఎందుకు వంగివంగి దండాలు పెట్టరు? ఠంచన్‌గా ఐదేళ్లకోసారి తామిచ్చే పదోపరకకో ఆశపడి ఎందుకు డబ్బాల్లో ఓట్లే య్యరు? ఇవన్నీ వారికి ధర్మసందేహాలుగానే మిగులు తుంటాయి. తామెంత కష్టపడి ఎమ్మెల్యే అయిందీ, ఎంతగా అసెంబ్లీలో నానాయాగీ చేసి, పొడియం వద్దకు దూసుకువెళ్లి, మార్కులు కొట్టేసి మంత్రులయిందీ ఉత్తు త్తిగానేనా? ఎంతకష్టం. ఎంత ఓపిక. సీట్లు దక్కించు కున్నాక కోట్లు రాబట్టుకోవద్దా? మరోమారు ఎన్నికల కోసం కోట్లు విదుల్చుకోవద్దా? ఈలోగా రాజభోగాలు అనుభ వించొద్దా... ప్రజాస్వామ్యమనే పాలకపక్ష రాజరికంలో మంత్రులు రాజుల్లాంటి వారని కొందరి అభిప్రాయం. ప్రజల కష్టసుఖాలనేవి వారివారి సొంతాలు.. వారు జన్మత కొనితెచ్చుకున్నవి. ఎవరి అదష్టం వారిదే అనుకునే అమాత్యులవారు కొందరు ఉండనే ఉన్నారు. ఈ మధ్యనే మంత్రివర్గ భేటీ జరిగింది. వ్యాట్‌హాట్, కరెంట్ పోటు ఇతర అజెండాలతో భేటీ సాగింది. ఈ చర్చలు టీకాఫీల సాక్షిగా జోరుగా సాగాయి. ఎటు తేలకుండా ముగిశాయి. అయితే మంత్రివర్గం ఏకధాటిన ఒకేఒక్క అంశంపై మరుమాట లేకుండా ఏకాభిప్రాయానికి వచ్చేసింది. అది ఏకంగా మంత్రుల జీతభత్యాల పెంపుదలకు సంబం ధించిన అత్యంత స్వీయకీలకాంశం. ప్రస్తుతమున్న లక్ష రూపాయల జీతభత్యాలను నెలకు 2 లక్షల 15 వేల రూపాయలకు పెంచేసుకుంటే పోలే అనే చర్చ జరగడం, దానికి అంతా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. పెంపుదల డిసెంబరు 2011 నుంచి అమలులోకి వస్తుంది. ఫిబ్రవరిలో బకాయిలతో సహా మంత్రులకు జీతభత్యాల రూపేణా వచ్చేది భారీ సొమ్ము. మంత్రులు జీతభత్యాల కోసమే ఎదురుచూడరని అందరికీ తెలుసు. అయితే వారు జీతభత్యాల పెంపుదల కోసం ఎంతో పట్టుదలతో, భేదాలన్నీ మరిచి ఏకాభిప్రాయానికి రావడం విశేషం.
జానియర్ డాక్టర్లు తమ భతిలో 5 వేల రూపాయలు పెంచాలని కోరుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స అందక రోగులు అల్లాడుతున్నారు. వ్యాట్ రద్దు చేయండంటూ వస్త్ర వ్యాపారులు దుకాణాలను మూసి వేశారు. ధర్నాచౌక్‌లో పలు డిమాండ్లతో రోజూ కొంగొత్త శిబిరాలు వెలుస్తున్నాయి. సుదూరంగా పంటపొలాలకు నీరందక రైతుల గుండెల్లో నిప్పులు రగులుతున్నాయి. ఇవన్నీ పరిష్కరించాలంటే పాపం ప్రభుత్వాలకు పంచవర్ష ప్రణాళికలే కాదు, యుగవర్ష ప్రణాళికలు కూడా సరిపోవు. అందుకే మంత్రులంతా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని, ప్రజా సమస్యలను పక్కకు పెట్టి అతి వేగంగా తమ జీతాల పెంపుదల నిర్ణయం తీసుకున్నారు. వారి దూకుడు ఖాతాలవారీగా చూస్తే రికార్డు స్థాయిలోనే ఉంది. ఉదాహరణకు క్యాంప్ ఆఫీసు అలవెన్స్‌ను 5 వేల నుంచి 15 వేలకు పెంచారు. ఇంధన చార్జీలను 7 వేల నుంచి 15 వేలకు హెచ్చించుకున్నారు. టూర్ల సందర్భంగా టీఏను రోజువారి 300 రూపాయల నుంచి 1500 రూపాయలకు పెంచారు. ఇక హైటెక్ సెల్‌ఫోన్ల కొనుగోళ్ల కోసం ఇచ్చే 15 వేల పరిమితిని 30 వేల రూపాయలకు పెంచారు. ఈ హెచ్చింపు నిర్ణయాల అనంతరం మంత్రులు తాము కోటీశ్వరులం కామని, కేవలం ద్విలక్షాధికారులమని పబ్లిగ్గా ప్రకటించుకోగలమనే ధీమాకు వచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి