-
ప్రపంచ వీక్షణం
ఒకవైపు జనాగ్రహాగ్నికి కొన్ని భవనాలు దగ్దం కాగా, మరోవైపు దాదాపు లక్షమంది పార్లమెంట్ భవనపు ముట్టడి, వారిపై వేలాది మంది పోలీసుల దమనకాండ... ఈ గందరగోళాల మధ్య ఆదివారం అర్ధరాత్రి గ్రీస్ పార్లమెంట్ మరో విడత పొదుపు చర్యలకు ఆమోదం తెలిపింది. కమ్యూనిస్టులు, కొంత మంది ఇతర పార్టీల ఎంపీలు తప్ప ప్రధాన రెండు సంకీర్ణ కూటమి పార్టీలు 'ఐక్యంగా' దేశ భక్తి పేరుతో ప్రజావ్యతిరేక చర్యలకు ఆమోద ముద్ర వేశాయి. ఈ ఓటింగ్ వాటిలో చిచ్చు రేపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఐరోపా యూనియన్, ఐరోపా సెంట్రల్ బ్యాంకు ఉమ్మడిగా రూపొందించిన ఈ పొదుపు చర్యల పథకాన్ని 199-74 ఓట్ల తేడాతో పార్లమెంట్ ఆమోదించింది. సోషలిస్టు, మితవాద న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన 37 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. విప్‌ను ధిక్కరించి నందుకు సోషలిస్టుపార్టీ 153 మంది తన ఎంపీల్లో 20 మందిని, న్యూడెమోక్రసీ పార్టీ 83 మందిలో 21 మందిని బహిష్కరించింది. ఈ రెండు పార్టీలకు చెందిన ఆరుగురు మంత్రులు తాము ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మూడవ చిన్న పక్షమైన మితవాద ఫాసిస్టు శక్తి 'పాపులర్ ఆర్థొడాక్స్ ర్యాలీ' పార్టీ తన ఎత్తుగడల్లో భాగంగా పొదుపు ప్యాకేజీని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సంకీర్ణ కూటమి నుంచి వైదొలిగింది. సంక్షోభం నుంచి గ్రీస్‌ను రక్షించే పేరుతో సోషలిస్టు పార్టీ ప్రభుత్వాన్ని రాజీనామా చేయించిన ఐరోపా యూనియన్ దాని స్థానంలో ఐరోపా సెంట్రల్ బ్యాంకు మాజీ అధికారి పాపా డెమోస్‌ను ప్రధానిగా చేసి ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేవరకు కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రజలపై కఠిన చర్యలకు పాల్పడితే తమకు పుట్టగతులుండవని పార్టీలు భయపడుతున్నందున ఐరోపా యూనియన్ పార్టీల ప్రమేయం లేని ప్రభుత్వాన్ని ప్రతిష్టించింది. ఈ ఉదంతం ఐరోపాలో మరిన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు, నిరంకుశ పోకడలవైపు మళ్లిస్తున్నది. అదలా ఉంచితే గ్రీస్ తాజా సంక్షోభం నుంచి గట్టెక్కుతుందా? అన్నది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న.
గ్రీస్ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు రూపొందించిన 13 వేల కోట్ల యూరోల ప్యాకేజిని మార్చి 20లోగా ఆమోదించకపోతే దేశం మరిన్ని తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని ఆపద్ధర్మ ప్రధాని ల్యూకాస్ పాపాడెమోస్ ఓటింగ్‌కు ముందు టీవీలో ప్రసంగిస్తూ పౌరులను భయపెట్టారు. వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు నిలిచిపోతాయన్నాడు. స్కూళ్లు, ఆసుపత్రులు పని చేయవు, బ్యాంకుల నుంచి డబ్బు తీసుకోలేము ఇలా సకల ఆర్థిక అనర్ధాలు సంభవిస్తాయని చెప్పారు. ఇంతకీ ఆ పొదుపు చర్యలేమిటి? కనీస వేతనంలో 22 శాతం తగ్గింపు, గత మూడేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇప్పటికే 45శాతం తగ్గించారు. దీని ప్రభావం వల్ల ప్రయివేటు రంగంలో కనీస వేతనాలు కూడా తగ్గిపోతాయి. ఉమ్మడి బేరసారాల హక్కును పరిమితం చేశారు. ఈ ఏడాది 15వేల మందిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించాలని నిశ్చయించారు. బడా పెట్టుబడిదారులకు పన్ను రాయితీలను కొనసాగించేందుకు స్వయం ఉపాధి పొందుతున్నవారి నుంచి పన్నును విధిగా వసూలు చేయాలని నిర్ణయించారు. బేసిక్ పెన్షన్ల కోత, 2015 నాటికి లక్షా 50వేల ప్రభుత్వ ఉద్యోగాల రద్దు, ఇప్పుడున్న నిరుద్యోగశాతం 20.9 నుంచి ఎప్పుడు పదిశాతానికి చేరుతుందో అప్పటి వరకు పని చేస్తున్న ఉద్యోగులకు వేతన స్థంభన. ఇలా ఖాళీ పేపర్‌పై సంతకం చేసి ఇచ్చినట్లుగా ఏప్రిల్‌లో జరుగుతాయనుకుంటున్న ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వం అమలు జరిపే విధంగా అనేక ప్రజా వ్యతిరేక చర్యలను ముందుగానే చట్టబద్దం గావించారు. అంటే ప్రజాభిప్రాయం, పార్టీల మేనిఫెస్టోలతో నిమిత్తం లేకుండా నిరంకుశంగా గ్రీస్ సార్వభౌమత్వాన్ని హరించే విధంగా ఐరోపా యూనియన్ వ్యవహరించింది.
పోనీ ఈ చర్య గ్రీస్ సమస్యను పరిష్కరిస్తుందా? యూరో కూటమి రూపొందించిన ఈ ప్యాకేజీ కింద అందచేసే 13 వేల కోట్ల యూరోల నుంచి ఒక్క యూరోను కూడా ప్రధాని పాపా డెమోస్ చెప్పినట్లుగా వేతనాలచెల్లింపులు, ఆసుపత్రులు, స్కూళ్లకు వెచ్చించడం లేదు. ఎందుకంటే గతంలో తామిచ్చింది ఒకందుకైతే, గ్రీస్ ప్రభుత్వం మరొకదానికి ఉపయోగించుకుందని, అందువలన దాని మాటలను ఇంకే మాత్రం నమ్మలేమని తాజా ప్యాకేజి చర్చల సందర్భంగా ఐరోపా దేశాలు నిర్మొహమాటంగా చెప్పాయి. తామివ్వ బోయే సొమ్ముకు ఒక ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసి తమ తనిఖీకి అందుబాటులో ఉంచాలని అప్పుడే కిస్తీలను నిర్ణీత గడువు ప్రకారం విడుదల చేస్తామని ఐరోపా యూనియన్ పేర్కొన్నది. ప్రత్యేక ఖాతాలో జమ చేసిన సొమ్ములో ముందుగా గ్రీస్ రుణాలను తీర్చేందుకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా మిగిలితే దానిని మాత్రమే ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ మొత్తంతో గ్రీస్ అప్పు తీరి పోతుందా అంటే లేదు. ఇప్పుడు దాని స్థూలాదాయానికి మించి 163 శాతం అప్పులలో మునిగి ఉంది. దానిని 2020 నాటికి 120శాతానికి తగ్గించేందుకు మాత్రమే దీనిని ఉద్ధేశించారు. అంటే గ్రీస్ ఆ తరువాత కూడా అప్పుల కుప్పగానే ఉంటుంది. తమ దేశాన్ని జర్మనీకి బానిసగా మార్చివేస్తున్నారని దీనికి తలవంచటం కంటే చావటం గౌరవంగా ఉంటుందని అనేక మంది గ్రీసు పౌరులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో జర్మనీ వ్యతిరేకత బాగా పెరిగింది. గ్రీస్‌లో పని చేస్తున్న బ్యాంకులన్నీ జర్మనీ లేదా ఆస్ట్రియా దేశాలకు చెందిన ప్రయివేటు సంస్థలే. అవి ఇప్పటివరకూ గ్రీస్ ప్రభుత్వం అడిగిన మేరకు అప్పులు ఇచ్చాయి. ఐరోపాలో ఎక్కడా లేనంత ఎక్కువ వడ్డీలను వసూలు చేశాయి. ఇప్పుడు గ్రీస్ ప్రభుత్వం దివాళా స్థితికి చేరింది. అందుకే జర్మనీ రంగంలోకి దిగింది. ఇచ్చిన అసలు కంటే వడ్డీ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అందువలన మొత్తం అప్పు 20 వేల కోట్ల యూరోలకు చేరింది. ఈ మొత్తంలో తాము సగాన్ని వదులు కుంటామని మిగిలిన సగాన్ని తమకు ఇప్పిస్తే చాలని ఆ బ్యాంకులు కూడా అంగీకరించాయి. అయితే అందుకు అనేక షరతులు కూడా విధించాయి. పొదుపు చర్యలు, అప్పులు తీరిస్తే గ్రీస్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా అంటే గ్యారంటీ ఇచ్చేవారెవరూ లేరు. దేశంలో మొత్తం నిరుద్యోగం 21శాతానికి చేరగా, యువకుల్లో ఇది 50శాతం దాకా ఉంది. అధికారికంగా మూడోవంతు కుటుంబాలు దారిద్య్రంలోకి జారాయి. ఉన్న ఉపాధితో పాటు కొంపా గోడూ కోల్పోతున్నవారు నానాటికీ పెరుగుతున్నారు. తాము రోజుకు రెండున్నరలక్షల మందికి అన్నదానం చేస్తున్నట్లు సాంప్రదాయక చర్చి ప్రకటించింది. తీసుకున్న కొత్త అప్పులను పాత రుణాల చెల్లింపునకే జమ చేస్తే గ్రీస్ రోజువారీ అవసరాలకు తిరిగి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. అలాగాక అప్పులను పరిశ్రమలు,ఇతర రంగాలలో పెట్టుబడులుగా పెడితే ఆర్థిక వ్యవస్థ కోలుకొని అనేక సమస్యలు పరిష్కారమౌతాయి. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ద్రవ్య పెట్టుబడిదారులు కనుక వారు అందుకు అంగీకరించరు. ఒక విషవలయంలో గ్రీస్ చిక్కుకొని అంతిమంగా ప్రజల జీవనం దుర్భరంగా మారనుంది. ఇప్పుడున్న సంక్షోభం నుంచి 2015వరకు గ్రీస్ బయట పడలేదన్నది ఆర్థికవేత్తల అంచనా. ఈ పొదుపు చర్యలకు వ్యతిరేకంగా 62 నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కొన్ని చోట్ల జర్మన్ పతాకాలను తగుల బెట్టారు. ఏడవ తేదీన సమ్మె చేసిన కార్మికులు తిరిగి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా 10,11 తేదీలలో 48 గంటల సమ్మె చేశారు. సమ్మెకు ముందు రోజు కమ్యూనిస్టుపార్టీ పెద్ద ప్రదర్శన జరిపింది.కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి అలేకా పాపరిగా ఆదివారం నాడు ఒక ప్రకటన చేస్తూ కార్మికులు చివరకు తమ రక్త మాంసాలను త్యాగం చేసినప్పటికీ ఈ దివాళా ఆగేలా కనపడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఐరోపా యూనియన్ నుంచి గ్రీస్ వైదొలగటం, అప్పులను ఏకపక్షంగా రద్దు చేయటం తప్ప మరొక మార్గం లేదు. ఇదిగాకుండా మరొకటి జరిగితే కార్మికుల పాలిట అది విషాదంగా మారుతుందని హెచ్చరించారు.
'కథిమెరినీ' అనేక పత్రిక ఈనెల మొదటి వారంలో జరిపిన ఒక సర్వేలో వామపక్షాలకు పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తమవుతున్నట్లు తేలింది. ఈ సర్వే ప్రకారం కమ్యూనిస్టుపార్టీని 12శాతం, డెమోక్రటిక్ లెఫ్ట్‌ను 12.5, రాడికల్ లెఫ్ట్ కూటమిని 12శాతం మంది సమర్థిస్తున్నారు. గ్రీన్స్ పార్టీ కూడా తగినన్ని ఓట్లు తెచ్చుకొని పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం పొందవచ్చని భావిస్తున్నారు. ఇంతకూ అంతటి పెద్ద ఐరోపా యూనియన్ ఇంత చిన్న దేశం గ్రీస్ గురించి ఇంతగా ఎందుకు పట్టించుకుంటున్నది? వరుసగా ఐదవ సంవత్సరం ఆర్థిక మాంద్యంలో ప్రవేశించిన గ్రీసు ఐరోపా ధనిక దేశాల ప్రయోగశాలగా మారింది. పొదుపు మరొక పేరుతో ఇక్కడ ప్రజలపై భారాలు మోపటంలో జయప్రదమైతే ఇతర సంక్షుభిత దేశాలలో కూడా వాటిని అమలు జరపటం సులభం అవుతుందన్నది ఐరోపా పాలకవర్గాల అంచనా. అందుకే అనేక విమర్శలు, వత్తిళ్లు వస్తున్నా ప్రధాన దేశాలన్నీ పట్టువిడకుండా గ్రీసు మెడలు వంచేందుకు ప్రయత్నించాయి. కేవలం కోటీ పదిలక్షల మంది మాత్రమే జనాభా ఉన్న చిన్న దేశం గ్రీస్ కనుక ఇక్కడ తలెత్తే ప్రజావ్యతిరేకతను సులభంగా అణచివేయవచ్చనేది ధనిక దేశాల ఆలోచన
ఎం కోటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి