13, ఫిబ్రవరి 2012, సోమవారం

విదేశాల్లో భారతీయులు దాచిన బ్లాక్‌మనీ


 
 విదేశాల్లో భారతీయులు దాచిన బ్లాక్‌మనీ
 సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడి
ట్యాక్స్ హెవెన్స్‌లో ఈ మొత్తాన్ని దాచారు
స్విస్ బ్యాంకులో భారీ మొత్తాలు డిపాజిట్ చేసినవాళ్లలోనూ ఎక్కువ మంది మనోళ్లే..
ఓ అత్యున్నత స్థాయి అధికారి నల్లధనంపై అంచనాను వెల్లడించడం ఇదే తొలిసారి

న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో మనోళ్లు అక్రమంగా దాచిపెట్టిన నల్లధనమెంతో తెలుసా? రూ.24.5 లక్షల కోట్లు! ఈ విషయాన్ని సీబీఐ డెరైక్టర్ ఎ.పి.సింగ్ స్వయంగా వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో భారీ మొత్తాల్లో డిపాజిట్లు చేసినవారిలో కూడా భారతీయులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. అవినీతి నిరోధం, ఆస్తుల రికవరీపై జరిగిన తొలి ఇంటర్‌పోల్ గ్లోబల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. పన్నుల స్వర్గధామాలుగా(ట్యాక్స్ హెవెన్స్-ఈ దేశాల్లో పన్నులు చాలా తక్కువగా ఉంటాయి.. లేదా అస్సలు ఉండవు) పేరొందిన మారిషస్, స్విట్జర్లాండ్, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాం డ్స్ వంటి దేశాలకు భారతీయులు భారీ స్థాయిలో అక్రమ ధనాన్ని తరలించినట్లు సింగ్ వెల్లడించారు. దేశంలో అవినీతి పాలనాపరంగా పెద్ద సమస్యగా ఉందని, దీని నిర్మూలనకు ఏకపరిష్కారం లేదని, పలు స్థాయుల్లో అవినీతిని పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. ఇది లా ఉండగా.. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం విషయంలో పలు అంచనాలు ఉన్నాయి. ఈ మొత్తం రూ.25 లక్షల కోట్ల 75 లక్షల కోట్ల వరకూ ఉండొచ్చని చెబుతారు. దీనికి సంబంధించిన అధికారిక అంచనా అంటూ ఏమీ లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రస్తుతం చెబుతున్న అంకెలన్నీ నిర్ధారించని అంచనాలేనని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌కు సంబంధించి అత్యున్నత స్థాయిలో ఉన్న ఓ అధికా రి.. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం విషయంలో ఓ అంచనాను వెల్లడించడం ఇదే తొలిసారి. అయితే, ఏ ఆధారాల మేరకు ఆయనీ అంచనాను వెలువరించారన్న విషయాన్ని సింగ్ తెలుపలేదు.

ప్రపంచ బ్యాంకు అంచనా 74 లక్షల కోట్లు..

‘నల్లధనానికి సంబంధించిన సమాచారాన్ని మనతో పంచుకునే విషయంలో పన్నుల స్వర్గధామాలుగా పేరొందిన ఈ దేశాల్లోని నేతల్లో దృఢమైన రాజకీయ సంకల్పం లోపించింది. ఎందుకంటే పేద దేశాల నుంచి అక్రమంగా వచ్చిన ఈ సొమ్ముతోనే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకున్నాయన్న విషయం వారికి తెలుసు’ అని సింగ్ వ్యాఖ్యానించారు. వీటిల్లోని 53 శాతం దేశాలు అతి తక్కువ అవినీతి ఉన్న దేశాలని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండెక్స్’ పేర్కొందని చెప్పారు. ‘ఈ ట్యాక్స్ హెవెన్స్‌లో న్యూజిలాండ్ కూడా ఉంది. ఈ దేశం అతి తక్కువ అవినీతి ఉన్న దేశంగా మొదటి ర్యాంకు పొందింది.

సింగపూర్‌కు 5, స్విట్జర్లాండ్‌కు 7వ ర్యాంకు లభించాయి’ అని వివరించారు. నల్లధనాన్ని గుర్తించడం, ఆ ఖాతాలను స్తంభింపజేయడం, అనంతరం అక్రమ అస్తులను జప్తు చేయడం సంక్లిష్టమైన ప్రక్రియ అని.. దీనికి ప్రత్యేక నైపుణ్యంతోపాటు దృఢమైన రాజకీయ సంకల్పం అవసరమని తెలిపారు. అక్రమ ఆస్తులు, ఖాతాల గుర్తింపునకు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాలు అవసరమన్నారు. ‘అంతర్జాతీయంగా చూస్తే.. క్రిమినల్ చర్యలు, పన్ను ఎగవేతల ద్వారా విదేశాల్లో దాచిన నల్లధనం రూ.74 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

ఇందులో దాదాపు రూ.2 లక్షల కోట్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు లంచాల రూపంలో చెల్లించినవే ’ అని తెలిపారు. అయితే, గత 15 ఏళ్ల కాలంలో రూ.74 లక్షల కోట్లలో రూ.24 వేల కోట్లను మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకోగలిగారని సీబీఐ డైరెక్టర్ సింగ్ వివరించారు. దర్యాప్తు సంస్థలకున్న ప్రాదేశిక, అధికార పరిధుల పరిమితులను నేరగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. వీరు తమ నేరాలను కనీసం రెండు దేశాలకు విస్తరించి, మూడో దేశంలో ధనాన్ని దాచిపెడుతున్నారని సింగ్ పేర్కొన్నారు. ఇటీవల సీబీఐ దర్యాప్తు చేసిన 2జీ స్పెక్ట్రమ్, కామన్వెల్త్ క్రీడలు, మధుకోడాలాంటి ముఖ్యమైన కేసుల్లో డబ్బును దుబాయ్/సింగపూర్/మారిషస్‌ల మీదుగా స్విట్జర్లాండ్ తదితర ట్యాక్స్ హెవెన్ దేశాలకు తరలించినట్లు కనుగొన్నామని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి