17 దేశాల యూరో జోన్ లో నిరుద్యోగం రికార్డు స్ధాయికి చేరుకుంది. జనవరి నాటికి ఈ దేశాల నిరుద్యోగం 10.7 శాతం ఉందని యూరో స్టాట్ సంస్ధ వెల్లడించింది. యూరో జోన్ దేశాల్లోని కంపెనీలు డిసెంబరులో మరో 1,85,000 ఉద్యోగాలు రద్దు చేశాయని గణాంకాలు చెపుతున్నాయి. యూరప్ ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బుని బిలియన్ల కొద్దీ బెయిలౌట్లుగా మేసిన కార్పొరేట్ కంపెనీలు ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడినప్పటికీ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు మరిన్ని ఉద్యోగాలు రద్దు చేస్తూ మరిన్ని లాభాలు పోగేసుకుంటున్నాయి. యూరో జోన్ సంక్షోభం పరిష్కారం పేరుతో ప్రభుత్వాలు ప్రజలపైనా మరిన్ని పొదుపు విధానాలు అమలు చేస్తూ, మరిన్ని ఉద్యోగాలు కత్తిరిస్తూ మరిన్ని సమస్యలను ప్రజల నెత్తి పైన రుద్దు తున్నాయి. ఫలితమే నిరుద్యోగం పెరగడం.
జనవరిలో నిరుద్యోగం 10.4 శాటానికి పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఆ అంచనాను వాస్తవ పరిస్ధితి దాటి పోయింది. ఋణ సంక్షోభం తీవ్రంగా ఉన్న స్పెయిన్ లో నిరుద్యోగం ఎల్లలు దాటింది. అక్కడ జనవరి నాటికి నిరుద్యోగం 23.3 శాతంగా తేలింది. సంవత్సరం క్రితం 20.6 శాతంగా ఉన్న నిరుద్యోగం సంవత్సరంలోనే ఏకంగా 1.7 శాతం పెరగడం పరిస్ధితి తీవరతను తెలుపుతోంది. స్పెయిన్ యువతలో నిరుద్యోగం 50 శాతంగా ఉండడం చూస్తే అక్కడి యువతలో నిరాశా నిస్పృహలు తారాస్ధాయికి చేరుకున్నాయి.
నిరుద్యోగం తో పాటు ద్రవ్యోల్బణం, అధిక ధరలు, యూరో జోన్ దేశాల్ని పీడిస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయి సరుకుల అమ్మకం పడిపోయింది. అంటే యూరో జోన్ లో కొత్త సంవత్సరంలో జీడీపీ మరింత క్షీణించడం ఖాయంగా కనిపిస్తోంది. దానర్ధం యూరో జోన్ మరోసారి రిసెషన్ లో కి జారనుందని అర్ధం చేసుకోవచ్చు.
యూరో జోన్ లో కూడా ధనిక, పెద దేశాల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. దక్షిణ యూరప్ దేశాలు స్పెయిన్, గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ లాంటి దేశాల్లో నిరుద్యోగం తీవ్రంగా రెండంకెల స్ధాయిలో ఉండగా ఉత్తర దేశాలు ఆస్ట్రియా, హాలండ్, జర్మనీ లాంటి దేశాల్లో నిరుద్యోగం అంతగా లేదు. ఆస్ట్రియాలో 4 శాతం, హాలండ్ లో 5 శాతం, జర్మనీ లో 5.8 శాతం ఉంది. స్పెయిన్, ఇటలీలో నిరుద్యోగం ప్రతి నెలా పెరుగుతూ పోతోంది. పెద్ద ఆర్ధిక వ్యవస్ధలైన ఈ రెండు దేశాల పరిస్ధితి హీనంగా ఉండడం వల్ల ఆ దేశాలకు బెయిలౌట్లు ఇవ్వవలసిన పరిస్ధితి ఏర్పడుతోంది. అయితే అంత పెట్ట ఆర్ధిక వ్యవస్ధలకు బెయిలౌట్ కూడా భారీగా ఉంటుంది. భారీ బెయిలౌట్లు ఇచ్చే పరిస్ధితి యూరో జోన్ వద్ద లేదు. దానితో యూరో జోన్ ఋణ సంక్షోభం తిరిగి ప్రపంచ ద్రవ్య సంక్షోభం గానూ, ప్రపంచ ఆర్ధిక సంక్షోభంగానూ మారనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ లో ఉన్న ‘ఫీల్ గుడ్’ ఫ్యాక్టర్ కీ దేశాల్లో ఉన్న వాస్తవ పరిస్ధితికీ తీవ్ర అంతరం ఉన్న స్ధితిని విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. బెయిలౌట్లు మేసిన కంపెనీలు సంక్షోభ పరిస్ధితిల నుండి గట్టెక్కి లాభాల బాట పట్టాయి. ఫలితంగా వాటి బ్యాలెన్స్ షీట్లు మెరుగుపడి వాటి స్టాక్ విలువలు కూడా మెరుగయ్యాయి. అయితే అదే కంపెనీలు మేసిన బెయిలౌట్లు దేశాల ఆర్ధిక వ్యవస్ధలపైన ఋణ భారంగా పరిణమించడంతో ఋణ సంక్షోభం ఏర్పడింది. రుణాలను కంపెనీల నుండే వసూలు చేయవలసి ఉండగా అది చేయకుండా ప్రభుత్వాలు ఉద్యోగాల కత్తిరింపు, సదుపాయాల రద్దు, పన్నుల పెంపు లాంటి పొదుపు విధానాల ద్వారా రుణాలు తీర్చడానికి పూనుకుంటున్నాయి. అందువల్ల సహనంగానే దేశాలు, ప్రజల పరిస్ధితి క్షీణిస్తుండగా కంపెనీల పరిస్ధితి ‘ఫీల్ గుడ్’ ఫ్యాక్టర్ తో వెలిగిపోతున్నాయి. ‘అంతా బాగుంది’ అంటూ ఎన్నికల ప్రచారం చేసి కూలబడిన 2004 నాటి బి.జె.పి పరిస్ధితి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.
గురువారం నుండి యూరోపియన్ యూనియన్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తీసుకోనున్న నిర్ణయాలు ప్రజలను మరింత సంక్షోభంలోకి నెట్టనున్నాయి. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వ్యవస్ధాగత సంస్కరణలపైన ఈ సమావేశాల్లో చర్చిస్తారట. వ్యవస్ధాగత సంస్కరణలు అంటే ప్రజలపైనా మరిన్ని ‘కంపెనీ అనుకూల’ సంస్కరణలు రుద్దడమేనని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ.యు సింగిల్ మార్కెట్ గా మార్చే చర్యల్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటారట. జాతీయ ఇంధన మార్కెట్లను మరింత సరళీకరణ చేస్తారట. ఇవి కూడా ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైనవే. ఈ విధానాల్తో యూరోజోన్ సంక్షోభం పరిష్కారం కాకపోగా మరింత పెచ్చరిల్లడం ఖాయం. సంక్షోభ పరిష్కారం పేరుతో కంపెనీలకు లబ్ది చేకూరే నిర్ణయాలు, ప్రజలపైన మరింత భారం వేసే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పరిస్ధితి దాపురిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి