2, ఏప్రిల్ 2012, సోమవారం

ఉచితం మరీ భారం


హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఉచిత విద్యుత్ మోయలేని భారమైంది. సామాజిక బాధ్యత పేరుతో ఓటుబ్యాంకు లక్ష్యంగా వ్యవసాయానికి కొనసాగుతున్న ఏడు గంటల ఉచిత విద్యుత్ రాష్ట్ర ఖజనాను, విద్యుత్ సంస్థలను ఆర్ధికంగా దెబ్బతీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని మోస్తుండగా, సరైన సాంకేతిక వ్యవస్థ లేనందున ఉచిత విద్యుత్ పంపిణీలో నష్టాల భారాన్ని విద్యుత్ సంస్ధలు భరిస్తున్నాయి. తెలంగాణ, రాయలసీమల్లో మెట్ట ప్రాంతాల్లోని రైతులు ఉచిత విద్యుత్ వల్ల మనుగడ సాగిస్తున్నారు.
ఉచిత విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చిల్లు అని విద్యుత్ నిపుణులు వాదిస్తున్నా, తెలంగాణ, రాయలసీమ గ్రామాల్లో ఈ పధకం వల్ల సామాజిక ప్రశాంతత నెలకొందని సామాజిక శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. 2004 నుంచి 2012 వరకు విద్యుత్ రంగానికి రకరకాల సబ్సిడీల పేరుతో రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 38 వేల కోట్ల రూపాయలైతే, ఇందులో వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ సబ్సిడీ విలువ 14వేల కోట్లకు చేరుకుంది. 2012-13 ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయరంగానికి 20వేల మిలియన్ యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుందని డిస్కాంలు అంచనా వేశాయి. కొత్త ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 93,913 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. కాని 81,464 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. 12,449 ఎంయు విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు ట్రాన్స్‌కో, డిస్కాంలు కసరత్తు ప్రారంభించాయి. అంటే సగటున ఈ ఏడాది రోజుకు 35 నుంచి 40 ఎంయు వరకు విద్యుత్ కొరత ఏర్పడుతుంది. 2004లో ఉచిత విద్యుత్ స్కీంను ప్రారంభించినప్పుడు సాలీనా 9వేల ఎంయు వరకు మాత్రమే డిమాండ్ ఉండేది. కానీ గత ఎనిమిదేళ్లలో ఉచిత విద్యుత్ ఖాతా కింద 19 వేల ఎంయు జమవుతోందని విద్యుత్ వర్గాలు తెలిపాయి. సాలీనా రాష్ట్రంలో మొత్తం అవసరమయ్యే విద్యుత్‌లో 25 శాతం ఉచిత విద్యుత్‌కు ఖర్చుకావడం వల్ల పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించడం, చార్జీలను పెంచడం అన్నది అనివార్యమవుతోంది.
సిపిడిసిఎల్ పరిధిలో వ్యవసాయ రంగానికి 2010-11లో 6733.69 ఎంయు విద్యుత్ ఖర్చవుతుందని ఎపిఇఆర్‌సి అంచనా వేయగా, 7769.57 ఎంయు ఖర్చయినట్లు సిపిడిసిఎల్ పేర్కొంది. 2011-12లో 7339.72 ఎంయు విద్యుత్ వ్యవసాయానికి ఖర్చవుతుందని ఏపిఇఆర్‌సి అంచనా వేయగా, 23.08 శాతం పెరిగి 8427.2 ఎంయు ఖర్చయినట్లు సిపిడిసిఎల్ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద ఉచిత విద్యుత్ కనెక్షన్లు 30 లక్షలున్నాయి. గత మూడేళ్లలో మూడు లక్షల వరకు కొత్త కనెక్షన్లు పెరిగాయి. 30 లక్షల విద్యుత్ కనెక్షన్లలో 17 లక్షలకు పైగా కనెక్షన్లు తెలంగాణలో మిగిలిన 13 లక్షల కనెక్షన్లు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్న విద్యుత్‌లో పంపిణీ నష్టాలు సుమారు 25 శాతంగా అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ ఇంధన శాఖ పద్దుల్లో పేర్కొంది. ఈ నష్టాల నివారణకు హై వోల్టేజి పంపిణీ వ్యవస్ధ (హెచ్‌విడిఎస్)ను అమలు చేయాలని ట్రాన్స్‌కో అనుకుంటోంది. ఈ విధానం అమలైతే 306.96 కోట్ల రూపాయల వరకు పొదుపు చేయవచ్చని అంచనా. జపాన్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టిన జెఐసిఏ ప్రాజెక్టులో భాగంగా 1154.80 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2011-12లో రాష్ట్రప్రభుత్వం 148 కోట్ల రూపాయలను కేటాయించింది. జెఐసిఏ, కేంద్రప్రభుత్వం మధ్య కుదిరిన రుణ ఒప్పందం మేరకు సవరించిన అంచనాల్లో భాగంగా 2012-13 సంవత్సరానికి 50 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారు. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టును 2011-12 నుండి 2015-16 సంవత్సరాల మధ్య ఐదేళ్ల పాటు అమలు చేస్తారు. ఇప్పటికే 7.08 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు హెచ్‌విడిఎస్‌ను అమలు చేశారు. సంతృప్తికరమైన ఫలితాలు రావాలంటే మరికొంత కాలం వేచిచూడాలని విద్యుత్ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని 16 జిల్లాలో 2,43,154 వ్యవసాయ పంపుసెట్లకు ఈ విధానాన్ని అమలు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి