4, ఏప్రిల్ 2012, బుధవారం

గద్దలు ఎత్తుకెళ్లిన భూమి...


కంచె చేను మేయడమే కాదు...భూమిని కూడా భోం చేసింది. ఇది ప్రజాస్వామ్యమా? రాజరికమా? అనే ధర్మ సందేహం ప్రజలను పట్టి పీడిస్తోంది. పేద వాడికి  20 గజాల బీడుపడ్డ, ఊరవతల భూమిని ఇవ్వా లంటే తరతరాలుగా వేచి చూడాల్సి వస్తోంది. అదే పలుకు బడి గల వారు, సంపన్న వర్గాల వారు పరిశ్రమల పేరిట సాగించే పైరవీలతో కోట్లాది రూపాయల విలువైన భూములన్నీ సంతర్పణం అవుతున్నాయి. ప్రభుత్వ భూముల అడ్డగోలు కేటాయింపులపై కాగ్‌ ప్రభుత్వాన్ని కడిగేసింది. అంతకుముందు చాలాకాలం నుంచే భూ కేటాయింపులపై మీడియా సర్కారును కడిగేస్తూ వస్తోంది. ఆ అక్రమాలు నిజమేనని ఇప్పుడు కాగ్‌ వెల్లడించింది. పబ్లిగ్గా దోపిడి జరుగుతుంటే ప్రభుత్వం ఏమీ చేయలేక పోతోంది. ఇక అన్నీ తానే అయి ఎలాంటి లజ్జ లేకుండా నిస్సిగ్గుగా అక్రమ దందాలకు పాల్పడుతుంది. అభివద్ధి అనే అందమైన నినాదంతో సాగించిన దందాకు అంతూ పొంతు లేకుండా పోయింది.
అయినవారికి, అయినకాడికి భూములను కట్టబెట్టిన వైనం రాజరికపు పోకడలనే తలపించింది. వేలల్లో కర్మా గారాలు పెడుతామని, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తా మని ఓ రంగుల కలను సష్టించారు. అత్యంత విలువైన భూములను తమవారికి మార్కెటు రేటు కన్నా తక్కువ ధరకు కట్టబెట్టారని కాగ్‌ పేర్కొంది. 2006 నుంచి 2011 వరకూ జరిగిన భూ కేటాయింపులపై కాగ్‌ సమగ్ర నివేదికనే రూపొందించింది. ప్రాజెక్టులు మిథ్య... ఉద్యోగాలు ఓ అందమైన కల్పన, భూములు హుష్‌కాకిగా ఎగిరిపోవడం మాత్రం వాస్తవంగా మారింది. కాగ్‌ తన నివేదికలో ఈ అంశాలను నిప్పులాంటి నిజాలుగా వెల్లడించింది. ఐదేళ్లలో ప్రభుత్వం 89వేల ఎకరాల భూమిని ఇష్టారాజ్యంగా కట్టబెట్టినట్లు వెల్లడైంది. పచ్చని పంట పొలాలు, విలువైన ఖనిజాలున్న కొండలు, గలగల పారేటి కోనలను కూడా వదలకుండా తలా ఇంతగా కట్టబెట్టారు. తలా కొంత పంచుకున్నారు. బినామీ పేర్లతో భూ పందేరం జరిగింది.
అక్రమాలు జరిగి చాలా సంవత్సరాలు అయినప్పటికీ పత్రికలు, ప్రతిపక్షాలు కోడై కూస్తున్నప్పటికీ ఏ దశలోనూ నిఖార్సయిన రీతిలో విచారణ జరగకపోవడం దారుణం. నిబంధనలకు నీళ్లు వదిలి జరిగిన భూ కేటాయింపుల వల్ల ఎవరెవరికి ఎంతెంత లాభం చేకూరిందనేది తేలాల్సి వుంది. కొన్ని సంస్థలకే పనిగట్టుకుని ప్రభుత్వం విలువైన భూములను కేటాయించినట్లు వెల్లడైంది. ఇందులో జరిగిన వేలాది కోట్ల రూపాయల దందాలో ప్రభుత్వానికి అప్పటి అధినేతలకు వందలాది కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు తెలుస్తోంది. స్థిరాస్తి స్వప్రయోజనాలకే భూములు కేటాయించారని ఉపాధి అవకాశాలు కేవలం ఎండమావిగా మారాయని కాగ్‌ తెలిపింది. అయిదేళ్లలో జరిగిన 88 వేల ఎకరాల కేటాయింపులో 50 వేల ఎకరాలలో అవక తవకలు జరిగినట్లు వెల్లడైంది. అనుచిత లబ్ది విలువ దాదాపు 18 వందల కోట్ల రూపాయలు అని కాగ్‌ అంచనా వేసింది. ఇప్పటికే సిబిఐ అప్పటి ప్రభుత్వ భూముల వేలం లావాదేవీలకు సంబంధించి విచారణ చేపట్టింది. కేంద్రం అనుమతి లేకుండానే బ్రహ్మణి సంస్థకు అడ్డగోలుగా భూములను పంపిణీ చేసినట్టు వెల్లడైంది. ఏదైనా సంస్థకు భూములను పంపిణీ చేయాలంటే అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి వుంటుంది. వనరుల లభ్యత, రవాణా, ఆర్థిక సామర్థ్యం, సాంకేతిక అనుభవం వంటి అంశాలను స్థానిక జిల్లా అధికారులు పరిశీలించాలి. కానీ ఇలాంటివేమీ లేకుండా బ్రహ్మణి సంస్థ నిబంధనలకు విరుద్ధంగా భూమిని కేటాయించినట్లు వెల్లడైంది. దాదాపు 11 వేల ఎకరాల భూమిని సంస్థకు కేటాయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కాలరాస్తూ జల వనరులను కూడా సంస్థకు కట్టబెట్టడం మరో వింతగా పేర్కొన్నారు. గండికోట రిజర్వాయర్‌ నుంచి సంస్థకు రెండు టిఎమ్‌సిల నీటిని కేటాయించడం అక్రమమేనని కాగ్‌ విమర్శించింది. వాణిజ్య విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంలో పాటించాల్సిన నిబంధనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. బ్రహ్మణి కోసం విమానాశ్రయాల నిర్మాణాల పేరిట 3,115 ఎకరాల భూమిని కేటాయించడం అప్పటి జమానాలో జరిగిన అక్రమానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.
ఇక గాలి జనార్ధన రెడ్డికి చెందిన ఓఎంసికి భూములను అక్రమంగా కట్టబెట్టి నట్లు కాగ్‌ పేర్కొంది. ఓఎంసి సంస్థ అర్హతలను పరిశీలించకుండానే ఏపిఐఐసి అనంతపురం జిల్లా అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. గనులను అక్రమంగా స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న సంస్థలకే ప్రభుత్వం వాటిని కట్టబెట్టడం చట్ట విరుద్ధమని కాగ్‌ పేర్కొంది. 413 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓఎంసి అప్పటికే ఆక్రమించిందని ఆ సంస్థకే అదనంగా భూములను అప్పగించడం దారుణమని కాగ్‌ ఎండగట్టింది. మార్కెట్‌ కన్నా తక్కువ రేటుకే భూములను కేటాయించారు. రాZషంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌) వ్యవహారం కూడా అనుమానాస్పదంగానే వుందని కాగ్‌ విమర్శించింది. అనేక రీతుల్లో జరిగిన అక్రమాల ప్రవాహానికి ఇప్పటికైనా అడ్డుకట్ట కట్టి, నిరంతర నిఘా వేస్తే తప్ప భూ బకాసురుల ఇష్టారాజ్యాలకు కళ్లెం పడదు. లేకపోతే ప్రభుత్వ భూములన్నీ హారతి కర్పూరం అయిపోక తప్పదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి