12, ఏప్రిల్ 2012, గురువారం

తెల్లకార్డుదార్ల పేరిట భారీగా మద్యం షాపులు



నాలుగు జిల్లాల్లో అదే దందా

అసలు యజమానులెవరో చెబితే వదిలేస్తాం
మేం ఎవరినీ టార్గెట్ చేయలేదు
ఏసీబీ డీజీ భూబతిబాబు ప్రకటన
మద్యం అక్రమాలపై ఏసీబీ పట్టు బిగిస్తోంది. ముడుపులతో మొదలుపెట్టి... లైసెన్సుల మూలాల్లోకి చొచ్చుకుపోతోంది. నిరుపేద తెల్లకార్డుదారులు... లక్షలకు లక్షలు విలువైన మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న వైనంపై కన్నేసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ 'వైట్ కార్డుల' మాటున 'బ్లాక్' పనులు నడిచినట్లు తేల్చింది. బినామీల పేరిట దందా నడుపుతున్న వారిని బయటికీడుస్తామని హెచ్చరించింది.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెల్లకార్డుల వెనుక దాగిన 'నల్ల ముసుగులు' తొలగిందుకు ఏసీబీ సిద్ధమైంది. తెరముందు బినామీలను నిలిపి... వెనుక నుంచి తతంగం నడిపిస్తున్న వారిని బయటకీడ్చి తీరుతామని ప్రకటించింది. బియ్యం కార్డులున్న వారు లక్షలకు లక్షలు పెట్టి మద్యం షాపులు సొంతం చేసుకున్న రహస్యాన్ని ఛేదించి తీరతామని స్పష్టం చేసింది. మద్యం సిండికేట్ల వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఏసీబీ డీజీ భూబతి బాబు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మద్యం కేసుల్లో దర్యాప్తునకు సంబంధించి తమ వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తెల్లకార్డుల తీగలాగితే బినామీల డొంక కదులుతోందన్నారు. "వీటన్నింటిని గమనిస్తే అనేక విషయాలు స్పష్టమవుతున్నాయి. తెల్లకార్డుదారుల్లో కొందరికి తమ పేరిట మద్యం షాపులు ఉన్న విషయమే తెలియదు. మరికొందరు సిండికేట్ల షాపుల్లోనే కూలీలుగా పనిచేస్తున్నారు. ఇలా తెల్ల రేషన్‌కార్డుల పేరిట మద్యం దుకాణాలు దక్కించుకున్న చోట్ల చాలా మద్యం షాపులకు ఒకే తరహా పేర్లు ఉన్నాయి.

దీన్ని బట్టి ఈ షాపులను ఒకే సిండికేట్ లేదా ఒకే గ్రూప్ నియంత్రిస్తున్నట్లు స్పష్టమవుతోంది'' అని భూబతిబాబు తెలిపారు. మద్యం స్టాక్ లిఫ్టింగ్‌కు సంబంధించి బ్రూవరేజెస్ కార్పొరేషన్ పేరిట తీసిన డిమాండ్ డ్రాఫ్ట్‌లను పరిశీలించడంతో అసలు విషయం బయటపడిందన్నారు. ఒకే షాపు, ఒకే రోజున 40వేల రూపాయల చొప్పున అనేక డీడీలు తీసినట్లు బయటపడిందన్నారు.

ఆదాయపు పన్నుశాఖ దృష్టిలో పడకుండానే ఇలా చేశారని అభిప్రాయపడ్డారు. బ్యాంకులో 50వేలకు పైబడి డీడీ తీస్తే పాన్ నెంబర్ చెప్పాలి. తెలుపురంగు రేషన్‌కార్డుదారుల్లో చాలామందికి పాన్‌కార్డు లేకపోవడంతో వారి తరఫున బినామీలే రూ.50వేల లోపు మొత్తానికే డీడీలు తీస్తున్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

అంతటా అదే వైట్...
విజయనగరం జిల్లాలో తెల్ల కార్డుదారులు మద్యం సిండికేట్లకు బినామీలుగా ఉన్నట్లు స్పష్టం కావడంతో... ఆ తర్వాత గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మద్యం షాపుల యజమానుల వివరాలను పరిశీలించామని భూబతి బాబు తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లో బయటపడిన అంశాల ఆధారంగా మరో నాలుగు కేసులు నమోదు చేశామన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో 1471 మద్యం షాపులుంటే... అందులో 406 మద్యం షాపులు తెల్లకార్డుదారుల పేరిట ఉన్నాయని తెలిపారు.

కృష్ణా జిల్లాలో 41 శాతం షాపులు తెల్లకార్డుదారులపేరిటే ఉన్నాయన్నారు. "పశ్చిమ గోదావరి జిల్లాలో 473 మద్యం షాపులకుగాను 79... కృష్ణా జిల్లాలో 335 షాపులకుగాను 138, గుంటూరు జిల్లాలో 342 షాపులకుగాను 104 షాపులకు తెల్లకార్డు దారులే యజమానులు'' అని తెలిపారు. తెల్లకార్డులున్న పేదలను వేధిస్తున్నారన్న ఆరోపణలను భూబతి బాబు తోసిపుచ్చారు. "అర్హులైన తెల్లకార్డుదారుల జోలికి మేం వెళ్లడంలేదు.

తెల్లకార్డులు ఉండి కోట్ల రూపాయల విలువైన మద్యం షాపులు పొందిన వారినే ప్రశ్నిస్తున్నాం. వారు నిజంగా పేదలైతే లైసెన్స్ వెనకున్నదెవరో వెల్లడిస్తే... ఎలాంటి ఇబ్బందీ ఉండదు'' అని వివరించారు. అసలైన బినామీల గుట్టురట్టు చేయాలన్నదే తమ ప్రయత్నమని ఆయన వివరించారు. ఒక జిల్లాను లేదా కొందరు వ్యక్తులను టార్గెట్ చేయలేదని... ఏసీబీ ఎవరి తరఫునో పని చేయడం లేదని స్పష్టం చేశారు.

ఎక్సైజ్‌లో సంకటం
ఒకప్పుడు గ్లాసులు, కాసులతో గలగల. ఇప్పుడు.... అంతా వెలవెల. మద్యం సిండికేట్లపై దాడులు మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి! ఒకవైపు ముడుపుల ప్ర వాహం ఆగిపోవడం, మరోవైపు కేసులతో సతమతమవుతుండటంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు అందరిలోనూ కలవరమే!


ఏసీబీ దాడుల తర్వాత ఎక్సైజ్ శాఖలో తలెత్తిన పరిణామాలివి...

- చేతిలో సొమ్ములు లేకపోవడంతో వాహనాల కిరాయి, డ్రైవర్ల జీతాలు చెల్లించలేకపోతున్నారు. చాలా స్టేషన్లలో అధికారులు వాహనాలను వాటి యజమానులకు తిరిగి అప్పగించేశారు.

- సోదాలకు వెళ్లేందుకు చేతిలో వాహనాలు లేకపోవడంతో... అధికారులు ఆఫీసుకు వచ్చి, సంతకం చేసి, కాసేపు కూర్చుని ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

- ఎక్సైజ్ స్టేషన్లలో స్వీపర్లు, అటెండర్ల వంటి ప్రైవేటు ఉద్యోగులు వేరే పనులు చూసుకుంటున్నారు.

- తన శాఖలో కలకలం చెలరేగుతున్నా ఎక్సైజ్ కమిషనర్ సమీర్ శర్మ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నా రు. మూడు నెలలుగా సమీక్షలే లేవు. బహుశా... ఇ లా జరగడం ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే ఇదే తొలిసారి.

- ఎక్సైజ్ సిబ్బంది పర్యవేక్షణ కొరవడి... పొరుగు రాష్ట్రాల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ మన రాష్ట్రంలోకి ప్రవహిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి