17, ఏప్రిల్ 2012, మంగళవారం

కులవ్యవస్థపై పోరాడిన ధీశాలి


  • -త్రిపురనేని హనుమాన్ చౌదరి
  • 14/04/2012
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులందరూ బ్రిటిష్ పాలననుండి బయటపడి, స్వరాజ్యం కావాలనే ఏకైక లక్ష్యాన్ని ప్రజలముందుంచారు. స్వరాజ్యం కోసం పోరాటాలు నడిపారు. కేవలం చక్రవర్తిరాజగోపాలాచారి, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్‌లు మాత్రమే స్వరాజ్యం ద్వారా ఎటువంటి ప్రయోజనాలుంటాయనే విషయాలపై బాగా ఆలోచించి వాటిని ప్రజలకు విడమ రచి చెప్పడం ద్వారా చైతన్యవంతులను చేయడానికి యత్నించారు. స్వాతంత్య్రం..స్వరాజ్యం, సుపరిపాలన కోసం మనకు స్వాతంత్య్రం రావాలని చక్రవర్తి రాజగోపాలాచారి పేర్కొనగా, డాక్టర్ అంబేద్కర్ ఆయ నతో విభేదించారు. రాజకీయ సమానత్వంతోపాటు, సాంఘిక, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే స్వాతంత్య్ర సాధనలో మన ధ్యేయం కావాలన్నారు. ఇవి సాధించలేని సుపరిపాలన, స్వపరిపాలన వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని ఆయన ఘంటాపథంగా చెప్పారు. హిందూ సమాజంలో జన్మతః సంక్రమించే కులాలను బట్టి అసమానత, అనివార్య అంగమైంది. విశేషించి అస్పృశ్యత, ఆజన్మ దారిద్య్రం, అన్యాయం, దాస్యం, విద్యారాహిత్యం వంటి అవలక్షణాలను దళిత కులాలకే ఆపాదించారు. హిందూ సమాజం పరిఢవిల్లాలన్నా, ప్రపంచానికి మరిం త ఆదర్శవంతంగా నిలవాలన్నా ఈ అసమానతలు, వివక్ష పూర్తిగా తొలగిపోవాలి. లేనిపక్షంలో హిందూ సమాజం విచ్ఛిన్నవౌతుందని అంబేద్కర్ వాదించారు. ఈ అమానుషానికి కులవ్యవస్థ కారణం కాబట్టి కుల నిర్మూలన, మన ఉద్యమానికి మహద్ధ్యేయం కావాలి: స్వరాజ్యం యొక్క ప్రథమ ప్రయోజనం కులాధారిత అసమానతా నిర్మూలనం అన్నారు అంబేద్కర్!
కులవ్యవస్థ నశించాలంటే అందరికీ (సు)విద్య అవసరం. కేవలం విద్య ద్వారానే అంతరాలు తొలగుతాయ. అందుకే స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రచించే బాధ్యత ఆయనపై పెట్టినప్పుడు, ఆరు-పధ్నాలుగు సంవత్సరాల మధ్య వయస్కులైన ప్రతి భారతీయ బాల బాలికలకూ ప్రభుత్వం నిర్బంధంగా, ఉచితంగా విద్య గరపాలనే అధికరణాన్ని అంబేద్కర్ వ్రాశారు. అసలీవిధమైన అధికరణం మరే ఇతర దేశపు రాజ్యాంగంలో కానరాదు. ఈ అధికరణాన్ని గణతంత్ర వ్యవస్థ అమల్లోకి వచ్చిన పదేళ్ళ వ్యవధిలో అమల్లోకి తీసుకొని రావాలని రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ.. తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం విచాకరం. అందుకే భారతదేశం, ప్రపంచంలోనే ఎక్కువమంది-35కోట్లు- నిరక్షరాస్యులున్న దేశంగా కుఖ్యాతిని పొందుతోంది. విద్య ఉంటే కులవృత్తి మార్చుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన బిసి/ఎస్‌సి/ఎస్‌టి విద్యార్థులెవరూ కులవృత్తులు చేపట్టడానికి ఇష్టపడరు. వారు ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో లేదా మరే ఇతర రంగాల్లోనో రాణిస్తారు.
విద్యావంతులైన యువకులు ఏ కులానికి చెందినవారైనా, ఉపాధికోసం ఊరు విడిచి పట్నానికి వెళ్ళడం తథ్యం. దేశ ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య ప్రగతి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పారంపరిక కులవృత్తులను విసర్జించి పట్నాలకు చేరుకున్న వారికి ఉద్యోగ ఉపాధి లభించగానే వారి జీవన ప్రమాణాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయ. ఆవిధంగా వృత్తి, ఊరు మారితే, కులం అప్రస్తుతం, అర్థరాహిత్యవౌతుంది. కులనిర్మూలనం, చట్టాలవల్ల గాక, విద్య-వికాసాల వల్లమాత్రమే సాధ్యం. అందుకే అంబేద్యర్ విద్యకంత ప్రాధాన్యతనిచ్చారు. వారి బోధను మన్నించకుండా రాజకీయ నేతలూ, పార్టీలు, కులాలను శాశ్వతీకరణం చేసే యత్నాలను తీవ్రతరం చేస్తున్నారు.
అంబేద్కర్ హైందవాన్ని సంస్కరించడంకోసం, స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖమంత్రిగా హిందూకోడ్ బిల్లులను రూపొందించి చట్టం చేయించారు. వివాహం, వారసత్వాల్లో వాంఛనీయమైన మార్పులు తెచ్చారు. కుల నిర్మూలనకు, దళితుల ఆత్మగౌరవోద్ధరణకూ ఎంత ప్రయత్నించినా వాంఛిత మార్పులు తీసుకురాలేకపోయినందుకు బాధపడి, ‘నేను హిందువుగా పుట్టాను. కానీ హిందువుగా మరణించదలచుకోలా,’ అంటే మతం మార్చుకుంటానన్నారు. అయతే సామాజికంగా ఉన్నత స్థితి పొందడానికి క్రైస్తవ, ముస్లిం మతాలు అనుకూలమైనా ఆయన వాటివైపు ఆకర్షితులు కాలేదు. భరత భూమిపై ఉద్భవించిన బౌద్ధం, జైనం, సిక్కు, వైష్ణవం ఇలా ఎన్నో మతాలున్నాయి. అన్నింటికన్నా సముచితమైంది బౌద్ధం. కులాలు లేవు. హేతుబద్ధమైనది. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, జాతి విచక్షణ లేకుండా అంగీకరించేది కనుక భారతీయునిగా దేశోద్భవమైన బౌద్ధాన్ని స్వీకరిస్తా: తన అనుయాయులందర్నీ బౌద్ధులవమని కోరుతున్నా’నని ప్రకటించి 1956లో నాగపూర్‌లో కొన్ని లక్షల మంది దళితులను సమీకరించి బౌద్ధాన్ని స్వీకరించారు. ఆవిధంగా ధర్మ పునరుద్ధరణకు నాంది పలికారు. స్వదేశీ మత స్వీకారం, అంబేద్కర్ అకుంఠిత దేశభక్తికి తార్కాణం. ఈ విషయంలో ఆనాటి శంకరాచార్యులు అంబేద్కర్‌ను శ్లాఘించారు. బౌద్ధం కూడా హైందవ ధర్మ పరివారంలో భాగమే. హిందువులు బుద్ధుణ్ణి అవతారంగా గౌరవిస్తారు. కానీ అంబేద్కర్‌పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు కొందరు యత్నించారు. కానీ అటువంటి యత్నాలు సఫలీకృతం కాలేదు. రాజ్యాంగ రచన సందర్భలో అప్పటి కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా తన రాష్ట్రానికి విశేష ప్రతిపత్తి కల్పించాలని ప్రాధేయపడితే, ‘నేను భారతీయుణ్ణి: భారత ప్రభుత్వ న్యాయశాఖ మంత్రిని. నాదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కల్పించే ఏ అధికరణనూ, రాజ్యాంగంలో ఉండనీయన’ని అబ్దుల్లాకు నిర్ద్వంద్వంగా చెప్పి పంపిన ధీశాలి, దేశభక్తుడూ అంబేద్కర్.
మరో విషయంలోనూ ఎంతో దూరదృష్టిని చూపిన మేధావి అంబేద్కర్. తమ విశ్వాసాల దృష్ట్యా, చారిత్రక వాస్తవాల దృష్ట్యా, ముస్లింలు భారత జాతీయతను, అంగీకరించరని, భరతఖండంలో ముస్లిం సమస్యకు శాశ్వత సుస్థిర పరిష్కారం, ముస్లింలు కోరుతున్నట్టుగా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్‌ను ఏర్పరచడం, ఆ పరిష్కారంలో భాగంగా, ముస్లింలీగ్ కోరినట్లు, ఉభయ దేశాల్లోని మైనారిటీలను, తమ మెజారిటీ దేశాల్లోకి తరలించాలనీ, అంబేద్కర్ తాను రచించిన ‘పాకిస్తాన్ ఆర్ ఇండియా డివైడెడ్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. అంబేద్కర్ వాదనలోని సహేతుకతనూ, ఆయన ఇచ్చిన సలహాను, గాంధీ, మిగిలిన కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకించారు.
ప్రథమ ప్రపంచ సంగ్రామానంతరం, టర్కీ సామ్రాజ్యం అంతమయినప్పుడు, అప్పటి అంతర్జాతీయ సంస్థ లీగ్ ఆఫ్ నేషన్స్ పర్యవేక్షణలో, టర్కీలోని క్రిస్టియన్ అల్ప సంఖ్యాకులందరూ తమ మెజారిటీ దేశాలయిన గ్రీస్, బల్గేరియా, రుమేనియాలకూ: ఆ దేశాల్లోని ముస్లింలందరూ టర్కీకి శాంతియుతంగా తరలి వెళ్ళారన్న చారిత్రక వాస్తవాన్ని, అంబేద్కర్..గాంధీ, నెహ్రూ, మిగిలిన కాంగ్రెస్ పెద్దలు, భారతీయుల దృష్టికి తెచ్చి, విభజనతోపాటు శాంతియుతంగా మైనారిటీల తరలింపులు జరగటమే శాశ్వత పరిష్కారమని బోధించారు. హింసాయుత మత కల్లోలాల నేపథ్యంలో దేశ విభజనకు కాంగ్రెస్ ఒప్పుకుంది. పాకిస్తాన్ తన ప్రకటిత నీతి ప్రకారం, హిందువులను, సిక్కులను తన దేశంనుంచి గెంటివేసింది. మన దేశం సర్వమత సమభావ వ్యవస్థను అనుసరించడం వల్ల, గాంధీ, నెహ్రూల నేతృత్వంలోని కాంగ్రెస్.. ముస్లిం లను పాకిస్తాన్‌కు తరలి వెళ్ళమని చెప్పలేదు. సర్వ మతస్థులు భారత్‌లో శాంతి సౌఖ్యాలతో, పరమత సహనంతో సహజీవనం నెరపాలని వాంఛించారు. కానీ నేటి కాలంలో కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం కుల, మత, భాష ప్రాంత రాజకీయాలను నెరపుతు న్నాయ. అంబేద్కర్ దీన్ని అప్పట్లోనే ఊహించారు. ఆయన రాజ్యాంగ సభ యొక్క అంతిమ సమావేశంలో ప్రసంగిస్తూ, కుల,మత రాజకీయాలు దేశాన్ని ముక్కలు చేయడానికి, ప్రాంతీయ తత్వాన్ని ప్రేరేపించడానికి మాత్రమే దోహద పడతాయని బాధతో హెచ్చరించారు. నేటి రాజకీయ పార్టీలు అంబేద్కర్ ఆశించిన విధంగా కుల నిర్మూలనకు కృషి చేయకపోగా, ఓట్ల కోసం కుల రాజకీయాలను నెరపుతుండటం దేశ సమాజంలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నాయ. ఫలితంగా భాష, ప్రాంతీయ, కుల పరమైన దురభిమానాలు తీవ్రస్థాయకి చేరడం నడుస్తున్న చరిత్ర. కులం వల్ల కలిగే అనర్థాలను ఆనాడే పసిగట్టి, సార్వజనీన సమాజాన్ని ఆకాంక్షించిన మేధావి అంబేద్కర్. ఆయన ఆశయ సాధనతోనే దేశ ప్రగతి సాధ్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి