న్యూఢిల్లీ,
ఏప్రిల్ 18: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, నీటిపారుదల రంగంలో గణనీయమైన
అభివృద్ధిని సాధించిందని కేంద్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్
అహ్లువాలియా ప్రశంసించారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రణాళికా
పెట్టుబడులను రూ.48,935కోట్లుగా ఖరారు చేసినట్లు ఆయన బుధవారం విలేఖరులతో
చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికా పెట్టుబడులతో పోలిస్తే ఇది
13.8 శాతం అధికం కావడం గమనార్హం. గతంలో రూ.43వేల కోట్లు కేటాయించడం
జరిగింది. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ
మంత్రి ఆనం రాంనారాయణ్‌రెడ్డితో రాష్ట్ర వార్షిక ప్రణాళిక గురించి చర్చలు
జరిపిన అనంతరం మాంటెక్‌సింగ్ అహ్లువాలియా కొద్దిసేపు విలేఖరులతో
మాట్లాడారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రణాళికా పెట్టుబడులు బాగా
పెరిగాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిర్దారించిన ప్రణాళికా
ప్రాధాన్యాలు తమను బాగా ఆకట్టుకున్నాయని అహ్లువాలియా చెప్పారు. విద్య,
వైద్య రంగంలో కొత్త విధానాలను అమలు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నం
ప్రశంసనీయమన్నారు. మైనారిటీలకు వౌలికసదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర
ప్రభుత్వం చేసిన కృషిని మెచ్చుకున్నారు. ఇంధనం, వౌలిక సదుపాయాల వంటి
రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సహాయం అవసరమున్నదని ఆయన తెలిపారు. ఈ
రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు
తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగాల్లో బాగా
అభివృద్ది సాధించింది, ఏ రంగాల్లో వైఫల్యం పొందిందని ఒక విలేకరి అడుగగా
తాము అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతనే దీనికి సమాధానం
చెప్పగలుగుతామని అంటూనే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని తీరు
బాగుంటుందని అహ్లువాలియా కితాబు ఇచ్చారు. అయితే కిరణ్ సర్కార్ విద్యా
రంగంపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. కాగా, పోలవరం ప్రాజెక్టు
వివాదం కోర్టు పరిశీలనలో ఉన్నందున దీనిపై తాను వ్యాఖ్యానించలేనన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రణాళికాసంఘం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని
ఆయన చెప్పారు. వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం
నిధులు సరిపోవు కాబట్టి ఈ రంగంలోకి ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించాలని
అహ్లువాలియా సూచించారు. ఇదిలావుంటే రాష్ట్రంలో అభివృద్ధి రేటు పడిపోవటం
పట్ల కేంద్ర ప్రణాళికా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. 2010-11 సంవత్సరంలో
రాష్ట్రం 8.92 శాతం అభివృద్ధి సాధిస్తే 2011-12 సంవత్సరంలో ఇది 5.81
శాతానికి పడిపోయిందని కేంద్ర ప్రణాళికాసంఘం తెలిపింది. అయితే రాష్ట్రంలో
సగటు తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెబుతూ 2004-05 సంవత్సరంలో 25,321
రూపాయలున్న సగటు తలసరి ఆదాయం 2011-12 సంవత్సరంలో ఇది 42,710 రూపాయలకు
పెరిగిందన్నారు. సగటు జాతీయ తలసరి ఆదాయం 2004-05 సంవత్సరంలో 24,143
రూపాయలుంటే 2011-12 సంవత్సరంలో 38,005 రూపాయలని కేంద్ర ప్రణాళికాసంఘం
తెలిపింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి