12, ఏప్రిల్ 2012, గురువారం

అమెరికా యుద్ధ నౌకల్ని మేం ఫోటోలు తీశాం -ఇరాన్


ఇరాన్ గూఢచార విమానాలు అమెరికా యుద్ధ నౌకాలను ఫోటోలు తీశాయని ఇరాన్ మిలట్రీ కమాండర్ ప్రకటించాడు. పర్షియా ఆఘాతంలో తిష్ట వేసి ఉన్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌకతో పాటు ఇతర యుద్ధ విమానాలను, తమ మానవ రహిత డ్రోన్ లు ఆకాశం నుండి ఫోటోలు తీసాయని బ్రిగేడియర్ జనరల్ ఫర్జాడ్ ఎస్మాయిల్ మంగళవారం ప్రకటించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. ఇరాన్ గగన తాళంలోకి జొరబడి గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా డ్రోన్ విమానాన్ని గత డిసెంబరులో ఇరాన్ మిలట్రీ కూల్చి వేసింది. పశ్చిమ దేశాలు ఇరాన్ పై దాడి చేస్తామంటూ బెదిరింపులకి దిగుతున్న నేపధ్యంలో ఇరాన్ ప్రకటన ప్రాముఖ్యత సంతరించుకుంది.
జనరల్ ఫర్జాద్ ఇరాన్ లోని ఖటామ్ ఆల్-అన్బియా ఎయిర్ డిఫెన్స్ బేస్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇరాన్ ఆర్మీ రిమోట్ కంట్రోల్ తో నడిపే డ్రోన్ విమానాలను తయారు చేసుకుంది. ఇరాన్ కి చెందిన ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్, ఆర్మీతో కలిసి సంయుక్తంగా డ్రోన్ ఆపరేషన్లు చేపట్టినట్లు తెలుస్తోంది. పర్షియా ఆఘాతంలో అమెరికా యుద్ధ చర్యలపై తాము నిఘా వేసామని తాజా ప్రకటన ద్వారా ఇరాన్ స్పష్టం చేయదలుచుకున్నట్లు భావించవచ్చు.
సి.ఐ.ఏ గూఢచార డ్రోన్ లు ఇరాన్ గగన తలంలోకి ప్రవేశించి ఇరాన్ అణు కర్మాగారాలను ఫోటోలు తీసినట్లు ఇటీవల వాషింగ్టన్ పోస్టు పత్రిక కధనం ప్రచురించింది. ఈ కధనాన్ని ఇరాన్ కమాండర్ ఫర్జాద్ తిరస్కరించాడు. అటువంటి ఫోటోలు ఏమయినా ఉంటే అవి అమెరికా శాటిలైట్లు తీసిన ఫోటోలు కావచ్చని ఆయన అన్నాడు. సి.ఐ.ఏ స్టెల్త్ డ్రోన్లు ఇరాన్ గగనతలం లోకి ప్రవేశిస్తే వాటిని కూల్చివేయడం ఖాయమని ఆయన ప్రకటించాడు. డిసెంబర్ లో తాము అలానే ఒక అమెరికా డ్రోన్ ని కూల్చివేశామని ఆయన గుర్తు చేశాడు.
“అలాంటిదే ఒక డ్రోన్ ఇరాన్ లోకి చొరబడడానికి ప్రయత్నించింది. దాన్ని కూల్చి వేసిన సంగతి అందరికీ తెలుసు” అని ఇరాన్ కమాండర్ అన్నాడు. ఇరాన్ కూల్చి వేసిన అమెరికా డ్రోన్ మోడల్ ఆర్.క్యూ-170. ఇది అత్యంత ఆధునాతన సాంకేతికతతో నిర్మించిన డ్రోన్ గా అమెరికా చెప్పుకుంటుంది. తమ అధునాతన డ్రోన్ విమానాలను వేరొకరు కూల్చివేశారన్న వార్త అమెరికాకి ప్రతిష్ట కు సంబంధించిన సమస్య. అందుకే తమ డ్రోన్ ను ఇరాన్ ఆర్మీ కూల్చివేసిందన్న వార్తను అమెరికా బహిరంగంగా అంగీకరించలేదు. ఆఫ్ఘనిస్ధాన్ లో తమ డ్రోన్ ఒకటి అదృశ్యమైందని చెప్పి ఊరుకుంది. అయితే డ్రోన్ కూల్చివేత వార్తా నిజమేనని ఆ తర్వాత అమెరికా అధికారులను ఉటంకిస్తూ కొన్ని పత్రికలు తెలిపాయి. అది సి.ఐ.ఏ గూఢచార విమానమేనని అంగీకరించినట్లుగా అవి తెలిపాయి. తమ విమానాన్ని తమకు ఇచ్చేయాల్సిందిగా ఇరాన్ ను అమెరికా అధ్యక్షుడు ఒబామా స్వయంగా కోరినట్లూ, దానికి ఇరాన్ తిరస్కరించినట్లూ వార్తలు తెలిపాయి.
డ్రోన్ విమానాల కూల్చివేత అమెరికాకి మరోకందుకు కూడా సమస్యగా భావిస్తుంది. కూల్చివేశాక శత్రు దేశాలు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించి తాము కూడా తయారు చేసుకుంటాయేమోనని అది భయపడుతుంది. డ్రోన్ ను కూల్చివేశాక చైనా ఇంజనీర్లు డ్రోన్ ని పరిశీలించి వెళ్లారని వార్తలు వచ్చాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి