హైదరాబాద్,
ఏప్రిల్ 8: రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం
తాజాగా జారీ చేసిన భవన నిర్మాణ నిబంధనలు-2012 మధ్య తరగతి ప్రజానీకానికి
పెద్దగా ప్రయోజనం కలిగే విధంగా లేవు. సెట్‌బ్యాక్‌ల నిబంధనలకు సడలింపు
ఇచ్చినట్టు బయటికి కనిపిస్తున్నా, భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడానికి వసూలు
చేస్తున్న రుసుమును యథాతధంగా కొనసాగించడం వల్ల మధ్య తరగతి ప్రజల జేబుకు
చిల్లు తప్పేట్టు లేదు. 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో (358 చదరపు గజాలు)
ఇల్లు నిర్మించుకునే వారికి గతంలో ఉన్న సెట్‌బ్యాక్‌లు, మున్సిపాల్టీలకు
తనఖా పెట్టాల్సిన నిబంధనలు తాజా ఉత్తర్వుల్లో తొలగించినప్పటికీ, నిర్మాణ
అనుమతికి వసూలు చేసే రుసుముపై వెసులుబాటు కల్పించలేదు. గతంలో కూడా వంద
చదరపు మీటర్ల స్థలంలో నిర్మించుకునే ఇళ్లకు సెట్‌బ్యాక్‌లపై (వదలాల్సిన
స్థలం) సడలింపు ఎలాగూ ఉండనే ఉంది. అయితే ప్రస్తుతం ఈ నిబంధనలను 200 చ.మీ.
విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు కొంత మేరకు సడలింపు ఇచ్చినప్పటికీ, దీనికి
ఇంటి ముందు ఉండే రోడ్ వెడల్పునకు లంకె పెట్టారు. గతంలో ఉన్న నిబంధనల
ప్రకారం ఇంటిముందు 3 మీటర్లు (9.84 అడుగులు), మిగతా మూడు వైపుల 1.5 మీటర్లు
(4.92 అడుగులు) సెట్‌బ్యాక్ వదలాలనే నిబంధన ఉండేది. ప్రస్తుతం దీనిని ఏడు
మీటర్ల (22 అడుగుల) ఎత్తులో నిర్మించే భవనాలకు ఇంటి ముందు భాగంలో ఐదు
అడుగులు సెట్‌బ్యాక్ వదలాలనే నిబంధన పెట్టి, మూడు వైపుల సెట్‌బ్యాక్‌ను
రద్దు చేశారు. అయితే పది మీటర్ల ఎత్తులో వంద నుంచి 200 గజాల స్థలంలో
నిర్మించే భవనానికి ఇంటి ముందు సెట్‌బ్యాక్ ఐదు అడుగులకు పరిమితం
చేసినప్పటికీ, ఇంటికి మూడు వైపుల 3.2 అడుగులు వదలాలనే నిబంధనలు విధించారు.
ఇక ఇంటి నిర్మాణం అనుమతికి వసూలు చేసే రుసుమును మధ్య తరగతి ప్రజానీకం
భరించలేని విధంగా ఉన్న విషయం తెలిసిందే. తాజా నిబంధనల్లో ఆ భారాన్ని
ఏమాత్రం తగ్గించలేకపోయింది ప్రభుత్వం. ఇంటి నిర్మాణ అనుమతికి చదరపు అడుగుకు
10, కంపౌండ్ వాల్‌కు 20, డవలప్‌మెంట్ చార్జిగా నిర్మిత స్థలానికి చదరపు
మీటర్‌కు 100, రోడ్ కట్టింగ్ మినహాయించి మిగతా స్థలానికి చదరపు మీటర్‌కు
75, నిర్మిత స్థలానికి బెటర్‌మెంట్ చార్జి కింద చదరపు మీటర్‌కు 100, రోడ్
కట్టింగ్ మినహాయించి మళ్లీ బెటర్‌మెంట్ చార్జిగా చదరపు మీటర్‌కు 125,
రేయిన్ వాటర్ హార్వెస్టింగ్ చార్జిగా చదరపు మీటర్‌కు 8, ఇంతకాలం స్థలాన్ని
ఖాళీగా ఉంచినందుకు చదరపు గజానికి మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం
జరిమాన, 8 శాతం గ్రంధాలయ సెస్, ఇంటి నిర్మాణ సమయంలో శిథిలాల తొలగింపునకు
2000 చెల్లించాలనే నిబంధనలు యథాతధంగా కొనసాగుతాయని తాజా ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు. వంద చదరపు మీటర్లలో 1000 చదరపు అడుగుల స్థలంలో మధ్య తరగతి
ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలన్నా సదరు మున్సిపాల్టికి సుమారు 50 వేలు
చెల్లించాల్సిందే. మొత్తానికి తాజా చట్టం సెట్‌బ్యాక్‌లను మాత్రమే
సడలించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి