మొబైల్
ఫోన్ల మార్కెట్‌లో ఏళ్ళతరబడి రారాజుగా చెలామణీ అయిన నోకియా మార్కెట్
గణనీయంగా పడిపోయింది. మరోవైపు శ్యాంసంగ్, సోని ఎరిక్సన్ కంపెనీలు విపరీతంగా
పుంజుకున్నాయి. ఈ పరిణామానికి కారణం స్వయంకృతాపరాధమని తెలుసుకున్న నోకియా
పూర్వ ప్రాభవాన్ని సంతరించుకోవడానికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
సెల్
ఫోన్ అంటేనే నోకియా అనే స్థాయిలో ఆ కంపెనీ ప్రస్థానం ప్రారంభమయింది.
ఫిన్లాండ్ దేశానికి చెందిన ఈ కంపెనీ దాదాపు ఒకటిన్నర దశాబ్దాలపాటు తన
ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే రెండేళ్ళుగా ఆ కంపెనీ అమ్మకాలు
తిరోగమనదిశలో సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గూగుల్ కంపెనీ సెల్
ఫోన్లకోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.
ఆండ్రాయిడ్ ఓఎస్‌తో మొబైల్ ఫోన్ల ఉపయోగంలో ఎన్నో సానుకూల, విప్లవాత్మక
మార్పులు రావడంతో అందరూ దానిపట్ల ఆకర్షితులయ్యారు. దీనిని గమనించిన
శ్యాంసంగ్ కంపెనీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పలు మోడల్స్‌ను మార్కెట్లోకి
దించింది. సోని ఎరిక్సన్, మోటరోలా తదితర కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని
అనుసరించాయి. కానీ మార్కెట్ నంబర్ వన్‌గాఉన్న నోకియామాత్రం ఈ పరిణామాన్ని
లైట్ తీసుకుంది. ఏళ్ళతరబడి తమ ఫోన్లలో అమర్చుతున్న సింబియన్ ఓఎస్‌నే
కొనసాగించింది. ఆండ్రాయిడ్‌లో ఉన్న యూజబిలిటీ సింబియన్‌లో లేకపోవడంతో
నోకియాకు ఆదరణ క్రమంగా తగ్గిపోయింది. విండోస్, అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌లతో
కొన్ని మోడళ్ళను విడుదల చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.
అటు,
ఏపిల్ కంపెనీ తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ iosతో ఐఫోన్లను మార్కెట్లోకి
దించడం కూడా నోకియాకు తీవ్ర విఘాతంగా మారింది. నోకియా హైఎండ్ ఫోన్లు, ఏపిల్
ఐఫోన్లకు ఏమాత్రం సరితూగలేకపోయాయి. ఐఫోన్లలోని ఫీచర్స్ వాడకందార్లకు
విపరీతంగా నచ్చుతుండటంతో ఆ ఫోన్లకోసం జనం, ముఖ్యంగా యువత వేలంవెర్రిగా
ఎగబడుతున్నారు. నోకియా హైఎండ్ మోడళ్ళలో నాలుగేళ్ళక్రితం వచ్చిన N95
తప్పితే, తర్వాత వచ్చిన ఏ ఒక్కటీ ప్రజాదరణకు నోచుకోలేకపోయింది.
గూగుల్,
ఏపిల్ కంపెనీల ఉత్పత్తులను ఎదుర్కోవడంకోసం నోకియా తాజా వ్యూహాలతో,
కొత్తకొత్త ఫీచర్లతో, విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇటీవలే ల్యూమియా
800అనే మోడల్ దించింది. ఇది ఎంతవరకు ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.
మరోవైపు
డ్యూవల్ సిమ్ మార్కెట్ పట్ల నిర్లక్ష్యం వహించడంకూడా నోకియా అమ్మకాలను
దెబ్బతీసింది. అటు శ్యాంసంగ్ కంపెనీమాత్రం డ్యువల్ సిమ్ మోడళ్ళను
పెద్దసంఖ్యలో విడుదల చేసి మార్కెట్‌ను చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని
ఆలస్యంగా తెలుసుకున్న నోకియా, ఇప్పుడు డ్యువల్ సిమ్ మార్కెట్లోకి పెద్ద
ఎత్తున మోడళ్ళను దించుతోంది.
స్థానిక,
చైనా కంపెనీల ప్రభావంకూడా నోకియాపై తీవ్రంగా ఉంది. మైక్రోమ్యాక్స్, కార్బన్
వంటి స్థానిక కంపెనీలు, చైనావారి నకిలీ ఉత్పత్తులు నోకియా అమ్మకాలను బాగా
దెబ్బతీశాయి. మైక్రోమ్యాక్స్ వంటి స్థానిక కంపెనీలు కూడా ఆండ్రాయిడ్
ఓఎస్‌తో మోడళ్ళను దించి మార్కెట్టును ఎంతోకొంత చేజిక్కించున్నాయి.
బిజినెస్
ఫోన్ల క్యాటగరీలో అగ్రగామిగా చెలామణీ అయిన బ్లాక్‌బెర్రీ కంపెనీకూడా
నోకియాలానే తిరోగమన దిశలో ఉండటం మొబైల్ ఫోన్ల మార్కెట్లో మరో విశేషం.
పరిస్థితిని పునరుద్ధరించడంకోసం ఆ కంపెనీకూడా చర్యలు చేపట్టింది ఇటీవల తన
ఫోన్ల ధరలను రెండు విడతలుగా తగ్గించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి