26, అక్టోబర్ 2012, శుక్రవారం

రేప్‌ల వెనుక రాజకీయాలు!


  • - ఇందర్ మల్హోత్రా
  • 23/10/2012
ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ హర్యానాలోని జింద్ ప్రాంతాన్ని ఆకస్మికంగా సదర్శించడం అక్కడి బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసమే. అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చడానికి సోనియా అక్కడికి వెళ్ళారు. నిజానికి ఇటీవలికాలంలో హర్యానాలో మహిళలపై లైంగిక పరమైన అత్యాచారాలు విపరీతమయ్యాయి. వీటికి అంతం అనేది కనిపించడం లేదు. ముఖ్యంగా దళిత కుటుంబాలకు చెందిన మహిళలపై ఈవిధమైన అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. మహిళలపై ఇటువంటి అకృత్యాలు తగ్గాలంటే, వివాహ వయస్సును తగ్గించడం ఒక్కటే మార్గమంటూ కర్కోటకులైన ఖాప్ పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పిన నేపథ్యంలో.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహానికి, మనస్తాపానికి లోనైనారనేది మాత్రం సత్యం. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు ఆమె ఒక తిరుగులేని పరిష్కారాన్ని చూపేదిశగా యత్నిస్తానని కూడా చాలామంది ఆశించారు. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అటువంటి చర్యల ఊసే లేదు. విషాదమేంటంటే, ఒకపక్క సోనియాగాంధీ బాధితులను పరామర్శించడానికి రాష్ట్రంలో ఉన్నరోజే, మరో మహిళ లైంగిక పరమైన అత్యాచారానికి గురైంది. మరుసటి రోజు మరో రెండు అత్యాచారాలు, తర్వాత మరికొన్ని వెరసి గత నెలలో రాష్ట్రంలో జరిగిన రేప్‌ల సంఖ్య 13కు చేరుకుంది. హర్యానా పీఠంపై ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి హుడాతో సహా, రాష్ట్రంలోని ఏ రాజకీయ నాయకుడు ఖాప్ పంచాయతీల తీర్పుపై నోరు మెదపడంలేదు. వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అసలే లేదు. ఎందుకంటే వివిధ గ్రామాల్లో వాటికున్న పట్టు అట్లాంటిది. ఖాప్ పంచాయతీలను వ్యతిరేకించిన నాయకుడు తన రాజకీయ జీవితానికి తనే సమాధి కట్టుకున్నట్టే! ఖాప్ పంచాయతీల శక్తి అటువంటిది మరి! ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) మాత్రం మహిళలపై జరుగుతున్న ఈ హేయనీయమైన అకృత్యాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నదని చెప్పడం మసిపూసి మారేడుకాయ చేసే చందమే. అత్యాచారాలను అరికట్టడంలో తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సరికొత్త పాటలు పాడుతోంది. ‘‘ఇటువంటి సంఘటనలు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోను జరుగుతున్నాయి’’ అంటూ సమర్థించుకోవడానికి యత్నించడానికి మించిన ఆత్మవంచన మరోటుండబోదు. అంతేకాదు గతంలో అత్యాచారం జరిగి నమోదు కాని కేసులను కూడా తాజాగా నమోదు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అన్నింటికి మించి ‘‘ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను మంటగలిపే చర్యలివి’’ అంటూ ప్రభుత్వ వర్గాలు పేర్కొనడం సిగ్గుమాలిన తనానికి పరాకాష్ఠ.
అసలు నిజాలేంటి? కేంద్ర గణాంకాల ప్రకారం 2011లో దేశవ్యాప్తంగా 24వేలకు కొంచెం ఎక్కువగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. మరి సాపేక్షంగా తక్కువ జనాభా కలిగిన హర్యానాలో మొత్తం 733 అత్యాచారాలు జరిగినట్టు నమోదయింది. మరి ఈ ఏడాది ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పర్యటించినప్పటికీ, కేవలం 34 రోజుల్లో హర్యానా రాష్ట్రంలో మొత్తం 19 అత్యాచార కేసులు నమోదు కావడం, దేశవ్యాప్తంగా ఖండనలు వ్యక్తమవడానికి ప్రధాన కారణం. ఈ కేసుల్లో తాజాది అక్టోబర్ 14న ప్రపంచానికి వెల్లడయింది. సంఘటన గురించి తెలిసిన వారి రక్తం మరగక మానదు..ఒక్క హర్యానా వాసులకు తప్ప! ఫతేహాబాద్ జిల్లా ఖాయ్ గ్రామంలో పాఠశాలకు ఎదురుగా అరవయ్యేళ్ళ వృద్ధుడు పండ్ల అమ్మకాన్ని కొనసాగించేవాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ తాను గత నాలుగు నెలలుగా పాఠశాలకు చెందిన 13 సంవత్సరాల విద్యార్థినిపై అత్యాచారం జరుపుతున్నట్టు అంగీకరించడంతో అతగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత గ్రామ పంచాయతీ ఈ కేసు విచారణను చేపట్టింది. కొంతకాలం దీనిపై తర్జన భర్జనలు జరిగిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్...‘బాధితురాలి తండ్రికి, అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడు రూ. 35వేలు చెల్లించాలి’ అని తీర్పు చెప్పాడు. విచారణ సందర్భంగా ఈ వృద్ధుడిపై తీవ్రమై ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఈ తీర్పును అంగీకరించాలని, ఇదే తుది తీర్పు కాబట్టి ఇకపై ఏవిధమైన విచారణలు ఉండబోవంటూ అతనికి చెప్పి ఒప్పించారు. మరి ఇప్పటి వరకు జిల్లాలోని ఏ విధమైన ఉన్నత పాలనా వ్యవస్థ, ఈ ఖాప్ పంచాయతీ తీర్పులో కలుగ జేసుకోవాలని భావించలేదు. అత్యంత క్రూరంగా పదమూడేళ్ళ బాలికపై నాలుగు నెలలపాటు జరిపిన అత్యాచారానికి ప్రతిఫలంగా రూ. 35వేలు చెల్లిస్తే సరిపోతుందా? అంటే అంతటి ఘోర కృత్యానికి ఈ మొత్తమే ప్రామాణికమా? ఇదిలావుండగా అసలు పాఠశాల పాలక వర్గాలు ఇన్నాళ్ళుగా ఈ ఆకృత్యం జరుగుతున్నా కళ్ళుమూసుకుని అంతా బయటపడ్డాక చేసిన నిర్వాకమేంటి? ఆ పండ్లు అమ్ముకునే వృద్ధుడు పాఠశాల సమీపంలో ఏవిధమైన పండ్ల అమ్మకాలు జరపకుండా నిషేధించడం. దీనికితోడు ఆ బాధిత బాలికను, ఆమె సోదరిని పాఠశాలనుంచి బహిష్కరించడం! వీరు పాఠశాలలో ఉంటే మిగిలిన బాలికలపై ఆ దుష్ప్రభావం పడుతుందన్న నెపంతోనే ఆ పని చేశామంటూ యాజమాన్యం సమర్థించుకుంది.
హర్యానాలోని గ్రామాలు, తాలూకాలు, జిల్లాస్థాయిల్లో నెలకొని ఉన్న ఆలోచనా విధానం కంటే ఘోరమైనదేమంటే, ప్రభుత్వ చట్టాలను, నియమ నిబంధనలను అమలు జరిపే యంత్రాంగంలో నెలకొన్న నిర్లిప్తతతో కూడిన క్రియాశూన్య వైఖరి. ఏ పార్టీ లేదా దాని అనుబంధ సంస్థలు అధికారంలో ఉన్నప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సోనియాగాంధీ జింద్ గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించి తిరిగి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కొద్ది రోజులపాటు రాష్ట్రంలో వరుసగా జరిగిన సంఘటనలు పరిశీలించాలి. అమె వెళ్ళిపోయిన తర్వాత, ఖాప్ పంచాయతీలకు చెందిన నాయకులంతా సమావేశమయ్యారు. ‘‘పరువు హత్యలు’’ వంటి నికృష్ట కార్యాలను సమర్థిస్తూ తీర్పులిచ్చిన ఈ పెద్దలు, వివాహాల విషయంలో సరికొత్త తీర్పునిచ్చేశారు. ఇందులో చట్టం, న్యాయం, పాలనా నిబంధనల వంటివి వీరికి ఏమాత్రం పట్టవు అనేదానికంటే ఖాతరు చేయరని చెప్పడం సముచితం. ఇంతకూ వీరు చెప్పినదేమంటే.. ‘రాష్ట్రంలో అత్యాచారాలు తగ్గుముఖం పట్టాలంటే తప్పనిసరిగా బాల, బాలికల వివాహవయస్సు తగ్గించాలి.’ ఈ విధంగా సరికొత్త వాదనను లేవనెత్తారు. అంటే బాల్యవివాహాల రద్దు చట్టాన్ని ఎత్తేయాలనేది వీరి వాంఛ! నిజానికి ఈ ప్రతిపాదనకు సోనియా పూర్తి వ్యతిరేకం. అంతేకాదు ఇది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం కూడా! ఇప్పటికీ ఈ బాల్యవివాహ చట్టాన్ని దేశంలోని చాలా ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు! నిజానికి ‘శారదా చట్టం’ పేరుతో బాల్యవివాహ నిరోధక చట్టం బ్రిటిష్ వారి హయాంలోనే అంటే 1930లోనే సెంట్రల్ అసెంబ్లీ ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది.
యాదృచ్ఛికంగా కావచ్చు..అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలికల దినాన్ని జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటుంటే..మనదేశంలో మాత్రం అసలు పట్టించుకున్నవాడే లేడు. ఈ దినోత్సవంనాడు ఇచ్చే ప్రధాన సందేశమేంటంటే, ‘‘బాల్య వివాహాలు స్ర్తిలలో వ్యక్తిగత అభివృద్ధిని నిరోధిస్తున్నాయి. అంతేకాదు, పోషకాహార లోపం కూడా కేవలం ఈ వివాహాల వల్లనే.’’ ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ లెక్కల ప్రకారం పెళ్ళి వయసు రాకుండానే వివాహాలు చేసుకొని పిల్లల్ని కనేవారి సంఖ్య దక్షిణాసియాలోనే అధికం. వీరు 46శాతం వరకు ఉన్నారు. మరి ఇదే ఆఫ్రికాకు చెందిన సబ్ సహారా ప్రాంతంలో 37 శాతం, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల్లో 29శాతం మంది బాల్య వివాహాలు చేసుకున్న వారున్నారు.
వీటిని అసలు హర్యానాలో పట్టించుకునే వారెవరూ లేరు. ఖాప్ పంచాయతీలు తమ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా ఒక ప్రకటన చేస్తూ.. వివాహ వయస్సు తగ్గించాలన్న ఖాప్ పంచాయతీ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. ఓట్ల రాజకీయం కోసం ఆయన ఆ ప్రకటన చేసినా...సర్వేసర్వత్రా వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో వెనక్కి తగ్గక తప్పలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ వారికి తాము చౌతాలా కంటె చాలా ఆధునికులమన్న దృఢ అభిప్రాయం ఉంది. అందువల్లనే ఖాప్ పంచాయతీల నిర్ణయంపై వారు సరికొత్త కోణంలో స్పందించారు. అసలు తొంబయి శాతం కేసులు స్ర్తిపురుషుల అంగీకారంతోనే జరుగుతున్నాయంటూ ముఖ్యమంత్రి హూడా మంత్రివర్గ సహచరుడొకరు అభిప్రాయాన్ని వెలిబుచ్చి, ఈ సమస్యకు సరికొత్త రంగును అద్దారు. అంతేకాదు మహిళలు తాము కోరుకుంటున్న వారికోసమే బయటకు వెళుతున్నారని చెప్పి, 21వ శతాబ్దపు ఆధునిక తొడుగును దీనికి తొడిగారు. సదరు మంత్రిగారి వ్యాఖ్యలు నిజానికి నోటమాట రాకుండా చేసేవిగా ఉన్నప్పటికీ పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లేదా ప్రధాని మన్మోహన్ సింగ్..ఎవరూ కూడా ఆ వాచాలుడిపై వీసమెత్తు చర్య తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు మరి.
ఇక మన న్యాయస్థానాల్లో రేప్ కేసుల విచారణ నత్తకు అన్న మాదిరిగా సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసులు 78 శాతం నుంచి 83శాతానికి చేరుకోవడమే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయవ్యవస్థ, వేగంగా పెరుగుతున్న ఈ తరహా కేసులకు అనుగుణమైన వేగంతో పనిచేయలేకపోతున్నది. అంతే కాదు ఇటువంటి సామాజిక అకృత్యాలపై రాజకీయంగా కూడా పోరాటం సాగించాలి. మరి అందుకు ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా ఉంది? ఓట్ల చుట్టూ పరిభ్రమించే రాజకీయ పార్టీలు అందుకు ఏమాత్రం ధైర్యం చేయలేవు. ముఖ్యంగా కులపరమైన ఓట్ల రాజకీయాలు సమాజంలో సంస్కరణలకు పెద్ద అడ్డంకిగా మారాయి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి