11, అక్టోబర్ 2012, గురువారం

విద్యుత్‌ సరఫరాపై చేతులెత్తేసిన అధికారులు


  • వ్యవసాయానికి 7గంటలు కుదరదన్న ట్రాన్స్‌కో
  • ట్రాన్స్‌కో నివేదికతో సర్కార్‌ ఫ్యూజులు గల్లంతు
రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాపై ట్రాన్స్‌కో చేతులెత్తేసింది. వ్యవసాయానికి ఎట్టిపరిస్థితుల్లోనూ 7గంటల కరెంట్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. వ్యవసాయానికి 7 గంటలు కాదు.. రోజుకు 12 కోట్లు ఖర్చు చేసినా.. 4 గంటలు కూడా ఇవ్వలేమంటూ అధికారులు లెక్కతేల్చారు. ట్రాన్స్‌కో సమర్పించిన నివేదికతో సర్కార్‌ ఫ్యూజులు పోయాయి.

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి మరింత క్షీణించింది. రబీ సీజన్ ప్రారంభం అవుతుండటంతో.. ఇప్పడు వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు మరింత కోతలు పడనున్నాయి. ఇక..పరిశ్రమల సంగతి సరే సరి. విద్యుత్ శాఖాధికారులు సీఎంకు సమర్పించిన నోట్ లో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు ఉన్నాయి. రోజుకు 12 కోట్లు చొప్పన.. 1200  కోట్లు ఖర్చు పెడితే వచ్చే 400 నుంచి 500  మెగావాట్ల విద్యుత్ తో వ్యవసాయానికి నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలంటే... ప్రస్తుత కోతలను మరింత పెంచి.. రోజుకు 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తేనే అది సాధ్యమని స్పష్టం చేసారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినా... గ్రిడ్ సామర్ధ్యం లేక పోవటంతో ఇంత కన్నా.. ఎక్కువ సరఫరా సాధ్యం కాదని కుండబద్దలు కొట్టారు.

ప్రస్తుతం.. విద్యుత్ శాఖ నోట్ ప్రకారం.. పరిశ్రమలకు ఇప్పgడున్న అధికారిక కోతలను  40 నుంచి 50 శాతానికి పెంచాలి. గృహ అవసరాలకు.. ఆరు నుంచి పది గంటలు వరకు కోతలు పెంచాలని సూచించారు. ఇలా చేస్తే.. వ్యవసాయానికి రెండు విడతలుగా నాలుగు గంటల పాటు విద్యుత్ ఇవ్వగలమని విద్యుత్ శాఖాధికారులు తేల్చి చెప్పారు. అదనంగా.. ఆర్ధిక శాఖ రోజుకు 12 కోట్లు చొప్పన 100 రోజుల సరఫరా కోసం 1200 కోట్లు కేటాయించాలని కోరారు. ఇందులో భాగంగానే.. తొలి విడతగా 600 కోట్లు కేటాయించింది సర్కార్‌.రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ కొరతను ఎలా ఎదుర్కోవాలో తెలియక.. ప్రభుత్వం సతమతమవుతోంది. దీంతో.. రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి వరుణుడో.. దేవుడో కరుణిస్తేనే సాధ్యంగా కనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి