16, అక్టోబర్ 2012, మంగళవారం

బర్త్‌డేకు వచ్చి బలైంది



హేమాశ్రీ మృతి కేసులో కొత్త మలుపులు!

10/16/2012 1:21:00 AM

మాజీ కార్పొరేటర్ కుమార్తె బర్త్‌డే వేడుకలకు అనంతకు వచ్చిన హేమాశ్రీ
వేడుకలయ్యాక ఫామ్‌హౌస్‌కు.. అమాత్యుడి కోరిక తీర్చేందుకు తిరస్కరణ
క్లోరోఫామ్ ప్రయోగంతో మృతి

బెంగళూరు, న్యూస్‌లైన్: కన్నడ నటి హేమాశ్రీ మృతి కేసులో రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త విషయాలు బహిర్గతమవుతున్నాయి. కేసును నీరుగార్చేందుకుగాను అనంతపురం జిల్లాకు మార్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దర్యాప్తు చేస్త్తున్న పోలీసు వర్గాల సమాచారం మేరకు.. అనంతపురంలోని మూడో డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ జేఎల్ మురళీధర్(మురళి) కుమార్తె పుట్టిన రోజు అక్టోబర్ 8. ఈ వేడుకలకు నటి హేమాశ్రీని రప్పించి ఓ మంత్రి కోరిక తీర్చి.. ఓ కీలకమైన పని చేయించుకోవాలని మురళి, అతడి సమీప బంధువైన మరో మాజీ కార్పొరేటర్ ఎత్తు వేశారు. హేమాశ్రీ భర్త సురేంద్రబాబుతో తమకున్న పాత పరిచయాలతో ఆమెను బర్త్‌డే వేడుకకు ఆహ్వానించారు. దీంతో దంపతులిద్దరూ ఎనిమిదో తేదీ సాయంత్రం అనంతపురంలోని మురళీధర్ ఇంటికి చేరుకున్నారు.

అర్ధరాత్రి వేడుకలు ముగిశాక వారికి రెడ్డిపల్లి ఫామ్‌హౌస్‌లో బస ఏర్పాటు చేసినట్లు చెప్పి అక్కడికి పంపారు. సురేంద్రబాబుతో ముందే రచించుకున్న ప్రణాళిక మేరకు మంత్రి కోరిక తీర్చేందుకు వెళ్లాలని హేమాశ్రీని కోరారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో... ఆమెపై క్లోరోఫామ్ ప్రయోగించగా.. మోతాదు ఎక్కువై ఆమె మరణించింది. మృతదేహాన్ని సురేంద్రబాబు, మురళి కలిసి బెంగళూరుకు తీసుకెళ్లారు. ముందుగా బాప్టిస్ట్ ఆస్పత్రికి తీసుకెళ్లి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత హెబ్బాళ పోలీస్‌స్టేషన్‌లో మురళి ఫిర్యాదు చేశారు. తొమ్మిదో తేదీ ఉదయం 4.30 గంటలకు సురేంద్రబాబు రెడ్డిపల్లి ఫామ్‌హౌస్‌కు హేమాశ్రీని తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు కూలీలు తనకు ఫోన్ చేసినట్లు రాతపూర్వకంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా చేస్తే అందరూ సురక్షితంగా బయటపడతారని భావించారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కుమార్తె బర్త్‌డే వేడుకల్లో హేమాశ్రీ పాల్గొన్న సమయంలో మురళి కూడా ఉన్నారు.

విచారణకు వచ్చిన పోలీసులకు పలువురు ఇదే అంశాన్ని చెప్పడంతో మురళిని నిందితుడిగా చేర్చి ఆదివారం విచారించారు. హేమాశ్రీ మృతదేహానికి అక్టోబర్ 10న పోస్టుమార్టం కాగానే బెంగళూరులోని సుమనహళ్లి విద్యుత్ శ్మశాన వాటికలో దహనం చేయడంపై కూడా వారు ఆరా తీస్తున్నారు. అయితే హేమాశ్రీ రెడ్డిపల్లిలో మృతిచెందినందువల్ల కేసు విచారణ అక్కడికే మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ జ్యోతిప్రకాష్ మిర్జీ సర్కారుకు లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై బెంగళూరు నగర అడిషనల్ కమిషనర్ (శాంతి, భద్రతలు) సునీల్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. అనంతపురం జిల్లాకు కేసు మార్చే ప్రతిపాదనేదీ తాము చేయలేదని తెలిపారు.
సురేంద్రబాబుపై 25 కేసులు: బెంగళూరులోని కగ్గదాసపురానికి చెందిన హేమాశ్రీ భర్త సురేంద్రబాబు వృత్తిరీత్యా లాయర్ అయినా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడగా బెంగళూరులో 25 కేసులు నమోదైనట్లు తెలిసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి