18, అక్టోబర్ 2012, గురువారం

గడ్కరి పెద్ద టక్కరి


  • దస్త్రం విప్పిన కేజ్రివాల్‌
  • అజిత్‌ పవార్‌తో కుమ్మక్కు
  • పేద రైతుల నుండి భూమి, నీరు లాక్కున్నారు
  • చేతులు కలిపిన కాంగ్రెస్‌, బిజెపి
  • తోసిపుచ్చిన కమలనాథులు
''మహారాష్ట్రలో గడ్కరి భూ బకాసురుని తలపించారు. రైతుల భూమినే కాదు నీటినీ కబళించారు. ఆయనకు రైతుల కన్నా కాంట్రాక్టర్లంటేనే మక్కువ ఎక్కువ. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి అజిత్‌ పవార్‌తో కుమ్మక్కై గడ్కరీ భారీగానే లబ్ధి పొందారు. రాజకీయ పదవిని ఆయన సొంత వ్యాపార ప్రయోజనాలకు వాడుకున్నారు''
- కేజ్రీవాల్‌
కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా క్విడ్‌ప్రోకో భాగోతం, న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టి సంచలనం సృష్టించిన ఇండియా ఎగెనెస్ట్‌ కరప్షన్‌ (ఐఎసి) కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరి అవినీతిపై గురిపెట్టారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌-ఎన్‌సిపి ప్రభుత్వంతో కుమ్మక్కయి చట్టాలు, నియమ నిబంధనలను గడ్కరీ ఎలా తనకు అనుకూలంగా మలచుకున్నదీ కేజ్రీవాల్‌ బుధవారం మీడియా ఎదుట బయటపెట్టారు. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సభ్యులు అంజలి దమనియా సేకరించినట్లు ఆయన వివరించారు. రైతుల భూములను కాజేయడంలో కాంగ్రెస్‌, బిజెపి ఒకదానితో ఒకటి చేతులు కలిపాయని కేజ్రీవాల్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. సల్మాన్‌ ఖుర్షీద్‌ అవినీతి విషయంపై అవి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తర్వాత గడ్కరీ అవినీతిని కూడా తాము బయటపెట్టబోతున్నామని బిజెపికి తెలుసు గనుకే ఖుర్షీద్‌ విషయంలో మౌనం వహించిందన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం గడ్కరీకి 100 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించిందని కేజ్రీవాల్‌ విమర్శించారు. మహారాష్ట్ర రైతులను దోచుకోవడానికి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నేత అజిత్‌ పవార్‌తో గడ్కరి కుమ్మక్కయ్యారని విమర్శించారు. మహారాష్ట్రలో గడ్కరి భూమి, నీటి ప్రాజెక్టుల కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. నాగ్‌పూర్‌ జిల్లా ఉమ్రెద్‌ తాలూకాలో ఒక డ్యామ్‌ నిర్మాణం కోసం రైతుల నుంచి భూమిని సేకరించారని, ప్రాజెక్టుకు అవసరమైన భూమిని వాడుకుని మిగతాది రైతులకు తిరిగి ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల విజ్ఞాపనలను, నిబంధనలను తోసిరాజని గడ్కరీకి, అతని కంపెనీలకు కోట్ల రూపాయల విలువైన భూములు, నీటి వనరులను ధారాదత్తం చేసింది. అప్పటి సాగునీటి శాఖ మంత్రి అజిత్‌ పవార్‌ జోక్యం చేసుకుని గడ్కరీకి లబ్ధి చేకూరేలా చూశారు. రైతుల భూమిని, నీటిని గడ్కరీ బలవంతంగా లాగేసుకున్నారు. గడ్కరీకి రైతుల పట్ల కాకుండా కాంట్రాక్టర్ల పట్ల అపారమైన ప్రేమను కనబరిచారని ఆయన విమర్శించారు. గడ్కరి రాజకీయ నాయకుడిగా కాకుండా ఫక్తు వ్యాపారిలా వ్యవహరించి రైతుల భూములను, నీటిని కబళించారని కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. కరువుతో అల్లాడుతున్న విదర్భ రైతులకు అందాల్సిన సాగునీటిని గడ్కరి తన చక్కెర ఫ్యాక్టరీలకు, విద్యుత్‌ ప్లాంట్లకు వాడుకున్నారని కేజ్రివాల్‌ ఆరోపించారు.
గడ్కరి, ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ కుమ్మక్కయ్యారని ఐఎసి సభ్యురాలు దమానియా ఆరోపించినప్పుడే దీనిపై బిజెపిలో కలకలం రేగింది. నీటి పారుదల కుంభకోణంపై మాట్లాడ డానికి గడ్కరిని కలిసినప్పుడు తనకు సమాచారం ఏమీ ఇవ్వలేమన్నారని, ఎందుకంటే పవార్‌తో కలిసి పరస్పరం ప్రయోజనం పొందామని తనతో చెప్పినట్లు దమనియా వెల్లడించినప్పుడు బిజెపి నేత రుసరుసలాడారు. 'మహా' ఇరిగేషన్‌ కుంభకోణంపై ఇప్పటికే జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. గడ్కరి సన్నిహితుడు,
బిజెపి పార్లమెంటు సభ్యులు అజరు సంచెటి నిబంధనలు అతిక్రమించి విదర్భ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ఏ విధంగా ప్రయోజనం పొందారో సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ ఛానల్‌ సంబంధిత పత్రాలను సేకరించింది.
ఈ నిబంధనల ప్రకారం ఒకే కంపెనీ వరుసగా మూడుసార్లకు మించి కాంట్రాక్టును పొందకూడదు. అయితే గడ్కరికి చెందిన కంపెనీల విషయంలో మాత్రం ఈ నిబంధనను తుంగలో తొక్కారు. అప్పట్లో ఎస్‌ఎంఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ఉన్న శక్తికుమార్‌ ఎం సంచెటి లిమిటెడ్‌... సంచెటి గ్రూప్‌ పేరుతో ఎఫ్‌ఐఆర్‌లను పొందింది. ఇది జాయింట్‌ వెంచర్‌లో కూడా ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అజిత్‌ పవార్‌ వివాదాస్పదరీతిలో పునరుద్ధరించిన లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టులో మూడింట ఒక వంతు కాంట్రాక్టులను అజరు సంచెటికి దక్కాయి. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టు కోసం నిధులు విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ గడ్కరీ అప్పటి కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌కు లేఖ రాశారు.
గడ్కరి ఖండన
తనపై వచ్చిన ఆరోపణలను గడ్కరి తోసిపుచ్చారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. ఈ ఆరోపణలను రుజువుచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. 'బలవంతంగా సేకరించినట్లు' చెప్పబడుతున్న భూమిని 15 ఏళ్ల లీజుకు మహారాష్ట్ర ప్రభుత్వం తనకు లీజుకు ఇచ్చిందన్నారు. ఈ భూమిలో రైతుల కోసం తాను చెరకు సాగు చేస్తున్నట్లు తెలిపారు. తనకు చెరకు సొసైటీ ఉందని, దానిలో 15 వేల మంది చెరకు రైతులు ఉన్నారని గడ్కరీ చెప్పారు. ఈ సొసైటీకి మొత్తం పది కోట్ల ఆస్తులున్నాయని, అందులో తనకు కేవలం లక్ష మాత్రమే షేర్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడుందని ప్రశ్నించారు. గడ్కరి విసిరిన సవాల్‌ను కేజ్రీవాల్‌ స్వీకరిస్తూ దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.
ముఖ్యాంశాలు
* వ్యక్తిగత ప్రయోజనాల కోసం గడ్కరీ కాంగ్రెస్‌-ఎన్‌సిపి ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు.ఈ క్విడ్‌ప్రోకో వల్లే ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అవినీతిపై ఆయన నోరు మెదపకుండా మౌనం వహించారు.
* సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు రూ.400 కోట్లను విడుదల చేయాలని కోరతూ కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌కు గడ్కరి లేఖ రాశారు.
* నిర్మాణం, చక్కెర, డిస్టిల్లరీ, విద్యుత్‌, బొగ్గు, వ్యవసాయంతో సహా 15కు పైగా రంగాల్లో అతి స్వల్ప కాలంలోనే గడ్కరి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.
* సేద్యం కోసం వినియోగించాల్సిన నీటిని అజిత్‌ పవార్‌ భారీ మొత్తంలో విద్యుత్‌ పరిశ్రమలకు మళ్లించారు. దేశంలో పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రాంతంలో ఇలా వ్యవహరించడం ఎంత అమానుషం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి