1, అక్టోబర్ 2012, సోమవారం

ఏమి పాలనిది.. ఎమర్జెన్సీ నీడలివి.. ఓయూలో అదే అణచివేత



poruguku-pedutuna-students 
 -లాఠీచార్జి.. టియర్ గ్యాస్.. రబ్బర్ బుల్లెట్లు..
-ప్రయోగించినవి 300లకు పైగానే!
-నిరాయుధ విద్యార్థులపై సర్కారు అతి
-సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
-యూనివర్సిటీ ఆవరణలోకి ప్రవేశం..
-జామై ఉస్మానియా స్కూలు నుంచి కాల్పులు
-నేడు తెలంగాణ బంద్: విద్యార్థి సంఘాల పిలుపు

తార్నాక, హబ్సిగూడ, సెప్టెంబర్ 30 (టీ మీడియా):తెలంగాణ కోసం సాగుతున్న పోరులో సాహసులై పోరాడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిర్బంధం శిబిరంలోంచే తమ ధిక్కారాన్ని వినిపిస్తున్నారు. ప్రజాస్వామిక ఆకాంక్షను శాంతియుతంగా వ్యక్తపరచేందుకు సైతం అవకాశమివ్వకుండా ప్రభుత్వం ప్రయోగిస్తున్న అణచివేతను సాధ్యమైనరీతిలో ప్రతిఘటిస్తున్నారు. ఉస్మానియా క్యాంపస్‌లో సమరం కొనసాగుతూనే ఉంది. గురువారం నుంచి తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటున్న విద్యార్థులు ఆదివారం శాంతియుతంగా ప్రదర్శన జరపాలనుకోగా పోలీసులు అడ్డుకున్నారు. గంటలపాటు విద్యార్థులు, పోలీసుల మధ్య ఉత్కం వాతావరణం కొనసాగింది. విద్యార్థుల విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విచక్షణారహితంగా వందల సంఖ్యలో బాష్పవాయు గోళాలను, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. అనుమతించాలంటూ విద్యార్థులు మోకాళ్లపై పాకుతూ విన్నవించినా, కనికరించాలని వికలాంగులు ప్రాధేయపడినా ఖాకీల కరకు వైఖరి మారలేదు.

మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ నిర్బంధ శిబిరంగా మారిపోయింది. అన్ని వైపులా రాకపోకలు బంద్ చేశారు. అయినా.. ఇనుప కంచెలను ఆంక్షల సంకెళ్లను దాటి విద్యార్థులు ఉక్కు సంకల్పంతో ఉద్యమిస్తున్నారు. రాత్రి పొద్దుపోయినా వారి నిరసనలు ఆగలేదు. ఆదివారం ఉదయం 11 గంటలకు పలు విద్యార్థి సంఘాలు తెలంగాణ మార్చ్ కోసం ప్రశాంతంగా బయలుదేరగా ఎస్‌సీసీ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. క్యాంపస్‌లోకి చొచ్చుకుపోయారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి వెళ్లకుండా అడ్డుకుంటారా.. పైగా నిరాయుధులపై కాల్పులు జరుపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు గుంపులు గుంపులుగా క్యాంపస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు సుమారు 300రౌండ్లకు పైగా కాల్పులు (బాష్పవాయువు) జరిపారు. పోలీసుల దాడిలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.

వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఎన్‌సీసీ వద్ద, లేడీస్ హాస్టల్ వెనుకవైపు ఉన్న గేట్ వద్ద కూడా కాల్పులు జరిపి భయవూభాంతులకు గురి చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసిన పోలీసులు ఎన్‌సీసీ గేట్ దాటి క్యాంపస్‌లోకి ప్రవేశించి బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ప్రాంగణంలో ఉన్న జామై ఉస్మానియా పాఠశాల ఆవరణలోకి వెళ్లి అక్కడున్న ఓయూ విద్యార్థులపై కాల్పులు జరిపారు. కాల్పులకు వెరవకుండా విద్యార్థులు ప్రతిఘటిస్తూనే పోలీసు బలగాలపై రాళ్ళురువ్వారు. పోలీసులు రెండుసార్లు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. రాత్రి ఏడున్నర సమయంలో కాల్పుల సీన్ ఎన్‌సీసీ గేట్ నుంచి తార్నాక వైపు మారింది. పలుమారు బాష్పవాయు గోళాల ప్రయోగం కొనసాగింది. రాత్రంతా రగులుతూనే ఉంది. తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా విద్యార్థుపూవరూ పాల్గొనకుండా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ పోలీస్ బలగాలను పెట్టారు. పారామిలిటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీస్, మఫ్టీ పోలీస్.. ఇలా అనేక రకాల పోలీస్ బలగాలను క్యాంపస్ ప్రధాన రహదారులతోపాటు చిన్న మార్గాల్లోనూ మోహరింపజేశారు.

TANKBUND ఆర్ట్స్ కాలేజ్ నుంచి ‘మార్చ్’
తెలంగాణ మార్చ్ నిర్వహించేందుకు వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీతో ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేట్ వద్దకు వెళ్ళారు. తొలుత టీఎస్ జాక్ (ఎం భాస్కర్), ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలో టీజీవీపీ, టీఎస్ జాక్ (పిడమర్తి), టీఎస్ జాక్ (జీ కిశోర్), టీవీవీ, టీఆర్‌ఎస్‌వీ సంఘాలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేసుకున్నాయి. ఎన్‌సీసీ గేట్ వద్దకు చేరుకోగానే పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఓయూ విద్యార్థులు ర్యాలీగాగానీ, గుంపులుగాగానీ వెళ్ళడానికి అనుమతిలేదంటూ పోలీసు అధికారులు నిరోధించారు. దీంతో ఆగ్రహంచెందిన విద్యార్థులు ఎన్‌సీసీ గేట్ వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను పడగొట్టి.. ఇనుప ముళ్ళ కంచెను దాటి వెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసు బలగాలు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడమే కాకుండా బాష్పవాయు గోళాలను, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించాయి.

వాటి తీవ్రతకు విద్యార్థులు చెల్లాచెదురయ్యారు. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ నగర జనరల్ సెక్రటరీ మొండికత్తి సతీష్, వరంగల్ నుంచి వచ్చిన డెమాక్షికటిక్ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి కృష్ణలతోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రమైన పోలీసు నిర్బంధం కొనసాగినప్పటికీ భారీ సంఖ్యలోనే విద్యార్థులు మార్చ్‌లో పాల్గొన్నారు. పోలీసుల కన్నుగప్పి క్యాంపస్‌లోని వివిధ మార్గాల గుండా అన్ని జాక్‌లు, అన్ని విద్యార్థిసంఘాలకు చెందిన వేలాదిమంది తరలిపోయారు. ఉదయం నుంచే విద్యార్థులు క్యాంపస్ నుంచి గుంపులు గుంపులుగా సాగర్‌వైపు కదిలారు. టీఎస్ జాక్ చైర్మన్ గాదరి కిషోర్, టీఎస్ జాక్ చైర్మన్ పిడమర్తి రవి, టీఎస్ జాక్ మాందాల భాస్కర్ నేతృత్వంలోనూ విడిగానూ తరలి టీఎస్ జాక్ చైర్మన్ పిడమర్తి రవి, అధ్యక్షుడు రాజారాంయాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఒక ర్యాలీని, టీఎస్ జాక్ చైర్మన్ గాదరి కిషోర్, అధ్యక్షులు పున్న కైలాస్‌నేత, ప్రధాన కార్యదర్శి కరాటే రాజు, ఉపాధ్యక్షులు వల్లమల కృష్ణ, తుంగబాలు ఆధ్వర్యంలో ఒక ర్యాలీని, టీఎస్ జాక్ అధ్యక్షులు మందాల భాస్కర్, దుర్గం భాస్కర్, బాలలక్ష్మి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ, టీజీవీపీ రాష్ట్ర అధ్యక్షులు బట్టు శ్రీహరినాయక్, ప్రధాన కార్యదర్శి నిజ్జెన రమేశ్ ముదిరాజ్, అధికార ప్రతినిధి దామెర రాజేందర్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ, టీఆర్‌ఎస్‌వీ సెక్రటరీ జనరల్ గాదరి కిషోర్, నాయకులు తుంగబాలు, పల్లా ప్రవీణ్‌డ్డి, శోభన్‌బాబు, తెలంగాణ క్రాంతి దళ్ నాయకులు తూము నవీన్ యాదవ్, జాన్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ, టీవీవీ నాయకులు మెంచు రమేశ్, విజయ్, జగన్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించారు. అలాగే తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ ఎల్ నెహ్రూనాయక్, ప్రధాన కార్యదర్శి జీ శంకర్‌నాయక్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు స్టాలిన్, జోగు లింగస్వామి, కాంపెల్లి శ్రీనివాస్, పీడీఎస్‌యూ నాయకులు ఆజాద్, అరుణ్, నాగేశ్వర్‌రావు, రంజిత్, బీఎస్‌ఎఫ్ నాయకులు బండారు వీరబాబు, గాదె వెంకట్, వేల్పుకొండ వెంక నలిగంటి శరత్, కందుల మధు, విక్రమ్, దరువు ఎల్లన్న, తెలంగాణ తీన్‌మార్ కన్వీనర్ వరంగల్ రవి, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు కే తిరుపతి, మంద మోహన్, టీఎస్ జాక్ నాయకులు దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్, కోట శ్రీనివాస్‌గౌడ్, దావుల వీరవూపసాద్ యాదవ్, బత్తుల రవి, కరన్‌జైరాజ్, మన్నె క్రిషాంక్, అంబేద్కర్, బిసగోని శ్రీనివాస్‌గౌడ్, ఓయూ జాక్ చైర్మన్ తొట్లస్వామి యాదవ్, అధ్యక్షుడు మర్రిఅనిల్, నాయకులు కోటూరి మానవతారాయ్, చరణ్‌కౌశిక్‌యాదవ్, విజయ్, సాంబశివగౌడ్, ఆశప్ప, గడ్డం శ్రీరామ్, కొత్తపల్లి తిరుపతి, శ్రీధర్, డీఎస్‌యూ నాయకులు కంచెర్ల బద్రి, ఏపీ బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి జాజుల లింగంగౌడ్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం చైర్మన్ రవికుమార్‌గౌడ్, అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్, ఓయూ బీసీ జాక్ చైర్మన్ బొమ్మ హనుమంతరావు నేత, అధ్యక్షుడు పుప్పాల మల్లేష్, టీఆర్‌ఎస్‌వీ నాయకులు అవినాష్, సతీష్, తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు మద్దెల సంతోష్, నాయకులు వడ్డెఎల్లన్న, బైరగోని శ్రీనివాస్‌గౌడ్, ధరావత్ మోహన్‌నాయక్, టీజీవీపీ నాయకులు లక్‌పతినాయక్, ఓయూ అధ్యక్షుడు కల్వకుర్తి అంజనేయులు తదితరులు ర్యాలీల్లో పాల్గొన్నారు.

నేడు తెలంగాణ బంద్‌కు పిలుపు
శాంతియుత పద్ధతుల్లో మార్చ్‌కు వెళుతున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అడ్డుకుని కాల్పులు జరపడం, మరోవైపు నెక్లెస్‌రోడ్డుకు వెళుతున్న తెలంగాణవాదులపై విచక్షణరహితంగా లాఠీచార్జి చేయడాన్ని, కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ విద్యార్థి నేతలు సోమవారం తెలంగాణబంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని టీఎస్ జాక్ చైర్మన్ గాదరి కిషోర్, అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, ప్రధాన కార్యదర్శి కరాటే రాజు, ఉపాధ్యక్షులు వల్లమల కృష్ణ, తుంగబాలు, పల్లా ప్రవీణ్‌డ్డి ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని, లేకుంటే వారిపై, సీమాంధ్ర ఆస్తులపై దాడులు చేస్తామని వారు హెచ్చరించారు.

ఓయూ ఠాణా ముందు రాత్రి మరోసారి కాల్పులు
తెలంగాణ మార్చ్ సందర్భంగా పోలీసుల అణచివేత, అక్రమ అరెస్టులను ఉస్మానియా విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా ఆందోళనలు కొనసాగాయి. విద్యార్థులు రాత్రి ఏడు గంటలకు ఓయూ పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు ప్రయత్నించగా పోలీసు బలగాలు మరోసారి బాష్పవాయు గోళాలను, రబ్బరు బులెట్లను ప్రయోగించాయి. ప్రతిగా విద్యార్థులు రాళ్లు రువ్వడంతో రాత్రి 8 గంటల వరకు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. తెలంగాణ మార్చ్‌లో పాల్గొనేందుకు సిద్ధాంత విభేదాలు లేకుండా లెఫ్ట్, రైట్, దళిత్, అన్ని వర్గాల విద్యార్థులు ఒక్కటిగా ఓయూలో ర్యాలీలు నిర్వహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి