26, అక్టోబర్ 2012, శుక్రవారం

‘జాతి పిత’ బిరుదును రాజ్యాంగం అనుమతించదు


న్యూఢిల్లీ, అక్టోబర్ 25: విద్యా రంగం, సైనిక రంగానికి సంబంధించి ఎలాంటి టైటిళ్లను అనుమతించనందున మహాత్మాగాంధీకి ‘్ఫదర్ ఆఫ్ ది నేషన్’ (జాతి పిత) టైటిల్‌ను ఇవ్వలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లక్నోకు చెందిన విద్యార్థిని ఐశ్వర్య పరాశర్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేసింది. విద్యా, సైనిక పరమైన బిరుదులను తప్ప మరే బిరుదులను రాజ్యాంగంలోని 18(1) అధికరణం అనుమతించదు కనుక మహాత్మాగాంధీకి జాతిపిత బిరుదును ఇవ్వాలంటూ ఆమె రాష్టప్రతికి రాసిన లేఖపై ఎలాంటి చర్యా తీసుకోలేదని హోం శాఖ తెలియజేసింది. గాంధీజికి సంబంధించి ఆయనను జాతి పితగా సంబోధించడానికి గల కారణాలకు సంబంధించి ఐశ్వర్య సమాచార హక్కు చట్టం కింద పలు పిటిషన్లు దాఖలు చేసింది. వాటిపై స్పందించిన హోం శాఖ గాంధీజికి అలాంటి టైటిల్ ఏదీ ఇవ్వలేదని తెలియజేసింది. మహాత్మాగాంధీని జాతి పితగా ప్రకటించాలని కోరుతూ ఆరో తరగతి విద్యార్థిని అయిన ఐశ్వర్య అప్పటి రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌కు, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖలు రాసింది. తన లేఖలపై రాష్టప్రతి, ప్రధానమంత్రి తీసుకున్న చర్యల వివరాలు తెలియజేయాలని కోరుతూ ఆమె సమాచార హక్కు చట్టం కింద ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆమె పిటిషన్‌పై తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశిస్తూ ఆ పిటిషన్‌ను హోం శాఖకు బదిలీ చేయడం జరిగింది. దీనిపై స్పందిస్తూ హోం శాఖ ఈ వివరాలు తెలియజేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి