16, అక్టోబర్ 2012, మంగళవారం

బాబ్లీపై రాజీవద్దు


  • పరిహారమిచ్చి కూల్చేద్దాం
  • అఖిలపక్ష మద్దతు కూడగట్టుకున్న ప్రభుత్వం
  • సిపిఎంను ఆహ్వానించని సర్కార్‌
బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోవడమే లక్ష్యంగా సుప్రీం కోర్టులో వాదనలు గట్టిగా వినిపించాలని అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది. అవసరమైతే మహారాష్ట్ర ప్రభుత్వానికి నష్టపరిహారం చెల్లించేందుకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలంది. శ్రీరాంసాగర్‌ జలాశయం ఆయకట్టును కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే అన్ని పార్టీలు ముందుకు సాగాలని సూచించింది. మంగళవారం సుప్రీం కోర్టులో బాబ్లీ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం తుది వాదనలు వినిపించనున్న ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌ రెడ్డి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ అనిల్‌ కుమార్‌, తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, టిఆర్‌ఎస్‌ నుంచి బి వినోద్‌కుమార్‌, విద్యాసాగర్‌రావు, సిపిఐ నుంచి చాడా వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టును కూల్చివేయాలన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 90 టిఎంసిల నుంచి తాగు నీటి అవసరాల కోసం 1.09 టిఎంసిల నీటిని వాడుకుంటామని హామీ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం 2.74 టిఎంంసిల సామర్థ్యంతో బాబ్లీని నిర్మించారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లోని ఎస్‌ఆర్‌ఎస్‌పి ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. నదీ జలాల అంతర్రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధంగా గోదావరిపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిలువ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మించిందన్నారు. తాగు నీటి అవసరాల కోసం 1.09 టిఎంసీల నీరు వాడుకుంటే అభ్యంతరం లేదన్నారు. మహారాష్ట్ర భూ భాగంలో నీటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఉమ్మడి యాజమాన్య నీటి నియంత్రణ అధికార మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అఖిలపక్ష అభిప్రాయాలను సీనియర్‌ న్యాయవాది పరాశరన్‌కు తెలియజేస్తామన్నారు. బాబ్లీ విషయంలో మన వాదనలే గెలుస్తాయన్న నమ్మకం ఉందన్నారు. పులిచింతల, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్‌ కల్లా పూర్తి చేస్తామన్నారు.
మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టుపై అన్ని పార్టీలది ఒకే మాటగా ఉండాలన్నారు. బాబ్లీ సహా ఇతర 11 ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలకు సాగు నీరు అందని దుస్థితి నెలకకొందన్నారు. ముఖ్యంగా శ్రీరాంసాగర్‌ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. బాబ్లీ సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల జరిగే నష్టాన్ని కేంద్రం ప్రభుత్వానికి వివరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మించిందని విమర్శించారు. జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ఉపయోగమేంటని ప్రశ్నించారు. మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక్క బాబ్లీ ప్రాజెక్టే కాకుండా శ్రీరాంసాగర్‌ ఆయకట్టు కింద మరో 11 ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.
టిఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణకు దిక్కని, ఇప్పుడు దాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వానికి దాసోహం చేసిందని విమర్శించారు. సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర భూభాగంలో నీటి దర్వినియెగాన్ని అరికట్టేందుకు నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
సిపిఎంను ఆహ్వానించని సర్కార్‌
బాబ్లీ వివాదంపై అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకునేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి సిపిఎంను రాష్ట్ర ప్రభుత్వం అహ్వానించలేదు. తుతూమంత్రంగా టిడిపి, టిఆర్‌ఎస్‌, సిపిఐ పార్టీలను ఆహ్వానించి సమావేశాన్ని రసాభాసగా ముగించారు. ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌సిపి, లోక్‌సత్తా పార్టీలను ఆహ్వానిచకపోవడంతో ఆ పార్టీ ప్రతినిధులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆ మూడే రాజకీయ పార్టీలా అని ప్రశ్నించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి