13, అక్టోబర్ 2012, శనివారం

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ

నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నదంటూ ఊదరగొట్టడం భారత దేశ కార్పొరేట్ పత్రికలకు కొంతకాలంగా రివాజుగా మారింది. ‘వైబ్రంట్ గుజరాత్’ గా నరేంద్రమోడీ చేసుకుంటున్న ప్రచారానికి పత్రికలు యధాశక్తి అండదండలు ఇస్తున్నాయి. బ.జె.పి నాయకులు, కార్యకర్తలు ఈ ఊకదంపుడు కధనాలను చెప్పుకుని ఉబ్బితబ్బిబ్బు అవుతుంటే, కాంగ్రెస్ నాయకులేమో వాటిని ఖండించి వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల వాదనలన్నీ జి.డి.పి వృద్ధి రేటు, తలసరి ఆదాయం, పారిశ్రామిక వృద్ధి… వీటి చుట్టూనే తిరుగుతున్నాయి తప్ప గుజరాత్ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం గురించి మాట్లాడడం లేదు. అక్కడి ప్రజల ఆకలి, దారిద్ర్యాల గురీంచి గానీ, పోషకాహార లోపం గురించి గానీ, సహజవనరుల దోపిడి గురించి గానీ బి.జె.పి చెప్పలేదు, కాంగ్రెస్ కూడా ప్రశ్నించలేదు. గుజరాత్ అభివృద్ధి కధను పరిశీలించడం ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం.
ఆగస్టు 29, 2012 తేదీన అమెరికా పత్రిక ‘ద వాల్ స్ట్రీట్ జర్నల్‘ కు నరేంద్ర మోడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. గుజరాత్ లో పోషకార లోపం స్ధిరంగా, చాలా ఎక్కువగా ఉంటోంది. దానిని తగ్గించడానికి మీరేం చేయదలిచారని అడిగినప్పుడు నరేంద్ర మోడి చెప్పిన సమాధానం ఇది:
WSJ: Gujarat’s malnutrition rates are persistently high. What are you doing to combat this?
Modi: Gujarat is by and large a vegetarian state. And secondly, Gujarat is also a middle-class state. The middle-class is more beauty conscious than health conscious – that is a challenge. If a mother tells her daughter to have milk, they’ll have a fight. She’ll tell her mother, “I won’t drink milk. I’ll get fat.” We will try to get a drastic change in this. Gujarat is going to come up as a model in this also. I can’t make any big claims, because I don’t have a survey in front of me yet.
పై సమాధానంలో ‘వైబ్రంట్ గుజరాత్’ ప్రజల్లో పోషకాహార లోపానికి ముఖ్యమంత్రి రెండు కారణాలు చెప్పాడు. ఒకటి: గుజరాత్ ప్రజల్లో ఎక్కువమంది శాకాహారులు కావడం. రెండు: గుజరాత్ లో ఎక్కువగా ఉన్న మధ్య తరగతి జనం అందంగా కనిపించాలన్న కోరికతో పాలు లాంటి సమతులిత ఆహారాన్ని తీసుకోకపోవడం. ఒక దేశాన్ని గానీ, ఒక రాష్ట్రాన్ని గానీ, కనీసం ఒక ప్రాంతాన్ని గానీ పాలిస్తున్న వ్యక్తి ఎవరూ ప్రజల పోషకాహార లోపానికి ఇలాంటి అసంబద్ధ, అశాస్త్రీయ, తుంటరి కారణాలు చెప్పగలరని ఊహించడం దాదాపు అసాధ్యమే.
కానీ మన ‘వైబ్రంట్ గుజరాత్’ పాలకునికి అది సాధ్యపడింది. నరేంద్ర మోడి చెప్పిన కారణమే నిజమైతే శాకాహారులంతా పోషకాహార లోపం సమస్యను ఎదుర్కోవాలి. శాకాహారం మానేసి ఇకనుండి మాంసాహారం తీసుకోవాలని శాకాహారులందరికీ మోడీ సలహా ఇచ్చి ఉండాలి. మోడి అందుకు పూనుకుంటాడో లేదో గానీ వాస్తవం అయితే అది కాదు. శాకాహారం వల్ల శరీరానికి రావలసిన పోషక విలువలు అందవని ఏ శాస్త్రమూ చెప్పలేదు. పైగా మాంసాహారం వల్ల ఆ జబ్బూ, ఈ జబ్బూ వస్తుంది గనక అది మానేసి శాకాహారంలోకి దిగాలని చెప్పే పండిత పుత్రులకు, ఆశాస్త్రీయ బోధనలకు ఈ దేశంలో కొదవలేదు.
శాకాహారం అంటూ సొల్లిన మోడి అక్కడితో ఆగకుండా తన రాష్ట్రంలోని అమ్మాయిలను అపహాస్యం చేయడానికి కూడా పూనుకున్నాడు. తల్లులు తమ కూతుళ్లకు పాలు తాగమని చెబుతుంటే వారి కూతుళ్ళు మాత్రం అందుకు ఒప్పుకోకుండా ‘పాలు తాగితే ఒళ్ళు వస్తుంది’ అని చెప్పి పోట్లాటకి దిగుతున్నారట. కానీ గత సంవత్సరం అక్టోబర్ లో విడుదల చేసిన కేంద్ర మానవాభివృద్ధి నివేదిక (India Human Developement Report 2011) ప్రకారం గుజరాత్ లోని 5 సం.ల లోపు పిల్లల్లో 44.6 శాతం మంది పోషకాహారం లోపంతో బాధపడుతుంటే, 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ స్వయంగా ప్రస్తావించిన 2005-06 నాటి భారత కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూసినా గుజరాత్ లో 52 శాతం (అయిదేళ్లలోపు) పిల్లలు తమ వయసుకంటే చాలా తక్కువ సైజులో (stunted) ఉన్నారు. అంటే పెరుగుదల లేక గిడసబారి పోయి ఉన్నారు. 5-6 మధ్య వయసు పిల్లల్లో 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతుంటే, స్త్రీలలో కూడా 55 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. భారత దేశ పిల్లల్లో పోషకాహార లోపానికి ముఖ్య కారణాలు దరిద్రం, తల్లిపాలు ఇవ్వడంలో లోపాలు, ఆరోగ్య సౌకర్యాల లేమి, అవినీతితో నిండిన ఆహార పంపిణీ కార్యక్రమాలు అని ప్రభుత్వ నివేదికలు ఎప్పుడూ చెప్పే మాటే. అసలు కారణాలు వదిలేసి శాకాహారం, అందం స్పృహ అంటూ సమస్యలను కప్పి పుచ్చడానికే మోడి ప్రయత్నించాడు. అసలు అయిదేళ్ల లోపు పిల్లలకి అందం గురించిన స్పృహ ఉంటుందని ఏ సన్నాసి చెప్పాడో మోడి చెబితే బాగుండేది.
నిజానికి జి.డి.పి వృద్ధి కీ ప్రజల సౌభాగ్యానికి అసలు సంబంధం ఉండదని అందరూ అంగీకరిస్తారు. ఒక రాష్ట్రానికి లేదా దేశానికి చెందిన జి.డి.పిలో ప్రజలు ఎంత సుఖంగా బతుకుతున్నదీ సమాచారం ఉండదు. రాష్ట్రం వరకు తీసుకుంటే ఆ రాష్ట్ర ప్రాదేశిక సరిహద్దులలోపల జరిగే సకల ఉత్పత్తుల మొత్తమే ఆ రాష్ట్ర జి.డి.పి గా ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఉత్పత్తి కి సొంతదారులేవరు, ఉత్పత్తి ఎవరెవరికి ఎంతెంత పంపిణీ అవుతున్నదీ వివరాలు జి.డి.పి లో ఉండవు. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయని చెప్పే గుజరాత్ లో పెట్టుబడులు ఎవరివో అర్ధంకావడానికి ప్రత్యేక వివరణ అవసరం లేదు. విదేశీ పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు విదేశీ కంపెనీలకే చెందుతాయి తప్ప గుజరాత్ ప్రజలకి కాదు. గుజరాత్ లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు అక్కడి సహజ వనరులను ఖర్చు చేసి ఉత్పత్తులు తీసి అమ్ముకుంటాయి తప్ప గుజరాత్ ప్రజలకి ఇచ్చేయ్యవు. తమ లాభాలని తమతమ దేశాలకి తరలించుకెళ్తాయి లేదా తమ వద్దే ఉంచుకుని మరిన్ని లాభాలు సంపాదించే మార్గాలు అన్వేషిస్తాయి తప్ప గుజరాత్ ప్రజలకి విద్య నేర్పాలా, ఆరోగ్యం చూడాలా, పిల్లలకి పోషకాహారం ఇవ్వాలా అని చూడవు. మరి మోడి నిత్యం గొప్పలు చెప్పుకునే  విదేశీ పెట్టుబడుల వలన గుజరాత్ ప్రజలకి ఏమి ఒరిగినట్లు?
విదేశీ పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని కొందరు చెబుతారు. కానీ ఉద్యోగాలు ఎన్ని వచ్చిందీ కూడా జి.డి.పి వృద్ధి శాతం చెప్పదు. రైతుల పంటలకి గిట్టుబాటు ధరలు వస్తున్నదీ లేనిదీ జి.డి.పి చెప్పదు.  కూలీలు, కార్మికులు,  ఉద్యోగులు మొదలయినవారి వేతనాలు ఎంత ఉన్నదీ కూడా జి.డి.పి వృద్ధి శాతం తెలియజేయదు. అలాంటి జి.డి.పి గుజరాత్ లో పెరిగితే అది ఎవరిని ఉద్ధరిస్తే గొప్పలు చెబుతారు? ఒక కాలపరిమితిలో జరిగిన సకల ఉత్పత్తుల మొత్తమే జి.డి.పి అని గుర్తుకు తెచ్చుకుంటే అది ఎవరికి సొంతమని కూడా చర్చించుకోవాలి.
సరే, స్వదేశీ, విదేశీ పెట్టుబడుదారులు పెట్టుబడులు పెడతారు. ఉత్పత్తులు తీయాలంటే వారికి వనరులు కావాలి. భూములు, నీరు, ముడి సరుకులనుండి ఒక కంపెనీకి అవసరమైన భౌతిక వనరులు అన్నీ (గుజరాత్ గురించి మాట్లాడుకుంటున్నాం గనక) గుజరాత్ నుండే స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు వినియోగిస్తారు. కానీ ఈ భౌతిక వనరులు పెట్టుబడిదారులవి కావు. అవి గుజరాత్ ప్రజలవి. గుజరాత్ ప్రభుత్వం వనరులు తనవి అంటుంది. తనవి కాకపోతే వివిధ చట్టాలను ఉపయోగించి జనం దగ్గర్నుండి రౌడీయిజం చేసి లాక్కుంటుంది (అవి మళ్ళీ భూస్వాములవీ, పెట్టుబడిదారులవీ కాకపోతేనే సుమా) కూడా. డబ్బు, మద్యం, బంగారం, కులం, మతం మొదలైన అంశాలపై ఆధారపడి జరిగే ఎన్నికలు అనే ఒక ప్రహసనం ద్వారా సమకూరిన అధికారంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రౌడీయిజం చేస్తుంది. అంటే గుజరాత్ ప్రజలు ఇచ్చిన అధికారంతో, ప్రజల భౌతిక వనరులను ధనిక దోపిడీవర్గాలైన స్వదేశీ, విదేశీ పెట్టుబడుదారులకి అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం జి.డి.పి ని వృద్ధి చేస్తోంది. ప్రజలకు చెందని అలాంటి జి.డి.పి ఎంత వృద్ధి చెందినా గుజరాత్ ప్రజలకి ఒరిగేదేమీ లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. 
వేతనాలు
ఉద్యోగాలు ఇవ్వడం లేదా, వేతనాలు ఇవ్వడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆ విషయం చూద్దాం. ప్రొఫెసర్ డాక్టర్. ఇందిరా హిర్వే, అహ్మదా బాద్ లోని ‘సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్’ సంస్ధకు డైరెక్టర్ గా పని చేస్తోంది. సెప్టెంబర్ 27 న ‘ది హిందూ’ లో రాసిన ఆర్టికల్ లో గుజరాత్ అభివృద్ధి గురించి ఆమె చర్చించారు. గుజరాత్ లోని గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, కూలీల వేతనాల వివరాలను తన ఆర్టికల్ లో ఆమె తెలిపారు.
ఆ వివరాల ప్రకారం కేజువల్ కార్మికులకు గుజరాత్ లో ఇచ్చే రోజు వారి వేతనం చాలా రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది. గ్రామాల్లో పురుషులకు 69/-, (దేశంలో 20 ప్రధాన రాష్ట్రాల్లో 14 వ స్ధానం) స్త్రీలకు 56/- (9వ స్ధానం) మాత్రమే గుజరాత్ లో లభిస్తోంది. పట్టణాలకి వస్తే, కేజువల్ కార్మికులకి పురుషులకి 109/-(7వ స్ధానం), స్త్రీలకి 56/- (14 వ స్ధానం) వేతనం గుజరాత్ లో లభిస్తోంది. గుజరాత్ లో స్త్రీల పట్ల పాటించబడుతున్న వివక్ష ఈ అంకెల్లో స్పష్టంగా చూడవచ్చు. ఇవన్నీ కేజువల్ కార్మికుల వేతనాలు. రెగ్యులర్ కార్మికుల విషయంలో కూడా [గ్రామాల్లో పురుషులకు, స్త్రీలకు వరుసగా 152/- (17 వస్ధానం), 108/- (9వ స్ధానం) పట్టణాల్లో 205/- (18వ స్ధానం), 182/- (13వ స్ధానం)] గుజరాత్ పరిస్ధితి ఇలాగే ఉంది. ఇందులో అత్యధిక వేతనం పొందుతున్న పట్టణ పురుష రెగ్యులర్ కార్మికుడి వేతనం రోజుకి 205/- మాత్రమే. అంటే నెలకి 6150/-. ఈ సమాచారం అంతా తాజా (latest) నేషనల్ శాంపిల్ సర్వే నుండి తీసుకున్నదే. రెగ్యులర్ పట్టణ కార్మికుడికి నెలకి ముష్టి ఆరువేల వేతనం లభించే గుజరాత్ లో కార్మికులు, కూలీల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి వేతనాలు పొందే కుటుంబాల్లో స్త్రీలు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడడం అనివార్యం. కాగా, గుజరాత్ లో మోడి ప్రభుత్వం సాధించిన సో కాల్డ్ ‘అధిక’ జి.డి.పి వృద్ధి స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకి, భూస్వాములకి మాత్రమే సొంతమని చెప్పడానికి ఇంతకంటే రుజువులు అవసరం లేదు.
డెలివరీ సిస్టం
గుజరాత్ ప్రభుత్వం తన రాష్ట్ర ప్రజల్లో దారిద్ర రేఖకు దిగువన (Below Poverty Line -BPL) ఉన్న ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్ధ (Public Distribution System) ద్వారా అందిస్తున్న ఆహార ధాన్యాలు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నాయని ప్రొఫెసర్ ఇందిర చెబుతున్నారు. ఈ తగ్గింపుకి గుజరాత్ ప్రభుత్వం చెప్పిన కారణం ఆసక్తికరంగా ఉంది. బిపిఎల్ కుటుంబాలకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గుజరాత్ లో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల సంఖ్య కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన సంఖ్య కంటే ఎక్కువగా ఉందని అందువల్ల కేంద్ర ఇస్తున్న ఆహార ధాన్యాలు సరిపోవడం లేదనీ గుజరాత్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇక్కడ గమనించవలసినవి రెండు అంశాలున్నాయి.
ఒకటి: కేంద్రం అంచనా కంటే గుజరాత్ లో దరిద్రం ఎక్కువగా ఉండడం. టెండూల్కర్ మోడల్ ప్రకారం కేంద్రం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్యను అంచనా వేస్తుంది. ఈ మోడల్ దేశంలో అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంది. రోజుకి గ్రామాల్లో 26/-, పట్టణాల్లో 32/- సంపాదించేవారు దారిద్ర్యరేఖకి ఎగువన ఉన్నట్లేనని ఈ మోడల్ చెబుతుంది. ఇప్పుడు అమలులో ఉన్న మోడల్ కూడా ఇదే. (ఐదుగురు ఉన్న కుటుంబం నెలకి 4824/- (గ్రామాల్లో అయితే రు. 3905/-) సంపాదిస్తే ఆ కుటుంబం కొంత అసౌకర్యంగా బతికితే బతకొచ్చు గానీ, ఆ అంచనా హాస్యాస్పదం అయితే కాదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పత్రికాముఖంగా గట్టిగా సమర్ధించుకున్నాడు కూడా. పేదలు అసౌకర్యంగా బతక్క చస్తారా అన్నది మాంటెక్ బరితెగింపు) ఇటువంటి అధమమైన అంచనాతో కేంద్ర వేసిన అంచనా కంటే ఎక్కువగా గుజరాత్ లో దరిద్రులు ఉన్నారని గుజరాత్ ముఖ్యమంత్రి పై వాదన ద్వారా అంగీకరించాడు.
రెండు: గుజరాత్ లో పేదలకు తగినన్ని ఆహారధాన్యాలు అందించడానికి మోడి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేంద్రం ఇస్తున్న ధాన్యం సరిపోకపోతే రాష్ట్రం ఏం చెయ్యాలి? తన సొంత వనరులనుండి మిగిలిన పేదలకు అయ్యే సబ్సిడీ ఖర్చును భరించాలి. కానీ అందుకు నరేంద్రమోడీ సిద్ధంగా లేడు. కేంద్ర ప్రభుత్వం సరిపోయినంత ఆహారం ఇవ్వడం లేదని చెప్పి పేద జనాన్ని కొన్ని రోజులు పస్తులు పెట్టడానికే మోడి సిద్ధపడ్డాడు. కేంద్రం ఇస్తున్న ధాన్యాన్ని మాత్రమే రాష్ట్రంలోని పేదలకి పంచడం వలన నెలకి అందవలసిన 35 కిలోల కంటే తక్కువ బియ్యం జనానికి అందుతున్నాయని తమ సర్వేలో తేలినట్లు ప్రొఫెసర్ ఇందిర తెలిపారు. ప్రజలకోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్ధ (పి.డి.ఎస్) గానీ, మధ్యాహ్న భోజన పధకం గానీ, సమీకృత శిశు పరిరక్షణా సేవలు (ICDS) గానీ గుజరాత్ లో సరిగా పని చేయడం లేదని తమ సర్వేతో పాటు ఇంకా అనేక సర్వేల్లో తేలిందని కూడా ఇందిర తెలిపారు.
పై స్ధాయిలో నుండి తగిన పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్ధితికి కారణమని, స్ధానిక పాలనా వ్యవస్ధలపై ఒత్తిడి తెచ్చే స్ధానిక సంఘాలను రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోనే అరకొరగా నిర్మించడం వల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ ఇటువంటి పంపిణీ వ్యవస్ధలు చేరడం లేదనీ తమ అధ్యయనంలో తేలినట్లు ఇందిర తెలిపారు. నరేంద్ర మోడి గొప్ప పరిపాలనాదక్షుడు అని పత్రికలు అదేపనిగా ఊదరగొడుతుంటాయి.  ప్రజలకు ఉద్దేశించిన వివిధ దారిద్ర్య నిర్మూలనా పధకాలు లక్ష్యిత ప్రజలందరికీ సమర్ధవంతంగా చేరే విధంగా ‘డెలివరీ సిస్టమ్’ ను పని చేయించడంలోనే పాలకుల అసలు పాలనా దక్షత బయటపడుతుంది. ఈ డెలివరీ సిస్టమ్ సక్రమంగా పనిచేయకపోవడానికి గల ప్రధాన కారణం అవినీతి. మంత్రులు, అధికారుల దగ్గరినుండి, రేషన్ షాపు డీలర్ వరకూ పెద్దమొత్తంలో సరుకులు పక్కదారి పట్టి బ్లాక్ మార్కెట్ కి చేరడమే డెలివరీ సిస్టమ్ లోని ప్రధాన లోపం. నిజానికి లోపం అనేది చాలా చిన్నమాట. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్ధలలో సరఫరా అయ్యే సరుకుల్లో చాలా భాగానికి అసలు లక్ష్యం బ్లాక్ మార్కెట్టే. ఇది దేశం అంతటా ఉన్న పరిస్ధితే. మోడీకి ‘గొప్ప పరిపాలనాదక్షుడు’ అన్న బిరుదును అంటగట్టడంలో ఏమాత్రం సవ్యత లేదని ఇక్కడ గమనించవలసిన విషయం.
తాగునీరు, ఆరోగ్యం
తాగునీటి ప్రాధాన్యత గురించి చెప్పనవసరం లేదు. గుజరాత్ లో తాగునీటి లభ్యత గురించి 2011 జనాభా లెక్కల వివరాలు ఒక అవగాహనాని ఇస్తాయి. తాగునీరు, పారిశుధ్యం విషయాల్లో అనేక ఇతర రాష్ట్రాల కంటే గుజరాత్ వెనుకబడి ఉందని 2011 సెన్సస్ వివరాలు చెబుతున్నాయి. సెన్సస్ ప్రకారం రాష్ట్రంలోని గ్రామాల్లో 43 శాతం కుటుంబాలకు మాత్రమే ఇళ్లవద్దకు నీటి సరఫరా ఉండగా, 16.7 శాతం కుటుంబాలకు మాత్రమే శుద్ధి చేయబడిన నీరు పంపుల ద్వారా (tap water) అందుతోంది. మరోవిధంగా చెప్పాలంటే గ్రామాల్లోని 57 శాతం కుటుంబాలు దూరం వెళ్ళి నీరు తెచ్చుకుంటుంటే, 83.7 శాతం కుటుంబాలకు శుద్ధి చేయబడిన నీటి సౌకర్యం లేదు. అయిదోవంతు కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు, సుదూర ప్రాంతాలకు వెళ్ళి నీరు తెచ్చుకోవాలి. ఈ పరిస్ధితి వలన మహిళలు, ఆడపిల్లల ఆరోగ్యం బాగా ప్రభావితం అవుతుంది. పట్టణాలకి వస్తే కొంత నయం. 84 శాతం కుటుంబాలకు ఇళ్ళవద్దకు నీటి సరఫరా ఉండగా, 69 శాతం కుటుంబాలకు శుద్ధి చేయబడిన నీరు అందుతోంది. తీసుకున్న ఆహారం శరీరానికి సమర్ధవంతమైన పోషకంగా మారాలంటే పరిశుభ్రమైన తాగునీరు అత్యంత అవసరం అన్నది నిపుణులు చెప్పేమాట.
పారిశుధ్యం కూడా ప్రజల ఆరోగ్యాన్నీ, పోషకాన్నీ ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది. మరుగుదొడ్ల వినియోగంలో గుజరాత్ (గ్రామాలు) దేశంలోని ప్రధాన 20 రాష్ట్రాల్లో 10 వ స్ధానంలో ఉందని సెన్సస్ వివరాలు చెబుతున్నాయి. గ్రామాల్లో 65 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. ప్రొఫెసర్ ఇందిర బృందం ఇటీవల జరిపిన సర్వే ప్రకారం గుజరాత్ లో 70 శాతం గ్రామాలకు వ్యర్ధాల సేకరణ, పారవేతలో సరైన విధానం లేదు. 78 శాతం గ్రామాల్లో మురుగునీటి పారుదల సౌకర్యం లేదు. పట్టణాల విషయానికి వస్తే మరుగుదొడ్ల వినియోగంలో గుజరాత్ తొమ్మిదవ స్ధానంలో ఉంది. వ్యర్ధాల నిర్వహణ కూడా గుజరాత్ పట్టణాల్లో లో ఒక పెద్ద సమస్యగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.
ఈ పరిస్ధితి గుజరాత్ లో రోగాల విజృంభణకు దారి తీస్తున్నది. ప్రొఫెసర్ ఇందిర బృందం సర్వే ప్రకారం గుజరాత్ లో 44 శాతం గ్రామాల్లో పచ్చ కామెర్ల జబ్బు చాలా తరచుగా సంభవిస్తోంది. అలాగే 30 శాతం గ్రామాల్లో మలేరియా, 40 శాతం గ్రామాల్లో డయేరియా, 25 శాతం గ్రామాల్లో కిడ్నీల్లో రాళ్ళు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, పంటి జబ్బులు తరచుగా సంభావిస్తున్నాయని సర్వేలో తేలింది. పట్టణాల్లోనూ పరిస్ధితి ఇంతకంటే మెరుగ్గా ఏమీలేదు.
లోగుట్టు
ఈ అంశాలన్నీ తెలిపేదేమంటే గుజరాత్ లో ఉందని చెబుతున్న అభివృద్ధి గుజరాత్ ప్రజలది కాదు. ఒక్క గుజరాతే కాదు. ఈ దేశంలోని అభివృద్ధి అంతా ఈ దేశ ప్రజలది కాదు. జి.డి.పి వృద్ధి శాతం పెరిగినా, తలసరి ఆదాయం పెరిగినా, వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధి జరిగినా అవేవీ ఈ దేశ ప్రజలవి కావు. రోజుకి 32 రూపాయలు కూలి డబ్బులు సంపాదిస్తే వారిక దరిద్రులు కాదని ప్రణాళికవేత్తలే చెబుతుంటే ఈ దేశంలో కోట్లాది ప్రజానీకం ఆదాయాలను పెంచేందుకు ప్రణాళికలు రచించే అవసరం తలెత్తదు. ప్రజల ఆదాయాలను పెంచే అవసరం లేని ప్రణాళికలు, ప్రణాళికావేత్తలు ఎవరికోసం ఉద్దేశించబడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏటికేడూ వందల, వేల, లక్షల కోట్ల ఆదాయాలు పెంచుకుంటున్న సూపర్ ధనికుల కోసమే ప్రణాళికలూ, విధానాలు. అటువంటి ప్రణాలికల ద్వారా, విధానాల ద్వారా వృద్ధి చెందుతున్న జి.డి.పిలో ప్రజల ఆదాయాలు లేవని ఈపాటికి అర్ధం కావాలి. కానీ ఈ జి.డి.పిలో కోట్లాది ప్రజల శ్రమ మాత్రం ఉందన్న సంగతి మరువరాదు. ఈ బ్లాగ్ లో పదే పదే చెబుతున్నట్లు శ్రమ లేకుండా ఒక్క పూచిక పుల్ల కూడా నడిచిరాదు. రైతులు, కూలీలు, కార్మికులు, గుమస్తాలు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు…. వీరే ఈ దేశ శ్రమశక్తి ప్రదాతలు. వీరే ఈ దేశ జి.డి.పి వృద్ధికి కారకులు. కానీ ఈనగాచి నక్కలపాల్జేసినట్లు ఈ జి.డి.పి అంతా భూస్వాముల, పెట్టుబడిదారుల, వాల్ స్ట్రీట్ కంపెనీలకు చెందిన వేనవేల ఖాతాల్లో పేరుకుపోతోంది. విదేశాలకు తరలివెళ్లిన కోటి కోట్ల నల్లధనం అందుకు ప్రత్యక్ష రుజువు.
ఇటువంటి నేపధ్యంలో మోడీకి అంటగట్టిన గొప్ప పేరు అర్ధం లేనిది. మోడీకి ఆపాదిస్తున్న గొప్పతనంలో పశ్చిమ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు ఉన్నాయి. భారత దేశ పాలకవర్గాలు తమ నాయకుడిని నిర్ణయించుకోలేని రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పశ్చిమ దేశాలు ఆశలు పెట్టుకున్న మన్మోహన్ సింగ్ ‘నిష్కళంక’ ప్రతిష్ట వరుస కుంభకోణాలతో మసకబారి పోయింది. గాంధీ వంశం పేరు ప్రతిష్టలకు కూడా ఆదుకునే పరిస్ధితి  తగ్గిపోతోంది. ఈ పరిస్ధితుల్లో భారత దేశ దళారీ పాలకవర్గాలకూ, వారి మాస్టర్లయిన పశ్చిమ బహుళజాతి కంపెనీలకూ కొత్త నాయకుడి అవసరం ముందుకొచ్చింది. కాంగ్రెస్, బి.జె.పి ల కూటమి బద్ధ శత్రువులయినట్లు ప్రజలముందు కనిపించేదంతా ఒట్టి అబద్ధం. ఏ ముఠాకి ప్రాధాన్యం ఉండాలన్న తగాదా తప్ప ఆర్ధిక వనరుల వినియోగంలో ఈ పార్టీల కూటముల మధ్య తేడా ఏమీ లేదు. భారత దేశ పర్యటనకు వచ్చే పశ్చిమ దేశాల అధిపతులు, మంత్రులు వేదికలపై అధికార పార్టీ నాయకులతో సమావేశాలు జరిపినా ప్రవేటుగా ప్రతిపక్షాలను కూడా కలిసిపోయేది ఈ కారణం వల్లనే.
అందువల్ల తదుపరి ప్రధాని రాహుల్ గాంధీ అయినా, మోడి అయినా పశ్చిమ దేశాలకు నష్టం ఏమీలేదు. ప్రజల నిరసనలను పక్కకునెట్టి, అణచివేసి ఎంత సమర్ధవంతంగా దేశవనరులను తమకు అప్పజెపుతారన్నదే వారికి కావాలి. ఆ పని మోడి చేయగలడని గుజరాత్ మారణహోమం స్పష్టం చేసింది. వేలాది ముస్లింలను ఊచకోత కోసి కూడా గుజరాత్ ని పదేళ్లపాటు పోటీలేకుండా పాలించగలగడం పశ్చిమ దేశాలను అబ్బురపరిచే విషయం. తన వ్యతిరేకులను స్వ, పర భేదం లేకుండా నిర్దాక్షిణ్యంగా అణచివేయడంలో మోడి చూపించిన ప్రతిభ పశ్చిమ దేశాల దృష్టిలో అనన్య సామాన్యం. అమెరికా సందర్శనకు మోడీకి వీసా నిరాకరించడం ఒక నాటకం. అందులో కూడా అమెరికాకి ప్రత్యేకమైన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నదే అర్ధం చేసుకోవాలి తప్ప మోడిని వాటేసుకోవడానికి అమెరికాకి అభ్యంతరం ఏమీ ఉండదని గ్రహించాలి. బిన్ లాడేన్ స్ధాపించిన ఆల్-ఖైదాతో కొనసాగుతున్న అమెరికా మైత్రితో పాటు ప్రపంచంలోని అనేక దేశాల నియంతలతో అమెరికాకి ఉన్న సాన్నిహిత్యం, మద్దతు ఆ సంగతిని చెబుతాయి. గుజరాత్ మారణహోమం అప్రతిష్టను మోడి వ్యక్తిత్వంనుండి చేరిపివేసే లక్ష్యంతోనే ఆయన చుట్టూ అభివృద్ధి అనీ, పాలనా దక్షుడనీ ఒక మాయని సృష్టిస్తున్నాయి పత్రికలు. భారత దేశంలోని కార్పొరేట్ పత్రికలన్నీ వ్యాపార సంస్ధలేననీ, ఆ సంస్ధల్లో వాల్ స్ట్రీట్, లండన్ ఫైనాన్షియర్లు సమకూర్చిన అప్పులు (పెట్టుబడులు) ఉన్నాయని గ్రహిస్తే భారత పత్రికల మోడి అనుకూల ప్రచారంలోని లోగుట్టు ఏమిటో అర్ధమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి