13, అక్టోబర్ 2012, శనివారం

వన్‌ కార్డు మనుగడపై సందేహాలు


  • అన్ని కార్డులకు ఒకే ప్రత్యామ్నయం.. వన్‌ కార్డు
  • వన్‌కార్డు కు బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ
  • ఐటీ మంత్రి పొన్నాల సమక్షంగా వన్‌కార్డు లాంఛింగ్‌
  • మైనార్టీ కార్పొరేషన్‌ స్కాంలో దొరికిన వన్‌కార్డు డైరెక్టర్‌
  • ఎలాంటి ఒప్పందాలు లేవని తేల్చిన బ్యాంకులు
  • సందేహాల పుట్టగా వన్‌కార్డు కాన్సెప్ట్‌
  • అన్ని సేవలు ఒకే కార్డుతో ఎలా సాధ్యం.. ?
  • కార్డును క్లోనింగ్‌ చేస్తే పరిస్థితి ఏంటి.. ?
  • ప్రభుత్వం, పొన్నాల, గంగూలీ ఇవన్నీ ఆలోచించలేదా.. ?
  • ఇలాంటి సంస్థలను పెద్దలు ప్రమోట్‌ చేస్తే ఎలా.. ?
  • అమాయకులు నష్టపోతే ఎవరిదీ బాధ్యత.. ?
అన్ని రోగాలకు ఒకటే మందు జిందా తిలిస్మాత్‌. ఇది నిన్నటి మాట. అన్ని అవసరాలకూ ఒకే కార్డు.. ఇది ఇవాళ్టి మాట. వన్‌ కార్డు వన్‌ నేషన్‌ పేరిట ఏర్పాటైన సంస్థ చెప్పిన డాంభికాలివి. మాటలు చెప్పడమే కాదు.. కోల్‌కతా ప్రిన్స్ సౌరవ్‌ గంగూలీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకుని.. ఐటీ మంత్రి పొన్నాల సమక్షంలో.. కార్డును ఘనంగా లాంఛ్‌ చేయించింది. అయితే ఈ కార్డు ఫీచర్స్‌ గురించి వినగానే అసలు విషయం అందరికీ బోధపడిపోయింది. చివరికి ఇందులోకి వచ్చిన నిధులు కూడా సక్రమమైనవి కాదని తేలడంతో.. సంస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది.పదిరకాల కార్డులెందుకు దండగ.. వన్‌ కార్డ్‌ ఉండగా.. ఇదీ వన్‌ కార్డు వన్‌ నేషన్‌ నినాదం.

అన్ని రకాల లావాదేవీలను ఒక్క కార్డు ద్వారానే నిర్వహించగలగడం వన్‌ కార్డు ప్రత్యేకత అంటూ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. అంతే కాదు.. ఏకంగా కోల్‌కతా ప్రిన్స్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఐటీ మినిస్టర్‌ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఈ కార్డు ఆవిష్కరణ అత్యంత వైభవోపేతంగా జరిగింది.అయితే వన్ కార్డు  డైరెక్టర్‌ సాయికుమార్‌ కు మైనార్టీ కార్పోరేషన్‌ స్కాంలో పాత్ర ఉందని తేలడంతో.. సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అటు బ్యాంకులు సైతం.. వన్‌కార్డుతో తాము ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని తేల్చిచెప్పాయి. దీంతో వన్‌ కార్డు పరిస్థితి ఇక అంతేననన్నది తేలిపోయింది.

వాస్తవానికి ఈ వన్‌ కార్డు కాన్సెప్టే అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ఒకే కార్డుతో డెబిట్‌, క్రెడిట్‌, పాన్‌ కార్డుల సేవలు ఎలా సాధ్యమవుతాయన్నది మొదటి సందేహమైతే.. ఒకవేళ సాధ్యమైనా... ఇందులో మోసాలు జరగవన్న గ్యారంటీ ఏంటన్నది రెండో అనుమానం. అన్ని రకాల వివరాలను పొందుపరిచిన ఈ కార్డులను కూడా... ఏటీఎం, క్రెడిట్‌ కార్డులు క్లోనింగ్‌ చేసినట్లుగా చేస్తే... వినియోగదారుల పరిస్థితి ఏంటన్నది అతిపెద్ద ప్రశ్న. మామూలు వ్యక్తులకే ఇన్ని సందేహాలు వస్తే.. ప్రభుత్వానికి ఇవేవీ తట్టలేదా అన్నది అన్నింటికీ మించిన సందేహం. సాక్షాత్తూ ఐటీ మంత్రి అయి ఉండి.. పొన్నాల వీటి గురించి ఆలోచించలేదా అన్న డౌటు ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతోంది. ఇలాంటి వివాదాస్పద కాన్సెప్ట్‌ తో వచ్చిన సంస్థను ఒక మంత్రి అయిన పొన్నాల.. బాధ్యయుతమైన వ్యక్తిగా గంగూలీ ఎలా ప్రమోట్‌ చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రముఖులను చూసి.,. వారు చెప్పిన మాటలు విని  అమాయకులు మోసపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని... జనం నిలదీస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి