సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు మార్పు
గ్యాస్ ధర పెంపును అడ్డుకోవడమే కారణం?
ఇక కేజీ బేసిన్‌లో రిలయన్స్ ఇష్టారాజ్యం
సాంకేతిక కారణాలు చూపి తక్కువ గ్యాస్ ఉత్పత్తి
ఫలితంగా దేశ ఖజానాకు వేలకోట్ల నష్టం
20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గండి
న్యూఢిల్లీ నుంచి డబ్ల్యూ చంద్రకాంత్: దేశ
రాజకీయాలపై ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌నకు ఎంత పట్టుందో
మరోసారి స్పష్టంగా రుజువైంది. కృష్ణా-గోదావరి బేసిన్‌లో లభ్యమయ్యే గ్యాస్
ధరను పెంచుకునేందుకు రిలయన్స్ వేస్తున్న ఎత్తులను అడ్డుకున్నందుకుగాను
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తగిన మూల్యం
చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రతిష్టాత్మకమైన పెట్రోలియం శాఖను వదులుకుని
అంతగా ప్రాధాన్యంలేని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు మారిపోవాల్సి వచ్చింది.
తమ హవాను అడ్డుకున్న వారెంతటివారైనాసరే తప్పిస్తామంటూ రిలయన్స్ మరోసారి
నిరూపించుకుంది.
రిలయన్స్ వర్సెస్ జైపాల్
జైపాల్‌రెడ్డి, రిలయన్స్ సంస్థల మధ్య అనేక అంశాలపై చాలాకాలంగా యుద్ధం
నడుస్తోంది. సహజవాయువు ధరను పెంచడం అందులో ఒకటి. మంత్రుల సాధికార బృందం
గతంలో నిర్ణయించిన గ్యాస్ ధరను 2014 తర్వాత సమీక్షించాల్సి ఉంది. అయితే ఈ
లోగానే గ్యాస్‌ధరను పెంచుకోవాలని రిలయన్స్ అన్ని రకాల ప్రయత్నాలూ చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ ధరను సవరించడంవల్ల ఖజానాకు 6.3 బిలియన్
డాలర్ల నష్టం తప్పదు. ఈ భారం పన్నుల రూపంలో ప్రజలపైనే మోపాల్సి వస్తుంది. ఈ
నేపథ్యంలో రిలయన్స్ ప్రయత్నాలను జైపాల్‌రెడ్డి సమర్థంగా అడ్డుకున్నారు.
అంతటితో ఆగకుండా కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి తగ్గడానికి అసలైన
కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నాలూ చేశారు.
రిలయన్స్ సంస్థను
కూడా కాగ్ ఆడిట్ పరిధిలోకి తీసుకురావాలని పట్టుపట్టారు. అంతేకాదు
ప్రతిపాదిత స్థాయిలో గ్యాస్ ఉత్పత్తిచేయనందువల్ల... గ్యాస్ ఉత్పత్తికోసం
రిలయన్స్ చేసిన 1.46 డాలర్ల వ్యయాన్ని కూడా చెల్లించాల్సిన అవసరం
లేదన్నారు. దీంతో పెట్రోలియం శాఖనుంచి జైపాల్‌రెడ్డిని తప్పించడమే రిలయన్స్
ధ్యేయంగా మారింది. అందుకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కలిసివచ్చింది.
జైపాల్‌రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించడం ద్వారా... గ్యాస్‌ధర
పెంపునకు యూపీఏ-2 సర్కారు సిద్ధమవుతున్నట్లుగా భావిస్తున్నారు. అయితే
జైపాల్‌రెడ్డి శాఖ మార్పుపై కాంగ్రెస్‌వర్గాలు మాత్రం భిన్న కథనాన్ని
వినిపిస్తున్నాయి. తెలంగాణ, తదితర అంశాలపై అధిష్టానం ఆలోచనలకు వ్యతిరేకంగా
జైపాల్‌రెడ్డి ఇంటిలో సమావేశాలు జరపడంవల్లనే ఆయనను అప్రాధాన్య శాఖకు
మార్చారని చెబుతున్నారు.
ఖజానాకు వేలకోట్ల నష్టం
ఒప్పందాల ప్రకారం రిలయన్స్ రోజుకు 70 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్
మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 42
ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల ఖజానాకు
నేరుగా రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 80
ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 25
ఎంఎంఎస్‌సీఎండీలకే పరిమితమైంది. దీంతో ఖజానాకు రూ.45 వేల కోట్ల నష్టం
జరుగుతోంది. ‘‘ఒక ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ ఉత్పత్తి తగ్గితే 210 మెగావాట్ల
విద్యుత్తును కోల్పోతాం. గ్యాస్ కొరతవల్ల దేశవ్యాప్తంగా 20 వేల మెగావాట్ల
సామర్థ్యంగల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. కేజీ
బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి తగ్గడంవల్ల ఎరువులు కూడా ఎక్కువగా దిగుమతి
చేసుకోవాల్సి వస్తోంది.
దీనివల్ల దేశానికి భారీగా నష్టం
వాటిల్లుతోంది. గ్యాస్‌ధర పెంపుకోసమే ఉత్పత్తిని తగ్గిస్తున్నారేమో ఎవరికి
తెలుసు?’’ అని ఒక అధికారి చెప్పారు. అయితే సాంకేతిక వైఫల్యాల వల్లనే గ్యాస్
ఉత్పత్తి తగ్గినట్లు రిలయన్స్ నమ్మబలుకుతోంది. కానీ జాతీయ ప్రయోజనాలకు
గండికొడుతూ రిలయన్స్ పాల్పడుతున్న అక్రమాలను ‘సాక్షి’ గతంలో పలుమార్లు
ఎండగట్టింది. కేజీ బేసిన్ గ్యాస్‌లో రాష్ట్రానికి వాటా కావాల్సిందేనని
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా కృషిచేశారు. నేరుగా
ప్రధానికి లేఖలు కూడా రాశారు. అయితే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన హఠాన్మరణంతో
రిలయన్స్‌కు ఒక అడ్డంకి తొలగిపోయినట్లయింది. ఇప్పుడు పెట్రోలియం శాఖనుంచి
జైపాల్‌రెడ్డిని కూడా తప్పించడంతో రిలయన్స్‌కు మార్గం మరింత సుగమమైంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి