16, అక్టోబర్ 2012, మంగళవారం

లారెన్స్‌ వల్ల భారీగా నష్టపోయాం : 'రెబల్‌' నిర్మాతలు


రూ.22 కోట్ల రూపాయల బడ్జెట్‌లో సినిమా తీస్తానని చెప్పి, రూ.45 కోట్ల రూపాయల ఖర్చు చేయించాడని 'రెబల్‌' చిత్ర నిర్మాతలు దానయ్య, పుల్లారావు దర్శకుడు లారెన్స్‌పై ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోయామని లారెన్స్‌పై మండిపడ్డారు. ఈ విషయంలో వీరు నిర్మాతలమండలికి సోమవారంనాడు ఫిర్యాదు చేశారు. లారెన్స్‌పై నిషేధం వేటు విధించాలని వారు కోరారు.
నన్నే వాళ్లు మోసం చేశారు : దర్శకుడు లారెన్స్‌
ఇదే విషయంలో దర్శకుడు లారెన్స్‌ 'రెబల్‌' చిత్ర నిర్మాతలపై తిరిగి ఆరోపణలు చేస్తున్నారు. తనకు ఇతర భాషల్లో డబ్బింగ్‌ రీమేక్‌ హక్కులు ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ డైరెక్టర్‌ అసోసియేషన్స్‌కు సోమవారంనాడు ఫిర్యాదు చేశాడు.
'రాంబాబు' గొడవ చల్లారలేదు
ఇదిలా ఉండగా, పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రం వివాదంలోంచి బయటపడలేదు. డివివి దానయ్యకు, చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు మధ్య పారితోషికం విషయంలో గొడవ ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో గతంలో తమ మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందని దానయ్య వివరణిచ్చారు కూడా.
కానీ, ఈ వివాదం దర్శకుల సంఘంలో నలుగుతూ వచ్చింది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న దర్శకుల సంఘం ఈనెల 17లోగా పూరీజగన్నాత్‌కి ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చేయాలని నిర్మాత దానయ్యను కోరింది. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ఇవ్వాలని తెలియజేసింది. అలా కానీ పక్షంలో నిర్మాత దానయ్యకు సహాయ నిరాకరణ తప్పదని డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మద్దినేని రమేస్‌ స్పష్టం చేశారు. సుమారు ఐదుకోట్ల రూపాయలకు సంబంధించి బ్యాలెన్స్‌ మొత్తంపై రగడ జరుగుతోంది. పదకొండు కోట్ల రెమ్యునరేషన్‌ ఇస్తామని చెప్పి, ఆరున్నర కోట్లతో నిర్మాత సరిపెట్టారని పూరీ చేసిన ఆరోపణ. కాగా, సినిమా నిర్మాణం అనుకున్న సమయాని కన్నా ముందే జరిపేశాడని హడావిడిగా పూరీ చుట్టేశాడని దానయ్య చేస్తున్న ఆరోపణ. అందుకే అదనంగా ఇస్తామన్న మొత్తాన్ని ఆపేశాడని సమాచారం.
షూటింగ్స్‌ నిలిపేస్తాం : దర్శకుల సంఘం
దానయ్య విషయంపై దర్శకుల సంఘం తీవ్రంగా స్పందించింది. దానయ్య బుధవారంలోపల పూరీకి ఇవ్వాల్సిన బాకీ చెల్లించాలనీ ఒకవేళ చెల్లించకపోతే దానయ్య సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తామని పేర్కొంది. ఈ కార్యక్రమంలో సాగర్‌, మద్దినేని రమేస్‌, ప్రసన్న కుమార్‌, కాదంబరి కిరణ్‌కుమార్‌. కొడాలి వెంకటేశ్వరారవు తదితరులు పాల్గొన్నారు.
చిన్నచిత్రాలకు ప్రోత్సాహమిస్తాం
చిన్నచిత్రాలకు తగిన ప్రోత్సాహం ఇస్తామని దర్శకుల సంఘం స్పష్టంచేసింది. సోమవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాగర్‌ మాట్లాడుతూ..'ఇటీవల 5-డి కెమెరాతో నిర్మించే చిత్రాలను నిషేదిస్తామని పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్దాలే. 5-డి కెమెరాతో తీసే చిత్రాలకు 24 క్రాప్ట్‌కు సంబంధిం తక్కువ సంఖ్యలో కార్మికులకు పని దొరుకుతుంది. కాబట్టి అందులో సభ్యత్వం గలవారినే పనిలోకి తీసుకోవాలని పేర్కొన్నా'మని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన ఈ రోజుల్లో, మేం వయస్సుకు వచ్చాం చిత్రాలు 5-డితో తీసినవేనని ఉదహరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి