వేలాది ఫైబర్ మైళ్ళు, మరిన్ని వేల
సర్వర్లతో ఇంటర్నెట్ వినియోగదారుల సర్చింగ్, సర్ఫింగ్ దాహాల్ని తీరుస్తున్న
గూగుల్, తన డేటా సెంటర్లను ఇన్నాళ్లూ గుప్తంగా ఉంచింది. పారదర్శకత గురించి
తాను చెప్పే నీతులని ప్రదర్శన కోసమైనా పాటించదలిచిందో ఏమో తెలియదు గానీ తన
డేటా సెంటర్ల ఫోటోలని గూగుల్ విడుదల చేసింది.
వైర్డ్ డాట్ కామ్ ప్రకారం తన అత్యాధునిక
ఇన్ఫ్రా స్ట్రక్చర్ సాయంతో రోజుకి 20 బిలియన్ల వెబ్ పేజీ లను గూగుల్
ఇండెక్స్ చేయగలుగుతోంది. రోజుకి 3 బిలియన్ల సెర్చ్ సందేహాలను తీరుస్తోంది.
వాస్తవ సమయంలో మిలియన్ల కొద్దీ ప్రకటనల ఆక్షన్లను నిర్వహిస్తోంది. 425
మిలియన్ జీ మెయిల్ యూజర్లకు చోటు కల్పిస్తోంది. ఇంకా అనేక మిలియన్ల యూ
ట్యూబ్ వినియోగదారుల వీడియోలను జిప్ చేసి నిలవ చేస్తోంది. రానున్న రోజుల్లో
వినియోగదారులు ధరించగల గ్లాస్ ప్లాట్ ఫారంలపైనే విజువల్ సెర్చ్ రిజల్ట్స్
అందించడానికి గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇన్ని సేవలను అందించేందుకు కీలకమైన డేటా
సెంటర్లను తన సిబ్బందిలో కూడా చాలా కొద్దిమందికి మాత్రమే తొంగి చూచే అవకాశం
గూగుల్ కంపెనీ కల్పించిందట. ఈ డేటా సెంటర్లే గూగుల్ ఆధిపత్యానికి ప్రధాన
పునాది కావడమే ఈ గోప్యానికి కారణం. అనేకానేక ఉచిత సేవల ద్వారా కోట్లాది
వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారికి చెప్పకుండానే నిలవ చేసుకోవడంతో
పాటు, స్ట్రీట్ వ్యూ కార్ల ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచవ్యాపితంగా కోట్లాది
వినియోగదారుల వాస్తవ లొకేషన్లను కూడా ప్రత్యక్షంగానే దొంగిలించి
భద్రపరుచుకున్న గూగుల్ పారదర్శకత గురించి నీతులు వల్లించడమే గొప్ప వింత.
యూరప్, అమెరికా దేశాలతో పాటు, ఆసియా దేశాలు కూడా గూగుల్ పై డేటా దొంగతనం
కేసులు మోపి కోర్టుల్లో విచారణ జరుపుతుండడంతో తాను నీతివంతంగానే వ్యాపారం
చేస్తున్నట్లు చెప్పుకోవలసిన అవసరం గూగుల్ కి వచ్చినట్లు కనిపిస్తోంది.
బహుశా ఆ అవసరంలోని భాగమే ఈ ఫోటోల విడుదల కావచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి