29, అక్టోబర్ 2012, సోమవారం

ప్రమాణంలో పదనిసలు నాయక్ తడబాటు.. ప్రణబ్ సర్దుబాటు


న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : ఆదివారం ప్రమాణం చేసిన 22 మంది మంత్రుల్లో ఆరుగురు మన రాష్ట్రానికి చెందినవారే. ఇందులో పళ్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి దేవుడి సాక్షిగా ఇంగ్లీషులో ప్రమాణం చేయగా, బలరాం నాయక్ మాత్రం హిందీలో ప్రమాణం చేశారు.

+ ఊహించని విధంగా మంత్రి పదవి దక్కినందుకు బలరాం నాయక్ సంతోషసాగరంలో తేలిపోయారు. చివరకు ప్రమాణ స్వీకారానికి కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన అచ్చమైన లంబాడా సంస్కృతిని ప్రతిబింబించేలా తలపాగా ధరించి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞను చూసి చదవడానికి కూడా బలరాంనాయక్ తంటాలు పడ్డారు. మొత్తం 11 సార్లు తడబడ్డారు. దీంతో నాయక్ పరిస్థితిని అర్థం చేసుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఆయన తప్పు చదివినప్పుడల్లా సరిదిద్దేందుకు ప్రయత్నించారు. ప్రమాణం ముగిశాక రాష్ట్రపతికి నమస్కరించి, అధికారిక పత్రాలపై సంతకం చేయకుండానే నాయక్ తిరిగి వెళ్లబోయారు. ఇంతలో 'సైన్' అంటూ ప్రణబ్ గట్టిగా అన్నారు. దీంతో నాయక్ తిరిగి వెనక్కు వెళ్లి రిజిస్టర్‌లో సంతకం చేశారు.

+ బలరాం నాయక్ సోనియాగాంధీకి పాదాభివందనం చేశారు. రాహుల్‌గాంధీకి మోకాళ్ల వరకు వంగి నమస్కరించారు.

+ ప్రమాణ స్వీకారం చేసేముందు, తర్వాత అందరు మంత్రులూ సోనియా, ప్రధాని మన్మోహన్‌లకు నమస్కరించారు. అయితే, సర్వే సత్యనారాయణ మాత్రం ప్రమాణ స్వీకార ప్రదేశానికి వెళ్లే ముందు సోనియా వద్దకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించి ఆ తర్వాత ప్రమాణం చేశారు.

+ చిరంజీవి కొడుకు రామ్‌చరణ్, కోడలు ఉపాసనతో సహా పలువురు కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

+ కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, ఎన్‌డీఎమ్ఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి, ఎంపీ లగ డపాటి రాజగోపాల్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

+ ప్రమోషన్ చేజారిన పురందేశ్వరి మాత్రం సహచరులతో పాటు కాకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ప్రధాని మన్మోహన్‌తో పాటు ముందు వరుసలో కూర్చున్నారు. అయితే, హోంశాఖ మంత్రి షిండే అక్కడికి రావడంతో మొదటి వరసలో ఆయనకు స్థానమిచ్చిన పురందేశ్వరి తాను రెండో వరుసలో కూర్చున్నారు.

+ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర మంత్రులు గంటా, రామచంద్రయ్య, పొన్నాల, కన్నా, బస్వరాజు సారయ్యతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, అభిమానులు చిరంజీవిని ఆయన బస చేసిన తాజ్ మాన్‌సింగ్ హోటల్‌కు వెళ్లి అభినందించారు. ఏపీ భవన్‌లోనూ ఆయన్ను సత్కరించారు.

+ వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి రెడ్యా నాయక్, ఎంపీ సిరిసిల్ల రాజయ్య.. కొత్త మంత్రులందరి నివాసాలకు వెళ్లి వారిని అభినందించారు.

+ తనకు ఇచ్చిన ఎంపీ పదవిని బలరాం నాయక్‌కు ఇప్పించి, తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన రెడ్యానాయక్ ఏపీ భవన్‌లో ఒంటరిగా కనిపించారు.

+ కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిల్లి కృపారాణిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కలిసి రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

+ రాష్ట్రానికి చెందిన పదిమంది మంత్రుల్లో ఐదుగురు కొత్తవారితో పాటు ముగ్గురు పాతవారికి శాఖలు మారాయి.

+ తమ పాత శాఖల్లోనే కొనసాగుతున్నవారు గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్, జౌళి శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి.

+ జైపాల్ రెడ్డి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి సోమవారమే నూతన శాఖ బాధ్యతలను స్వీకరించనున్నారు. బలరాం నాయక్ కూడా సోమవారమే స్వీకరించే అవకాశముంది. పళ్లంరాజు, చిరంజీవి, సర్వే సత్యనారాయణ ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు.

-న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి