13, అక్టోబర్ 2012, శనివారం

వాల్‌మార్ట్‌ కార్మికుల సమ్మె



బ్లాక్‌ ఫ్రైడేలో వేలాది మంది కార్మికులు
అమెరికాలోని 12 పట్టణాలలో భారీ ప్రదర్శనలు
వాల్‌మార్ట్‌ కార్మికుల సమ్మె
వాషింగ్టన్‌ : ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్థ అయిన వాల్‌మార్ట్‌లోని సిబ్బంది భారీగా వ్యాపార లావాదేవీలు జరిగే ''బ్లాక్‌ శుక్రవారం'' నాడు సమ్మె నిర్వహించారు. ఇప్పటికే డల్లాస్‌లోని వాల్‌మార్ట్‌ కార్యాలయాన్ని కార్మికులు దిగ్బంధించారు. పని గంటలు, వేతనాల విషయం లో తమ డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వాల్‌మార్ట్‌ కార్మికులకు సంఘీభావంగా నేషనల్‌ కన్సూమర్స్‌ లీగ్‌, ఇతర కార్మిక గ్రూప్‌ల నేతలు బ్లాక్‌ శుక్రవారం నాడు షాపుల ముందు నిరసనకు దిగారు.
గురువారం అమెరికాలోని 12 ప్రధాన పట్టణాలలో భారీ ర్యాలీలు నిర్వహించారు. చాలీచాలని జీతాలతో విసిగిపోయిన వందలాది మంది కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం వుండే ఆర్కాసన్స్‌ నగరంతో పాటు డల్లాస్‌, శాన్‌ డిగో, చికాగో, లాస్‌ ఏంజెల్స్‌, సీటెల్‌, వాషింగ్టన్‌ డిసి, శాక్రమెంటోలతో పాటు అనేక పట్టణాలలో సిబ్బంది విధులను బహిష్కరించి ర్యాలీలకు హాజరయ్యారు.
''సమ్మె ద్వారా ఏదో చేయాలని మేము అనుకోవటంలేదు. కానీ వాల్‌మార్ట్‌కు సమస్య తీవ్రత తెలియజేయాలనుకుంటున్నాం'' అని సమ్మెచేస్తున్న డల్లాస్‌ కార్మికుడు కాడి హర్రీస్‌ చెప్పారు. ''ఈ స్టోర్‌లలో జరుగుతున్న అన్యాయాలను మేము చూడలేకపోతున్నాం. మేము వీటిని కోరుకోవటం లేదు'' అన్నారు. 12 రాష్ట్రాలలోని 28 స్టోర్లలోని కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పగసాధింపు చర్యలను నిలిపివేయాలని సమ్మె చేస్తున్న వర్కర్లు కోరుతున్నారు. పని ప్రదేశాలను మార్చటం తమపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ సాహసోపేతమైన కార్మికులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, బయపడాల్సిన అవసరం లేదని తమ సహచర కార్మికులకు చాటిచెపుతున్నారు. ఇప్పటికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే సమ్మెలో పాల్గొన్నారు. బ్లాక్‌ ఫ్రైడే కార్యక్రమంలో మరింత మంది పాల్గొంటారని మేకింగ్‌ చేంజ్‌ ఎట్‌ వాల్‌మార్ట్‌ డైరెక్టర్‌ డాన్‌ సచ్లాడెమాన్‌ తెలిపారు. మేకింగ్‌ చేంజ్‌ ఎట్‌ వాల్‌మార్ట్‌ వాల్‌మార్ట్‌ అసోసియేట్స్‌తో కలిసి పనిచేస్తోంది.
దేశ వ్యాపితంగా వాల్‌మార్ట్‌ కార్మికులకు ప్రజల నుండి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తమౌతోంది. ఓక్లాండ్‌లో మహిళలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు వాల్‌మార్ట్‌ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ప్రదర్శకులనుద్దేశించి జాబ్‌ విత్‌ జస్టిస్‌, ది అలమేదా లేబర్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు మాట్లాడుతూ, కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. దేశమంతటా ఆందోళన ఊపందుకున్నదన్నారు. కార్మికుల ఆందోళనకు తమ పూర్తి తోడ్పాటువుంటుందని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి