22, జూన్ 2012, శుక్రవారం

మరోసారి ఆలోచించండి బ్యాంకు వెళ్లే అవసరం లేదేమో!


apr -   Fri, 22 Jun 2012, IST
మరోసారి ఆలోచించండి బ్యాంకు వెళ్లే అవసరం లేదేమో!

బ్యాంకులోని కాషియర్‌ కౌంటర్ల ముందు గంటల కొద్దీ నిలబడి అలసిపోయారా బ్యాంకుకు వెళ్ళాలంటే ఆఫీసులో పర్మిషన్లు లేక హాఫ్‌డే లీవ్‌లు పెట్టాల్సి వస్తోందని బాధ పడుతున్నారా ఎటిఎం కౌంటర్ల ముందు కూడా బారులు తీరిన జనాలను చూడలేకపోతున్నారా అసలు మీకు బ్యాంకుకు వెళ్ళాలనే లేదా... ఫర్వాలేదు, బ్యాంకులకు వెళ్ళకుండానే చెల్లింపులు, చెక్కు జమలు, బిల్‌ పేమెంట్స్‌, డిడిలు తదితర అన్ని సౌకర్యాలూ మన అరచేతిలోకి రానున్నాయి. ప్రజలను ఈ దిశగా ఆకర్షించేందుకు బ్యాంకులు కూడా తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. కస్టమర్లు బ్యాంకులకు రాకుండా తమ పనులు పూర్తి చేసుకుంటే పలు రకాల బహుమతులు ప్రకటిస్తున్నాయి. ఇదంతా బ్యాంకుల్లో పేపర్‌ వర్క్‌ను మొత్తంగా తగ్గించుకోవడం కోసమే.
మరో రెండు మూడేళ్లలో అన్ని బ్యాంకుల్లో పేపర్‌, పెన్ను కనిపించకపోవచ్చు. అప్పుడు అన్ని పనులూ కంప్యూటర్లపైనే జరుగుతాయి. అంతా ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌పైనే. ఇక కస్టమర్లను బ్యాంకులకు రప్పించడం ఎందుకు వారికి కావలసిన సేవలను వారి వద్దకే తీసుకువెడితే సరి. ఇవే ఆలోచనలను పలు బ్యాంకులు ఇప్పటి నుంచే ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నాయి. ఇంటర్నెట్‌, ఫోన్‌ల ద్వారా బ్యాంకింగ్‌ సేవలను పొందేవారి సంఖ్యను పెంచడం కోసం పలు రకాల రాయితీలను, బహుమతులను బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, హెచ్‌ఎస్‌బిసి, కోటక మహీంద్రా వంటి బ్యాంకులు అకౌంట్‌ హోల్డర్లకు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించేశాయి. డూప్లికేట్‌ స్టేట్స్‌మెంట్స్‌, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌లను మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కోరితే ప్రాసెసింగ్‌ చార్జ్‌లను చాలా వరకూ తగ్గించేశాయి. ఇ-టికెటింగ్‌ విధానంలో, పన్ను చెల్లింపుల్లో, నెట్‌, ఫోన్‌ బ్యాంకింగ్‌లు, ఎటిఎంలలో డబ్బు డ్రా చేయడం తదితర పనులలో బ్యాంకులు వివిధ రకాల క్యాష్‌ బ్యాక ఆఫర్లను ప్రకటించాయి. బస్‌ టిక్కెట్‌ కొనాలన్నా, రైలు టిక్కెట్‌ కొనాలన్నా ఇంటర్నెట్‌పై కూర్చుని క్షణాల్లో తీసుకోవచ్చు. ఆఖరికి మొబైల్‌ ఫోన్‌కు రీచార్జ్‌ చేయాలన్నా, విద్యుత్‌, నీటి బిల్లులు తదితర బకాయిలు చెల్లించాలన్నా ఎటిఎంకు వెళ్తే చాలా పనై పోయినట్టే.
వివిధ బ్యాంకుల ఇస్తున్న రాయితీల్లో కొన్ని ఇవి: వివిధ రకాల బిల్లులను చెల్లించినా, ఎయిర్‌ టిక్కెట్‌లు కొన్నా, పన్ను చెల్లింపులను జరిపినా (ఆన్‌లైన్‌ ద్వారా) స్టేట్‌ బ్యాంక ఆఫ్‌ ఇండియా ప్రతి ట్రాన్స్‌యాక్షన్‌కు 10 నుంచి 50 రూపాయల వరకూ క్యాష్‌ బ్యాక ఆఫర్‌ను ప్రకటించింది. దీనివల్ల ఒక యావరేజ్‌ కస్టమర్‌కు నెలకు రూ. 500 వరకూ మిగులుతుందని ఒక అంచనా.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ను కోరితో రూ.100 చార్జ్‌ చేస్తారు. అదే ఎటిఎం లేదా ఫోన్‌ ద్వారా రిక్వెస్ట్‌ పంపితే కేవలం 50 రూపాయలకు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా అయితే 30 రూపాయలకే డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ మీ ఇంటికి చేరుతుంది. సమీప భవిష్యత్‌లో ఈ ధర మరింతగా తగ్గుతుందని అంచనా.
పేమెంట్‌ ఆర్డర్ల కోసం 50 నుంచి 100 వసూలు చేసే బ్యాంకు అదే సేవలను ఫోన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఉచితంగా అందిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా పేమెంట్స్‌ను ఉచితంగా ఆపివేస్తోంది. హెచ్‌డిఎఫ్‌సిలో బ్యాంకు వద్దకు డిడి కోసం వెడితే 75 రూపాయలు, ఫోన్‌ ద్వారా అయితే 50, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా 30 రూపాయలు వసూలు చేస్తోంది.
హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో డిడి కోసం వెళితే ఆ మొత్తం ఎమౌంటులో 0.3 శాతాన్ని చార్జ్‌ చేస్తుంది. అదే ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్‌ పంపితే డిడి ఉచితంగా మీ చెంతకు వస్తుంది. ఇదంతా కస్టమర్లు బ్యాంకులకు వెళ్ళడాన్ని సాధ్యమైనంత తక్కువ స్థాయికి చేర్చడం కోసమే. బ్యాంకుల్లో ఖాతాదారులకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలికే రోజులకు ఇక స్వస్తే. మీకు దగ్గరలోని ఎటిఎం వద్దనో, లేక ఇంట్లోనే కంప్యూటర్‌ ముందో, లేదా ఆరచేతిలో ఎప్పుడూ ఉండే మొబైల్‌ నుంచో అన్ని రకాల బ్యాంకింగ్‌ సేవలూ అందుతూ ఉంటే ప్రజలు మాత్రం బ్యాంకులకు ఎందుకు వెడతారు!
అదే బ్యాంకుకు కస్టమర్లు పదేపదే వెళ్ళినా నష్టమే. ఒక బ్యాంకు ఏకంగా మూడు నెలల్లో 12 సార్ల కంటే బ్యాంకుకు అధికంగా వస్తే ప్రతి సర్వీసుకు 50 రూపాయలను అధికంగా వసూలు చేస్తామని కూడా ప్రకటించింది.
ఇదంతా కస్టమర్లను బ్యాంకుకు రాకుండా చేయడం కోసమే. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఏ బ్యాంకు కస్టమరైనా ఏ బ్యాంకు ఎటిఎంలోనైనా ఉచితంగా డబ్బును డ్రా చేసుకునే వీలును కల్పిస్తూ ఆర్థికమంత్రి చిదంబరం ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఇక అప్పుడు ఎటిఎం సెంటర్ల ముందు డబ్బు డ్రా కోసం బారులు తీరిన ప్రజలు కనపడరు. ప్రస్తుతం మాత్రం బ్యాలెన్స్‌ ఎంక్వైరీ తదితర పనులు ఏ ఎటిఎం నుంచైనా ఉచితంగా తెలుసుకునే వీలుంది. అయితే, ఈ విధానాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసింది కస్టమర్ల ఐడిలు, పాస్‌వర్డ్‌లు కాపాడుకోవడం లోనే. ఒకసారి పాస్‌వర్డ్‌ ఎవరికైనా తెలిస్తే వారు దాన్ని దుర్వినియూగం చేసే అవకాశాలే ఎక్కువ కాబట్టి ఈ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరం.
- శ్రీనివాసకుమార్‌ మామిళ్ళపల్లి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి