6, జూన్ 2012, బుధవారం

కూలోడి కడుపుకి రు.28, ప్లానింగ్ ఆఫీసర్ టాయిలెట్ కి రు.35 లక్షలు


 
భారత దేశ పల్లెల్లో బతికే కూలోడికి రోజుకి రు. 28 చాలని చెప్పిన ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన కార్యాలయంలో ఆఫీసర్లు వాడే రెండు టాయిలెట్ల ఆధునీకరణ కోసం రు. 35 లక్షలు ఖర్చు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ టాయిలేట్ లో దొంగలు పడతారేమోనని సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టేనట. ఇది సక్సెస్ అయితే ప్లానింగ్ కమిషన్ కార్యాలయం ‘యోజన భవన్’ లో టాయిలెట్లన్నీ అలాగే మారుస్తారట. ప్రజల అవసరాల పట్ల ఇంతకంటే ఛీత్కార భావన మరకటి ఉండబోదు.
సుభాష్ అగర్వాల్ అనే ఆర్.టి.ఐ (సమాచార హక్కు చట్టం) కార్యకర్త కోరిన సమాచారం మేరకు ప్లానింగ్ కమిషన్ ఈ విషయాన్ని వెల్లడి చేయక తప్పలేదు. ‘ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్’ ని ఆదర్శంగా తీసుకుని ఈ ఆధునికీకరణ తలపెట్టారని ఐ.బి.ఎన్ లైవ్ తెలిపింది. టాయిలెట్ ఆధునీకరణకి మొత్తం రు. 30 లక్షలు ఖర్చు కాగా, ఒక్క తలుపు కోసమే 5.19 లక్షలు ఖర్చు చేశారు. అంత ఖర్చు పెట్టి టాయిలేట్ లు నిర్మిస్తే గుమాస్తాలు వాడడానికి వీల్లేదు గనక అందరూ వెళ్లకుండా కంట్రోల్ సిస్టంని తలుపుకి ఏర్పాటు చేశారు. కేవలం స్మార్ట్ కార్డ్ ఉన్నవాళ్లే టాయిలేట్ ని ఉపయోగించేలా ఆ ఏర్పాటు చేశారు.
“డోర్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి రు. 5,19,426 ఖర్చయింది. రెండు టాయిలెట్లను ఆధునీకరించడానికి రు. 30,00,305 ఖర్చయింది” అని సుభాష్ కి వచ్చిన ఆర్.టి.ఐ రిప్లై పేర్కొంది. ప్లానింగ్ కమిషన్ లో మొత్తం 60 మంది అధికారులకి స్మార్ట్ కార్డ్ లు ఇచ్చామని కూడా రిప్లై తెలిపింది. టాయిలెట్ల వరకు వెళ్ళే కారిడార్ లో సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేయనున్నామనీ, టాయిలెట్లలో ఖరీదయిన చిన్న చిన్న పరికరాలు చోరికి గురి కాకుండా ఉండడానికి కెమెరాల అవసరం వచ్చిందనీ కమిషన్ తెలియజేసింది. తాము బడ్జెట్ పరిధిలోనే ఖర్చు పెట్టాము కనక ఇందులో తప్పేమీ లేదని అహ్లూవాలియా బుధవారం పత్రికల వద్ద సమర్ధించుకున్నాడు.
ప్రజల సొమ్ముతో షోకులు చేసుకునే మాంటెక్ సింగ్ ప్రభుత్వ ధనం ఖర్చు చేయడంలో చేతికి ఎముకలేనట్లే వ్యవహరిస్తాడని గతంలో పత్రికలు అనేక దృష్టాంతాలు చూపాయి. ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడికి విదేశీ ప్రయాణాలతో పెద్దగా పని ఉండదు. కానీ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా మాత్రం విదేశీ ప్రయాణాలకి కోట్లే తగలేశాడు. ఆయన 2011 లో మే నుండి అక్టోబర్  వరకూ జరిపిన విదేశీ ప్రయాణాల్లో రోజుకి రు.2.02 లక్షలు ఖర్చు పెట్టాడని ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగించి తెలుసుకున్న సమాచారాన్ని బట్టి వెల్లడయింది. మరో ఆరి.టి.ఐ ఎంక్వైరీ ద్వారా ఆయన జూన్ 2004 నుండి జనవరి 2011 మధ్య కాలంలో 274 రోజుల పాటు 42 సార్లు అధికారిక పర్యటనలు చేసి 2.34 కోట్లు తగలేశాడు. ప్లానింగ్ కమిషన్ అధిపతిగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందని పత్రికలు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వకుండా తనకు ప్రధాని మన్మోహన్ సింగ్ అనుమతి ఉందని దాటవేసిన గొప్ప పొదుపరి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా.
ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఒక వ్యక్తి బతకడానికి రోజుకి 28 రూపాయలు చాలు. భారత దేశంలో సగటు జీవిత కాలం 65 సంవత్సరాలు ఈ లెక్కన ఒక పేదవాడు బతకడానికి జీవితాంతం రు. 6.64 లక్షలు చాలు. 5.3 మంది పేదలు (దరిద్రులు కాదు) బతకడానికి జీవితాంతం అయ్యే ఖర్చుని ప్లానింగ్ కమిషన్ రెండు టాయిలెట్లకోసం ఖర్చు పెట్టేసిందన్నమాట.
సంవత్సర కాలంగా భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు బాగా పడిపోయింది. అందువల్ల ప్రభుత్వ కార్యాలయాలు పొదుపు పాటించాలని ఆర్ధిక మంత్రి ప్రణబ్ చెబుతున్నాడు. బడ్జేట్ ఆమోదం పొందాక లోక్ సభలో ప్రసంగించినపుడు కూడా ఆయన పొదుపు అవసరాన్ని నొక్కి చెప్పాడు. త్వరలో ‘పొదుపు చర్యలు’ అనుసరిస్తామని కూడా చెప్పాడు. ఆ మేరకు మంత్రులు, అధికారులు ప్రయాణాలు తగ్గించుకోవాలనీ, ప్రతి దానికీ సమావేశం అంటూ డబ్బు తగలేయ్యద్దనీ ఆదేశాలు జారీ అయ్యాయని పత్రికలు తెలిపాయి. విమాన ప్రయాణాలు తగ్గించుకోవాలనీ, ఎకానమీ క్లాస్ లో ప్రయాణించాలనీ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపధ్యంలో యోజనా భవన్ లో కేవలం ఒకే అంతస్ధులో, అదీ రెండు టాయిలేట్ గదుల్లో 35 లక్షలు ఖర్చు పెట్టి ఆధునీకరించడం తగునా? 
పేదవాడు బతకడానికి ఒక్కడికి రోజుకు రు.28 చాలని చెప్పిన మాంటెక్ దేశవ్యాపితంగా విమర్శలు వచ్చినప్పటికీ దారిద్ర రేఖ ప్రమాణాలను సవరించవలసిన ఆవశ్యకతను అంగీకరించలేదు. ఎలాగైతేనేం, దరిద్రం తగ్గింది కదా? అని ఆయన ప్రశ్నించినట్లు ఫస్ట్ పోస్ట్ పత్రిక కొద్ది వారాల క్రితం తెలిపింది. అలాంటి మాంటెక్ టాయిలెట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టడం, అక్కడికి ఆఫీసర్లు తప్ప వేరే ఎవ్వరూ వెళ్ళ కుండా కంట్రోల్ వ్యవస్ధ ఏర్పాటు చెయ్యడం చూస్తే ప్రజల సమస్యల పట్లా, వారి అవసరాల పట్లా ఆయనకి ఉన్న ‘ఇన్సెన్సిబిలిటీ’ ని మాత్రమే సూచిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి