19, జూన్ 2012, మంగళవారం

రాష్టప్రతి ఎన్నిక కూడా రాజకీయమేనా?



  • 19/06/2012

దేశ ప్రథమ పౌరుడైన రాష్టప్రతి ఎన్నికను కూడా రాజకీయం చేయటం దురదృష్టకరం. దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే రాష్టప్రతి ఎంపిక ఏకగ్రీవంగా జరుపుకోవటాన్ని ఒక సాంప్రదాయం చేసుకుంటే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమవుతుంది. కానీ మన రాజకీయ పార్టీలు చివరకు రాష్టప్రతి ఎన్నికను కూడా రాజకీయం చేశాయ. కొత్త రాష్టప్రతిని ఏకాభిప్రాయ సాధన ద్వారా ఎన్నుకునేందుకు అవసరమైన సానుకూల రాజకీయ వాతావరణాన్ని సృష్టించకపోవటం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు. రాష్టప్రతి పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని రంగంలోకి దించిన కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల సాధన కోసమే ఇదంతా చేసిందని చెప్పకతప్పదు. రాష్టప్రతి పదవికి ప్రణబ్ అత్యంత అర్హుడు. అతనికి ధీటైన వ్యక్తి మరొకరు ప్రస్తుతం లేరనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ప్రణబ్ ఎప్పుడో ప్రధాని కావలసింది. ఈ పదవి చేపట్టేందుకు అవసరమైన అర్హతలు, అనుభవం మన్మోహన్ సింగ్ కంటే ప్రణబ్‌కే అధికం. అయితే ప్రణబ్ కోటరీ రాజకీయాలకు బలైపోయారు. గతంలో ప్రణబ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా ఆయన కింద పని చేశారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ కోటరీ రాజకీయాల మూలంగా ప్రణబ్‌ను దాటి ముందుకుపోయి రెండుసార్లు ప్రధాని పదవి చేపట్టారు. కాంగ్రెస్ కోటరీ రాజకీయాల మూలంగానే ప్రణబ్ ఐదేళ్ల క్రితం రాష్టప్రతి కాలేకపోయారు. కనీసం ఇప్పుడైనా ఆయన రాష్టప్రతిగా ఎన్నికవుతున్నందుకు సంతోషించాలి. యు.పి.ఏ రాజకీయ పరిణతిని ప్రదర్శించి ఉంటే ప్రణబ్ రాష్టప్రతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశాలు ఉండినాయి. రాష్టప్రతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు యు.పి.ఏ మిత్రపక్షాలతో నెలా పదిహేను రోజుల క్రితమే మంతనాలు ప్రారంభించింది. యు.పి.ఏలోని భాగస్వామ్య పక్షాలతో సోనియా గాంధీ చర్చించటంతో పాటు ములాయం సింగ్‌తోనూ మంతనాలు జరిపారు. అయతే ఇలాగే ఎన్.డి.ఏ మిత్రపక్షాలతో కూడా ముందే చర్చలు జరిపితే ఎంతో బాగుండేది. సోనియా గాంధీ విశాల రాజకీయ దృక్పథంతో వ్యవహరించి ఉంటే కొత్త రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు అవకాశం ఉండేది. ప్రణబ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసిన అనంతరం ఎన్.డి.ఏ మిత్రపక్షాల మద్దతు కోరటం పార్టీ రాజకీయమే అవుతుంది తప్ప రాజకీయ విశాల దృక్పథం కానేరదు. ఇప్పుడు బి.జె.పి కూడా పోటీ కోసం పోటీ పెట్టాలని ఆలోచించటం మంచి విధానం కాదు. ప్రణబ్ రాష్టప్రతి పదవికి అన్ని విధాలా అర్హుడనేది ఎన్.డి.ఏ నాయకులందరికి బాగా తెలిసిన విషయమే. ఓటు ఎవరికి వేయాలనే అంశాన్ని ఎన్.డి.ఏ ఎం.పిలకు వదిలివేస్తే మెజారిటీ ఎం.పిలు ప్రణబ్ ముఖర్జీకే వేస్తారనేది పచ్చి నిజం. అందుకే బి.జె.పి నాయకత్వం నామమాత్రపు పోటీ కోసం లోక్‌సభ మాజీ స్పీకర్, గిరిజన నాయకుడు పి.ఏ. సంగ్మా లేదా మాజీ రాష్టప్రతి ఏ.పి.జె.అబ్దుల్ కలాంను రంగంలోకి దించకూడదు. రాష్టప్రతి పదవికి కూడా పోటీ కోసం పోటీ పెట్టటం మంచి విధానం అనిపించుకోదు. ప్రధాన ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకుండా కాంగ్రెస్ చేసిన తప్పునే పోటీ పెట్టడం ద్వారా బిజెపి చేయకూడదు. రాజకీయ విశాల దృక్పథాన్ని ప్రదర్శించటం ద్వారా బి.జె.పి రాజకీయ పరిణతిని చాటుకోవటం మంచిది. ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని సమర్థించే విషయంలో సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌లు తమ రాజకీయ అవకాశవాదం, వ్యక్తిగత అయిష్టాలకు పెద్ద పీట వేసి నవ్వుల పాలయ్యాయి. ములాయం మొదట ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి ఆ తరువాత తెర వెనుక రాజకీయం జరిగిన అనంతరం సమర్థించటం ద్వారా తన ఊసరవెల్లి రాజకీయాలకు అద్దం పట్టారు.
ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే ఆమె తన దుందుడుకు రాజకీయం మూలంగా ఏకాకిగా మారిపోయారని చెప్పక తప్పదు. మొదటిసారి ఒక బెంగాలీ, అందునా ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్ నాయకుడు రాష్టప్రతి పదవి చేపట్టేందుకు అవకాశం వస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రయన మమత గట్టిగా వ్యతిరేకించటంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టటం శోచనీయం. ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేందుకు మమత చూపించిన కారణాలు ఆమె ఫ్యాక్షన్ రాజకీయ మనస్తత్వానికి అద్దం పట్టాయి. రాష్టప్రతి పదవి చేపట్టే వ్యక్తి నీతి నిజాయితీకి మారుపేరై ఉండాలి, మర్యాదకు అద్దం పట్టాలంటూ ఈ లక్షణాలు ప్రణబ్ ముఖర్జీలో లేవంటూ పరోక్షంగా దుమ్మెత్తిపోయటం, విమర్శించటం సిగ్గు చేటు. భారత పార్లమెంటు చరిత్రలో ప్రణబ్ ముఖర్జీకి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడిందనేది అందరు ఒప్పుకునే నిజం. మమత తన వ్యక్తిగత కక్షతో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించటం ఏ విధంగా సమర్థనీయం అవుతుంది? రాష్టప్రతి ఎన్నికకు పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం ఆర్థిక సహాయం చేయటానికి లింకు పెట్టటం మమత చేసిన అతిపెద్ద తప్పు. రాష్టప్రతి పదవికి ఎన్నికయ్యే వ్యక్తి నీతి, నిజాయితీకి కట్టుబడి ఉండాలనుకునే వారు తాము కూడా నీతి, నిజాయితీతో పని చేయకూడదా? రాష్టప్రతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు ఆర్థిక సహాయం డిమాండ్ చేయటం, వడ్డీ మాఫీ చేయాలని షరతు పెట్టటం ఏ విధంగా నిజాయితీ అవుతుందనేది మమతా బెనర్జీ వివరిస్తే బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి