ప్రధాని
మన్మోహన్ సింగ్ అవినీతిపరుడు కాకపోతే తమ కంటే సంతోషించేవారు లేరనీ, అయితే ఆ
సంగతి విచారణ జరిపించుకుని నిరుపించుకోవాల్సిందేనని అన్నా బృందం స్పష్టం
చేసింది. స్వతంత్ర దర్యాప్తు జరిపించుకోవాలని అన్నా బృందం డిమాండ్ చేసింది.
ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేసింది తాము కాదనీ, రాజ్యాంగ సంస్ధ కాగ్
నివేదిక ద్వారానే తాము మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు.
“తనపై కేశినా ఆరోపణలు
ఆధారహితమనీ, దురదృష్టకరమనీ, బాధ్యతారాహిత్యమనీ ప్రధాన మంత్రి అన్నారు.
మేమాయనకి ఒక విషయం చెప్పదలిచాం. ఆరోపణలు ఎక్కుపెట్టింది రాజ్యాంగ సంస్ధ
కాగ్ తప్ప మేము కాదు” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నాడని ‘ది హిందూ’
తెలిపింది. “ప్రధాని పై ఆరోపణలు తప్పయితే మేము చాలా సంతోషిస్తాం. కానీ
అదెలా రుజువవుతుంది? అందుకోసం స్వతంత్ర దర్యాప్తు సంస్ధ దర్యాప్తు జరపాలి”
అని అరవింద్ అన్నాడు. కోల్ బ్లాకుల కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకి 1.8
లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని నివేదిక ఇచ్చిన కాగ్ ది బాధ్యతారాహిత్యం
అని ప్రధాని చెప్పదలిచారా అని ఆయన ప్రశ్నించాడు.
అన్నా బృందం ఆరోపణలకు
ప్రధాని ఇచ్చిన స్పందనను ఉద్దేశిస్తూ అన్నా బృందం పై ప్రశ్నలు సంధించింది.
అన్నా బృందం ఆరోపణలకు ప్రధాని స్పందిస్తూ “అందులో వీసమెత్తు నిజం
ఉన్నట్లయితే నేను ప్రజా జీవితాన్ని వదులుకుంటాను. దేశం నాకు ఏ శిక్ష అయినా
వేయవచ్చు” అన్నాడు.
ప్రధాని స్పందన లో ఏ
మాత్రం నిర్దిష్టత లేదు. ఆరోపణలు నిజం అయితే ప్రజా జీవితం నుండి ఆయన
తప్పుకోవలసిన అవసరం లేదు. కోర్టులే ఆ పని చేస్తాయి. శిక్ష వేయాల్సింది
కోర్టులు తప్ప దేశం కాదు. అలాంటి నిర్దిష్టతలోకి పోకుండా దేశం శిక్ష
వేసుకోవచ్చని స్పందించడమే బాధ్యతారాహిత్యంగా కనిపిస్తోంది. దేశం అంటే ఎవరని
ప్రధాని ఉద్దేశ్యం? ఆరోపణలపై విచారణ చేసే సంగతి చెప్పకుండా, కాగ్ నివేదిక
గురించి మాట్లాడకుండా నివేదిక తమకు అందలేదని చెబుతూ ‘దేశం శిక్ష
వేసుకోవచ్చ’ని అనిర్ధిష్టంగా చెప్పడంలో ప్రధాని ఉద్దేశ్యం అర్ధం కావడం
లేదు.
టీం అన్నా బృందంలో మరో
సభ్యుడు కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే ప్రధాని పై ఆరోపణలపై
స్పంధించాడు. “ప్రధాన మంత్రిని ఇన్ని సంవత్సరాలూ చూశాక డా. సింగ్ పై అన్నా
బృందం చేసిన ఆరోపణలు నమ్మడం కష్టంగా ఉంది. కానీ అదే సమయంలో ఎవరైనా ఆరోపణలు
డాక్యుమెంటరీ రూపంలో ఉన్నాయని చెబితే విచారణ జరపాక తప్పదని నా అభిప్రాయం”
అని హెగ్డే అన్నాడు. అయితే తాను ఏ డాక్యుమెంటు చూడలేదని ఆయన అన్నాడు.
ఈ సందర్భంగా అరవింద్
చెప్పిన కొన్ని మాటలు భేషుగ్గా ఉన్నాయి “మేము సామాన్య ప్రజలకు చెందినవారం.
అవినీతి వల్లా, ధరల పెరుగుదల వల్లా ప్రభావితం అయినవారం. దేశంలో ఉన్నటువంటి
తరహా రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాం. నేటి రాజకీయాలు ఏమిటంటే పిల్లల నుండి
కూడు లాక్కోవడం, రైతులను ఆత్మహత్యలు చేసేలా పురికొల్పడం, అదే సమయంలో
కొంతమంది మంత్రులు కుంభకోణాలకు పాల్పడి మరింత ధనికుల కావడానికి అనుమతి
ఇవ్వడం” అని ఆయన చెప్పిన మాటలు సత్యం.
అన్నా బృందం ప్రధాని పై
ఆరోపణలు ఎక్కుపెట్టడం తమిళనాడు అవినీతి పోరాట యోధుడు జనతా పార్టీ నాయకుడు
సుబ్రమణ్య స్వామి కి రుచించినట్లు లేదు. అవినీతి చట్టంలోని ఏ సెక్షన్
ప్రకారం ప్రధానిపై విచారణ చేయాలో అన్నా బృందం చెప్పలేదని ఆయన అభ్యంతరం
చెప్పాడు. కాగ్ నివేదిక అంశాలు ఎత్తి చూపుతున్నా కోర్టు బాష తప్ప మరొకటి
మాట్లాడకూడదు అన్నట్లుంది ఆయన ధోరణి. మరో అడుగు ముందుకేసి స్వామి వారు
అన్నా బృందాన్ని వదిలి బైటికి రావాలని నేరుగా అన్నా హజారేకి సలహా
ఇచ్చేశారు. “నగ్జలైట్-మైండెడ్ పిచ్చివాళ్ళను వదిలి” తనతోనూ, రాందేవ్ తోనూ
కలవాలని గొప్పలు పోయాడు.
అలాంటి వాటికి తాను
స్పందించనని అరవింద్, స్వామి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ చెప్పాడు. ప్రధాని
మన్మోహన్ తనపై వచ్చిన చార్జి షీటు ను బాధ్యతా రాహిత్య ఆరోపణలుగా చెప్పే
ముందు డాక్యుమెంటును చూసి పాయింట్ల వారీగా నిజాల వారీగా స్పందించాలని
కోరాడు.
ప్రధాని సామాన్యుడు
అంటూ అన్నా హజారే చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం. అన్నా బృందం ప్రధాని
పై ఆరోపణలు ఎక్కుపెట్టాక అన్నా ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని పై ఆరోపణలను
నమ్మే స్ధితిలో హెగ్డే లేడు. ఈ లెక్కన ప్రధానిపై అన్నా బృందం ఆరోపణలు
ఎవరైనా పట్టించుకునే పరిస్ధితి ఉన్నదా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి