ఇరాన్
క్రూడాయిల్ దిగుమతుల విషయంలో ఇండియా పై జరుగుతున్న ప్రతికూల ప్రచారం పనికి
రాదని అమెరికాలో భారత రాయబారి నిరుపమా రావు అభ్యంతరం తెలిపారు. 120 కోట్ల
మంది ప్రజల ఎనర్జీ అవసరాలను తీర్చవలసిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందన్న
సంగతి గ్రహించాలని ఆమె అమెరికాకి పరోక్షంగా సూచించింది. ఐక్యరాజ్య సమితి
ఆంక్షలను తు.చ తప్పకుండా పాటిస్తున్నామనీ, అమెరికా ఆంక్షలను కూడా దృష్టిలో
పెట్టుకుని ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులనూ తగ్గించామనీ ఆమె వివరించారు.
ఇరాన్ క్రూడాయిల్ పట్ల
అమెరికాకి ఉన్న అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకున్నామనీ, దిగుమతులు
తగ్గిస్తున్నామనీ భారత ప్రభుత్వం చెబుతోంది తప్ప పశ్చిమాసియాలో ఉన్న 60
లక్షల మంది భారతీయుల ప్రయోజనాల కోసం, ఆ ప్రాంత దేశాలతో ఇండియాకి ఉన్న
వ్యాపార సంబంధాలను కాపాడుకోవడం కోసం, మొత్తంగా భారత ప్రజల ఎనర్జీ ప్రయోజనాల
కోసం అమెరికా విధించిన ప్రైవేటు ఆంక్షలను అమలు చేయలేమని నిర్దిష్టంగా భారత
ప్రభుత్వం చెప్పలేకపోవడం గర్హనీయం.
“ఈ సంగతి చెప్పడానికి
బాధగా ఉంది. కారణాలేమిటో తెలియదు గానీ భారత దేశాన్ని ప్రతికూల రంగుల్లో
చూపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని నిరుపమా రావు ‘అట్లాంటిక్
కౌన్సిల్’ లో సమావేశంలో ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అన్నారు. తన విస్తృతమైన
ఇంధన ప్రయోజనాల దృష్ట్యా, ఇరాన్ అంశంలో భారత దేశం చాలా పారదర్శకంగా
వ్యవహరిస్తున్నదనీ ఆమె నొక్కి చెప్పింది. కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా
ఇరాన్ ఆయిల్ దిగుమతులకు రహస్యంగా చెల్లింపులను ఇండియా జరుపుతోందన్న
ఆరోపణలను ఆమె ఖండించింది. తమ భాగస్వాములందరితోనూ నిజాయితీగా
వ్యవహరిస్తున్నామని తెలిపింది.
“భారత దేశానికి ఎనర్జీ
బధ్రతా అవసరాలున్నాయి. అయినా ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులకు కొన్ని నిబంధనలు
ఉన్నాయని మేము అర్ధం చేసుకున్నాం. ఈ వాస్తవాలు మా దృష్టిలో ఉన్నాయి. ఇరాన్
నుండి ఆయిల్ దిగుమతులు తగ్గిపోయాయి కూడా” అని నిరుపమా రావు పేర్కొన్నారు.
“మేము నికరంగా ఆయిల్
దిగుమతి చేసుకునే దేశం. 75 శాతం ఆయిల్ దిగుమతి కావలసిందే. ఇండియాకి
సంప్రదాయక ఆయిల్ సరఫరా దారుల్లో ఇరాన్ కూడా ఒకటి. మా రిఫైనరీల్లో అత్యధికం
ఇరాన్ క్రూడాయిల్ ను శుద్ధి చేయడానికి నిర్మించినవే. కానీ నేటి పరిస్ధితులు
ఇరాన్ నుండి దిగుమతి చేసుకోవడానికి ఏ దేశానికైనా కష్టంగా మారాయి” అని
నిరుపమా రావు చెప్పారు.
“అమెరికా అభ్యంతరాలను
కూడా దృష్టిలో ఉంచుకున్నాం. ఇరానియన్ అంశంపై ఆ దేశంతో దగ్గరి సంబంధంలో
ఉన్నాం. ఇండియా మొత్తం క్రూడ్ దిగుమతుల్లో ఇరాన్ భాగం స్ధిరంగా తగ్గుతూ
వస్తోంది. 2008-09 లో 16 శాతం దిగుమతులు ఇరాన్ నుండి రాగా అది 2011-12
నాటికి 10 శాతానికి తగ్గిపోయింది” అని నిరుపమ వివరించారు.
అణు శక్తిని శాంతియుత
ప్రయోజనాలకు వినియోగించుకునే హక్కు ఇరాన్ కి ఉన్నదనీ అయితే ఆ దేశం
ఆమోదించిన ఒప్పందాలను గౌరవించాలని ఇండియా అభిప్రాయంగా నిరుపమ పేర్కొన్నారు.
అమెరికా ఒత్తిడికి లొంగి ఇరాన్ నుండి క్రాడాయిల్ దిగుమతులను భారత్
తగ్గించుకుంటున్నాడని నిరుపమా రావు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్.పి.టి ఒప్పందం
ప్రకారం ఇరాన్ అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం వినియోగించే హక్కు కలిగి
ఉంది. అణు పెత్తనం చేస్తున్న అమెరికా, ఇ.యులు ఇరాన్ హక్కుని
నిరాకరిస్తున్నాయి. కుంటిసాకులు చూపి ఇరాన్ ని ఆర్ధికంగా, సైనికంగా
లొంగదీయడానికి ప్రయత్నిస్తున్నాయి. మరో వైపు అణ్వస్త్ర వ్యాప్తికి
సంబంధించి ఏ ఒప్పందానికీ కట్టుబడకపోయినా ఇజ్రాయెల్ అణ్వస్త్రాలను చూసి
చూడనట్లు ఉన్నాయి. ఇలాంటి ఆధిపత్య రాజకీయాలనూ, ప్రయత్నాలను నిర్ణయాత్మకంగా
భారత ప్రభుత్వం ఖండించలేకపోతున్నది. ఫలితంగా తన ఎనర్జీ ప్రయోజనాలను
కాపాడుకోవడంలోనూ నిర్ణయాత్మకంగా వ్యవహరించలేకపోతున్నది.
-ది హిందూ, అట్లాంటిక్ కౌన్సిల్ వెబ్ సైట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి