28, జూన్ 2012, గురువారం

లైసెన్స్ ఫీజుగా 2550 కోట్ల రాబడి



  • 28/06/2012
హైదరాబాద్, జూన్ 27: మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు జారీ చేసేందుకు నిర్వహించిన లాటరీ ప్రక్రియ మంగళవారం ముగిసింది. లాటరీలో ఎంపికైన మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి లైసెన్స్‌ల ఫీజు రూపేణ రూ. 2550 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆబ్కారి శాఖ లెక్క తేల్చింది. లైసెన్స్‌ల రూపేణ రూ. 2550 కోట్లు, దరఖాస్తుల రుసుం రూపేణ రూ. 170 కోట్లు మొత్తంగా కలిపి రూ. 2750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ నెలాఖరుకు ముగిసి పోనున్న మద్యం విధానంలో లైసెన్స్‌ల ఫీజు రూపేణ రూ. 2900 కోట్ల ఆదాయం రాగా, అది కొత్త విధానంలో రూ. 125 కోట్లు తగ్గింది. వేలం పాటల ద్వారా కాకుండా, స్థిర లైసెన్స్ విధానం ద్వారా మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో కుప్పలు తెప్పలుగా 68 వేల పైచిలుకు దరఖాస్తులు రావడంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇంకా 893 మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకపోవడంతో వీటికి తిరిగి లైసెన్స్‌లు జారీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. వీటికి కూడా లైసెన్స్‌ల రూపేణ మరో ఐదు, ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆబ్కారి అధికారులు అంచనా వేస్తున్నారు. వీరి అంచనా ప్రకారం రెండవ నోటిఫికేషన్ ద్వారా కేటాయించే దుకాణాలతో కలిసి లైసెన్స్‌ల రూపేణ రూ. 3500 కోట్ల ఆదాయం రానుందని అంచనా వేస్తున్నారు. ఇది వేలం పాటల ద్వారా నిర్వహించిన మద్యం దుకాణాలకు వచ్చిన లైసెన్స్ ఫీజు కంటే సుమారు నాలుగు, ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కువ.
రాష్టవ్య్రాప్తంగా 6596 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, 5703 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన 893 మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆబ్కారి శాఖ నిర్ణయించింది. రీ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు కోరే దుకాణాలకు జూలై 3వ తేదీన లాటరీ నిర్వహించి ఎంపిక చేయాలని ఆబ్కారి శాఖ నిర్ణయించింది. రీ నోటిఫికేషన్‌కు కూడా స్పందన రాని దుకాణాలను ఆంధ్రప్రదేశ్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మద్యం విధానం ప్రకారం.. మద్యం దుకాణాల పని వేళలను మార్చుతూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఈ పని వేళలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉండేవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి