డెక్కన్ మినరల్స్ సంస్థకు గనుల కేటాయింపులు జరుపుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమో 130 55 రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని పిటిషనర్‌దారులు తెలిపారు. మంత్రులు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించారని, ఇది చెల్లదని పిటిషన్‌లో పేర్కొన్నారు. బనగానపపల్లె మండలం పలుకూరు గ్రామంలో ఉన్న సర్వే నెంబరు 284/2, 285లో నాపరాయికి చెందిన గనుల లీజుకు సంబంధించిన విషయంలో వివాదం నెలకొంది. 2011 అక్టోబర్ 24న గనులశాఖ మంత్రి ఈ లీజులను అనుమతించారు. గనుల అనుమతి కోసం న్యాయశాఖ మంత్రి ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
చిక్కుల్లో ఏరాసు
కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల కర్నాటక రాష్ట్ర మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి బెయిలు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి, ఈసారి డోన్ నియోజకవర్గంలోని గనుల కేటాయింపుల వివాదంలో ఇరుక్కోవడం చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ, రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కుటుంబానికి డోన్ నియోజకవర్గంలో సున్నపురాయి గనులున్నాయి. ఏరాసు రాజకీయాల్లోకి రాకముందునుంచి గనుల వ్యాపారాన్ని కుటుంబీకులతో కలిసి నిర్వహిస్తున్నారు. వ్యాపార నిర్వహణ కోసం డోన్‌లో ఆయనకు ఎప్పటినుంచో సొంత ఇళ్లు కూడా ఉంది. డోన్, బనగానపల్లె నియోజకవర్గాల పరిధిలో గనులు ఉన్నాయి. అయితే గనుల కేటాయింపు విషయంలో అక్రమాలు జరిగాయని ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం మంత్రి ఏరాసుతోపాటు కేసుతో సంబంధాలున్నాయన్న ఆరోపణల మీద మంత్రి గల్లా అరుణకుమారికి నోటీసులు జారీ చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి