1, జూన్ 2012, శుక్రవారం

ఆఫ్ఘన్‌ మహిళల్లో భయం...భయం


  • అప్పుడూ ఇప్పుడూ అభద్రతే
తాలిబన్లు తిరిగి తమ దేశాన్ని ఆక్రమించుకుంటారన్న భయంతో ఆఫ్ఘన్‌ మహిళలు అనేక మంది దేశం వదిలి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. గతంలో మహిళల హక్కులను కాలరాసిన తాలిబన్లు తిరిగి తమను వేధింపులకు గురిచేస్తారన్న భయం ఇక్కడి యువతుల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహిళలకు సమాన హక్కులు కల్పించే అంశంలో ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి చిత్తశు ద్ధి లేకపోవటం, పని ప్రదేశాల్లో మహిళలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టటంలో వైఫల్యం వంటి అంశాలు ఈ భయాందోళనలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దీంతో 2014లో నాటో దళాలు తమ దేశం వదిలి వెళ్లిపోక ముందే తాము సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని అధికశాతం మంది యువతులు భావిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆఫ్ఘన్‌లో జరిగిన దాడుల్లో అనేకమంది పౌరులు మరణించటం, గాయపడటం తెలిసిందే. ఈ సంఖ్య ఏటికేడాది పెరుగుతుండటంతో అనేక మంది మహిళలు విద్యను, ఉద్యోగాలను వదిలి ఇంటి వద్దే వుంటున్నారని అధ్యక్షుడు హమీద్‌ కర్జారు సలహాదారు గుహ్రా మానా కాకర్‌ వివరించారు. ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తాలిబన్లు, ఇతర తీవ్రవాద గ్రూపులతో జరుపుతున్న చర్చల్లో మహిళల హక్కులు విస్మరణకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల జరిపిన ఒక సర్వేలో దాదాపు 86 శాతం మంది మహిళలు మళ్లీ తాలిబన్‌ తరహా పాలన తమకు రాబోతోందన్న భయాందోళనలు వ్యక్తంచేశారు. దశాబ్ద కాలం క్రితం పరిస్థితులతో పోలిస్తే తమ కుమార్తెల జీవితాలు ఇప్పుడు 72 శాతం మేర మెరుగ్గా వున్నాయని వారు చెబుతున్నారు. గత పదేళ్లలో సాధించిన ప్రగతిని ఇకపై కూడా కొనసాగించాలని ఆఫ్ఘన్‌ మహిళలు కోరుకుంటున్నారని, అయితే వారు ఇప్పటికీ రాజకీయ ప్రక్రియకు దూరంగానే వుంటున్నారని కాకర్‌ వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళలు, పురుషులు అందరూ విదేశీ సేనలు లేని దేశాన్ని కోరుకుంటున్నారని, అయితే అంతర్జాతీయ సమాజం మహిళల హక్కులను, వారి భద్రతను ప్రధాన అజెండాగా పెట్టి వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా భద్రతను సమకూర్చాలని అన్నారు. మహిళలకు పని ప్రదేశాలలో వేధింపులు సర్వసామాన్యంగా మారాయని, వారు సాధించిన విజయాలను పురుషులు తమ ఖాతాల్లో వేసుకుంటున్నారని, అంతేకాక విధి నిర్వహణ/పాఠశాలలకు వెళ్లే మహిళలను తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని వివరించారు. ఇంటిలో సైతం వారికి భద్రత కరువైందని, వారికి నిత్యం హింస, అత్యాచారాలే ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కర్జారు సర్కారు తాలిబన్లతో జరుపుతున్న చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొంటున్న కాకర్‌ అధిక సంఖ్యలో మహిళలను రాజకీయాల్లోకి అనుమతించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. తమ పార్లమెంట్‌లో అనేక మంది మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్నా వారికి తగిన ప్రాధాన్యత దక్కటం లేదన్నారు. మరింతమంది మహిళలకు రాజకీయ రంగంలో అవకాశం కల్పిస్తే తీవ్రవాదులు వారి హక్కులను కాలరాయలేరని, గత పదేళ్ల కాలంలో సాధించిన విజయాలను మార్చలేరని స్పష్టం చేశారు. మహిళలపై అనునిత్యం పెరుగుతున్న హింస, వారు భద్రత కోసం కోర్టులను ఆశ్రయించటం వంటి ఘటనలు పసిపిల్లలపై అత్యాచారాలకు దారి తీస్తున్నాయని పలువురు వాపోతున్నారు. బాలికలు, యువతులకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయినులపై భౌతిక దాడులు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ సర్వే నిర్వహించిన యాక్షన్‌ ఎయిడ్‌ సంస్థ ప్రతినిధి మెలానీ వార్డ్‌ చెప్పారు. మహిళలపై పెరుగుతున్న దాడులు తాలిబన్లు తిరిగి తమ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారన్న భయాందోళనలకు దారి తీస్తున్నాయని కాబూల్‌కు చెందిన హ్యూమానిటేరియన్‌ అసిస్టెన్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సెలే గఫార్‌ చెప్పారు.

ఈ భయాందోళనల కారణంగానే అనేక మంది యువతులు, మహిళలు దేశం వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, ఆఫ్ఘనిస్తాన్‌లోనే వుంటే తమ భవిష్యత్తు అంధకారబంధు రమవుతుందని వారు భయపడుతున్నారని వివరించారు. మహిళలకు సహాయం చేసేందుకు ప్రయత్నించే అనేక స్వచ్ఛంద సంస్థలు మూతబడిపోయాయి. అంతర్జాతీయ సమాజం నుండి మహిళల అభ్యున్నతి కోసం అందిన, అందుతున్న కోట్లాది డాలర్ల నిధులు రాజకీయవేత్తల జేబుల్లోకి వెళ్తున్నాయి తప్ప ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి