28, జూన్ 2012, గురువారం

భలే చాన్స్!


  • -సాక్షి
  • 26/05/2012
పనిమంతుడు పందిరివేస్తే పిచ్చుకలు వచ్చి కూలదోశాయట. జగన్ అనే నరాధముడిని రాజకీయంగా వధించటానికి తెలుగుదేశం కౌటిల్యుల లోపాయకారీ సాయంతో కాంగ్రెస్ పెద్ద దిక్కులు వేసిన సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ జయప్రదంగా అడ్డం తిరిగింది. తెలివిమీరిన సర్కారువారు వై.ఎస్.జూనియర్‌ని కేసుల ఉచ్చులో ఇరికించబోయి తామే ఇరుక్కున్నారు. తాము తీసిన గోతిలో తామే పడ్డారు.
చెరుూ్య మనదే, కత్తీ మనదే కాబట్టి పీక కోసుకున్నా ఏమీ కాదని పాలక మారాజులకు మా చెడ్డ నమ్మకం. కేసులు పెట్టించిందీ మనమే, వాటి దుంపతెంచేదీ మన పెంపుడు సిబిఐయే కాబట్టి మనం ఎలా ఆడినా చెల్లుతుందని ప్రభువులు మహాధీమాగా ఉన్నారు. వారి అతి విశ్వాసమే ఇప్పుడు కొందరు మంత్రులకూ మొత్తంగా కాంగ్రెసు సర్కారుకూ కొంప ముంచుతోంది.
తెలంగాణ ఉప ఎన్నికల పరాభవం నుంచి తేరుకోకుండానే పులిమీద పుట్రలా సీమాంధ్ర ఉప ఎన్నికలొచ్చాయి. వాటిలో పరువు దక్కితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు. విచిత్ర విన్యాసాలు ఎన్ని చేసినా కాంగ్రెసుకూ, కొన్ని విషయాల్లో దాని వ్యూహాత్మక రహస్య భాగస్వామి తెలుగుదేశానికీ కనీసం డిపాజిట్లు దక్కే గ్యారంటీ లేదని ‘దేశం’ మార్గదర్శులు, కాంగ్రెసు కుశాగ్రబుద్ధులు చేయించిన రహస్య సర్వేల్లో తేలిందట. ఎక్కడచూసినా జగన్ గాలే వీస్తూండటంతో, ఆ గాలిని బంధించి, ఎలాగైనా అతగాడిని ఉప ఎన్నికల రంగం నుంచి తప్పిస్తే తప్ప లాభం లేదని ఏలినవారికి అమోఘమైన ఐడియా వచ్చింది.
ఆ ముచ్చట తీరాలంటే సిబిఐ ఆల్సేషియన్లని ఉసికొలిపి శత్రువును ‘లోపల’ వేయించటమే వాటమైన ఉపాయం. ‘పైవాళ్ల’ కనుసన్నల్లో దర్యాప్తు తతంగం 9 నెలలుగా జరుగుతున్నా... అసలు కథానాయకుల జోలికి పోనివారు... నెంబర్‌వన్ నిందితుడిని ఒక్కసారైనా పిలవనంపకుండానే ఒకే కేసులో ఇప్పటికి మూడు చార్జిషీట్లు వేసేసిన వారు... వాటిపై సమన్లు అందుకుని రేపో మాపో కోర్టులో హాజరుకానున్న తరుణంలో - ఆదరాబాదరా అతడిని అరెస్టు చేస్తే గవర్నమెంటు ఇరుకునపడవచ్చు. ఒక్కడిమీద కక్ష కట్టారన్న చెడ్డపేరు రావచ్చు.
మరి ఏమి చేయాలి? అతడికంటే ముందు తమలో నుంచి ఒకరిద్దరు మంత్రులను అరెస్టు చేయించాలి. చూశారా, అంతటి వారినే వదల లేదు. కాబట్టి మాకు పక్షపాతం, కక్షపాతం ఏమీ లేదు అని వెర్రిజనాన్ని నమ్మించి, ఆ తరవాత అసలు విరోధిని జైల్లో వెయ్యాలి. చదరంగం ఆటలో రాజును కట్టెయ్యటానికి ఒక పావును బలి ఇస్తారే... అలాగన్నమాట!
ఆలోచన ఏడ్చినట్టే ఉంది. తొలి బలికి ఎంచుకున్నది ఒక బి.సి. మంత్రిని! దాంతో బి.సి. వర్గాలు భగ్గుమన్నాయి. మంత్రి నియోజకవర్గంలోని అభిమానులైతే చెలరేగి బస్సులు, ఆస్తులు తగలబెట్టేశారు. బి.సి. మంత్రిని వేసేసినందుకు బి.సి.లు గోల పెట్టారు కనుక, వారి ఓట్లు చాలా అవసరం కనుక, వారిని సముదాయించటానికి సెకండ్ రౌండులో ఒక రెడ్డి మంత్రిని జైలుకు పంపాలని - అనుకుంటున్నారట. దానిమీద ఆ కులపోళ్లు మండిపడితే ముచ్చటగా మూడోకులం మంత్రిని బలిపీఠం ఎక్కిస్తారేమో!!
పావు శతాబ్దం కింద జగమొండి ఎన్టీ రామారావు తన కేబినెట్ మంత్రిమీదే ఎ.సి.బి. చేత వలపన్నించి, అవినీతి కేసులో అరెస్టు చేయిస్తే లోకమంతా ఓహో అంది. ఇప్పుడు మహానాయకుడు కి.కు.రెడ్డి తన కేబినెట్ మంత్రికి మొండి చెయ్యి చూపి, ఇంకో రకం అవినీతి కేసులో అరెస్టు కానిస్తే అదే లోకం దుమ్మెత్తిపోస్తున్నది. దానికి లోకుల్ని నిందించి ప్రయోజనం లేదు.
కేబినెట్ మంత్రిని సిబిఐ అరెస్టు చేసింది ఎవరిదగ్గరో లంచం పట్టి అడ్డమైన మేలేదో చేసినందుకు కాదు. కేబినెటు ఆమోదించిన విధానం మేరకు ఎవరికో ఏదో ఉపకారం చేసే జీవోలకు ముఖ్యమంత్రి ఆదేశిస్తే మమ అన్నందుకు! కేబినెట్ నిర్ణయాలను అమలుచేసిన నేరానికి మంత్రులను బలి ఇస్తూపోతే మంత్రివర్గ సమష్టి బాధ్యత సూత్రం ఏ గంగలో కలిసినట్టు? అధికారపక్షం అధినాయకత్వానికి గిట్టని ఒక్క తిరుగుబాటుదారును తిప్పలు పెట్టటంకోసం, అతడిని, అతడి తండ్రిని నేరస్థులుగా చిత్రించటం కోసం... పూర్వమున్నదీ తమ పార్టీ ప్రభుత్వమేనని మరచి, దానిలో భాగస్వాములైన ప్రస్తుత మంత్రులను జైలుకు పంపితే పోయేది పాలకపక్షం పరువేకదా? ఎవరికో అనుచిత లబ్ధి చేకూర్చిన నిర్ణయాలకు బాధ్యుడైన ముఖ్యమంత్రి మరణించి ఉండవచ్చు. కాని ఆయన పనుపున అన్ని వ్యవహారాలూ చక్కబెట్టిన ‘‘ఆత్మ’’ ఇప్పటికీ మన మధ్యనే ఉన్నది కదా? మంత్రుల మీదా, ఐఎఎస్ అధికారుల మీదా ప్రతాపం చూపి అరెస్టులు చేయించే సర్కారు... వారి నెత్తిన కూచుని, మెడలు వంచి జీవోలు జారీ చేయించుకున్న అసలు సూత్రధారి ఊసే ఎత్తదేమి? పైవారి అండ ఆత్మగారికి ఉన్నందు వల్లేనా? ఇలా మనిషినిబట్టి వైఖరి మారుస్తూ పోవటంవల్లే కదా సిబిఐకి ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’గా పేరొచ్చింది?
పోనీ ఇంతగా విధంచెడ్డా జగన్ అనే వాడి నోరు నొక్కేసిన ఫలం దక్కిందా? ఆ కుర్రవాడిని తన మానాన తాను ప్రచారం చేసుకోనిచ్చి ఉంటే ఆ ప్రభావమేదో ఆయా నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యేది. మిగతా దేశం అతడి మాటల మీద పెద్దగా దృష్టి పెట్టేదికాదు. ఎక్కడో ఒక జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఒకే మూస ప్రచారం చేసుకుంటున్న వాడిని తీరి కూర్చుని హైదరాబాదుకు పిలిపించి, అతడేదో అమెరికా ప్రెసిడెంటు అయిన లెవెల్లో భారీ బందోబస్తులు చేసి, రాష్టమ్రంతటా రెడ్ అలర్ట్ ప్రకటించి, సిబిఐ అడ్డాలో అతడి ప్రశ్నోత్తరాల కార్యక్రమం అతి ప్రధాన జాతీయ సమస్య అయిన రీతిలో నానా హంగామా చేయడంవల్ల ఏమైంది? జగన్ అంటే గిట్టని చానల్సు, జాతీయ మీడియా కూడా పొద్దస్తమానం అతడి ముఖానే్న చూపిస్తూ, అతడి గురించే మాట్లాడుతూ, అతడి మాటలే వినిపించటంతో కాణీ ఖర్చు లేకుండా రాష్టమ్రంతటా, దేశమంతటా విస్తృత ప్రచారం రాబట్టే సువర్ణావకాశం అతడికి దక్కింది. మండే ఎండలో తిరిగి ప్రచారం చేయాల్సిన బాధ తప్పించి హాయిగా ఎ.సి. రూములో కూచోబెట్టి సిబిఐ విచారణ పేరిట వందలకోట్ల రూపాయల విలువైన పబ్లిసిటీని తనకు సమకూర్చిపెట్టిన ఢిల్లీ పెద్దలకు, సిబిఐ మార్గదర్శులకు జగన్ ఆజన్మాంతం రుణపడి ఉండాలి. నిండా మూడేళ్ల రాజకీయ అనుభవం లేని ఒక వివాదాస్పద వ్యక్తిని జాతీయస్థాయిలో హీరోను చేసిన కాంగ్రెస్ పెద్దల తెలివికి జోహార్లు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి