- - ఇమ్మానేని సత్యసుందరం
- 18/06/2012
మన దేశంలో గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థ ముఖ్యం. సుమారు నాలుగు కోట్ల కుటుంబాలు గ్రామాలలోనే వున్నాయి. గ్రామీణ ప్రజలు పేద వారవడం వలన ఆహారంపై ఖర్చు ఎక్కువే. అయితే, ఇటీవల వీరు ఆహారేతర వస్తువులపై కూడా ఖర్చుపెంచారు. అందువల్లే చాలా కంపెనీలు తమ వస్తువులను గ్రామ ప్రాంతాలకు తరలించడం ప్రారంభించాయ. అయితే ఉత్పత్తిదారులు అమ్మకందారులు లాభం పొందలేకపోతున్నారు. మన గ్రామాలలో రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇది దళారులకు మేలు చేస్తున్నది. రైతులను నష్టపరుస్తున్నది. అంతేకాదు, వృధా, ముఖ్యంగా కాయగూరలు, పండ్ల విషయంలో అధికంగా వుంది. గిడ్డంగులు, ముఖ్యంగా శీతల గిడ్డంగులు తగినన్ని లేవు.
రైతులను ఆదుకోవటానికి రైతు బజార్లు ప్రముఖ పాత్ర పోషించాలి. ఇటు రైతులకు అటు వినియోగదారులకి సహాయపడే బాధ్యత రైతు బజార్లపైవుంది. అయితే, వాస్తవాలు ఎలా వున్నాయి? రైతుబజార్ల నిర్వహణలో అనేక అవకతవకలు కనబడుతున్నాయి. స్టాళ్ళను కేటాయించడం దగ్గరనుంచి ఇవి మొదలవుతున్నాయి. సిబ్బందికి లంచాలిస్తే తప్ప స్టాళ్ళలో స్థలం దొరకడం లేదు. రైతుబజార్లలో శాశ్వత ఉద్యోగులు లేరు. స్టాళ్ళను దళారులకు, వ్యాపారులకు స్వయం సహాయక సంఘాల పేర్లతో ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో జాయంటు కలెక్టర్లు రైతు బజార్లను, పర్యవేక్షించాలి. అయితే, ఇది ఆశించిన స్థాయిలో లేదు. పర్యవేక్షణ కరువై తాజా కాయగూరలను పట్టణంలోని హోటళ్ళకు తరలిస్తున్నారు. కొందరు తమ స్టాళ్ళను ఇతరులకు అమ్మేశారు. స్టాళ్ళను రొటేషన్ పద్ధతిలో డ్వాక్రా సంఘాలకు ఇవ్వాలి. అలా జరగటం లేదు. పాత వాళ్ళే కొససాగుతున్నారు. నాణ్యత లేని కూరగాయలు కూడా రైతుబజార్లను చేరుతున్నాయి. ఈవోలే అక్రమాలను ప్రోత్సహించడం విచారకరం. ఇన్ని అక్రమాల మధ్య రైతు బజార్లు సజావుగా ఎట్లా సాగుతాయ?
మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి. గ్రామాలలో వౌలిక సౌకర్యాలను పెంచాలి. సహకార మార్కెటింగ్ సంస్థలను పటిష్టం చేయాలి. రెగ్యులేటెడ్ మార్కెట్ల (క్రమబద్ధీకరించిన మార్కెట్ల) సంఖ్య పెంచాలి. తక్కువ ఖర్చుతో గ్రామీణ గిడ్డంగుల నిర్మాణం జరగాలి. రైతుబజార్ల పనితీరును మెరుగుపరచాలి. అసలే నకిలీ విత్తనాలు, చీడపీడలు, వర్షాభావం వంటి పరిస్థితులతో కునారిల్లుకొని పోతున్న రైతులు సరిగాలేని మార్కెటింగ్ వ్యవస్థవల్ల తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. అవినీతి అధికార్ల వల్ల రైతులకు కీడు జరగడం తప్ప, మేలు జరగబోదు. కానీ అటువంటి వారిని నియంత్రించి రైతులకు అన్నివిధాల న్యాయం జరిగేలా చేసే యంత్రాంగం సక్రమంగా పనిచేయడం లేదు. ఇది బాగా పనిచేస్తే రైతులకు సత్వర న్యాయం జరుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి