22, జూన్ 2012, శుక్రవారం

18 నెలలదిగువకు ముడి చమురు ధర



సింగపూర్‌:ఆయిల్‌ వినియోగంపై అమెరికా నియంత్రణ చర్యలు, చైనా ఫ్యాక్టరీ సెక్టార్‌లో మందగమన ప్రభావం బ్రెంట్‌ ముడి చమురు ధరపై పడింది. ఫలితంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లొ బ్రెంట్‌ ముడి చమురు ధర 18 నెలల దిగువకు పడి పోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉద్దీపన పథకం ప్రకటిస్తుందన్న ఆశలు గల్లంతు కావడంతో డిమాండ్‌ పెరుగుదలపై అనుమానాలతో బ్యారెల్‌ ముడి చమురు ధర 92 డాలర్లు పలికింది. గత మార్చిలో బ్రెంట్‌ ముడి చమురు ధర 128 డాలర్లకు చేరుకుంది. కానీ గత వారం రోజులుగా అమెరికా చేపట్టిన నియంత్రణ చర్యలతో దాని ధర 28 శాతం తగ్గిపోయింది. 22 ఏళ్ల తర్వాత అమెరికా తొలి సారి పెట్రోల్‌ వినియోగంపై నియంత్రణ చర్యలు చేపట్టింది.
2010 డిసెంబర్‌ 20వ తేదీన అమెరికాలో ముడి చమురు ధర 91.98 డాలర్లు పలికింది. మరోవైపు చైనా ఎగుమతి ఆర్డర్లు 2009 తర్వాత వరుసగా ఎనిమిది నెలలుగా పడిపోయాయి.
ఇదిలా ఉంటే ఫెడరల్‌ రిజర్వు బ్యాంక్‌ ఈ ఏడాది చివరి వరకూ స్వల్ప కాలిక టర్మ్‌ బాండ్లను విక్రయాన్ని కొనసాగించాలని, దీర్ఘ కాలిక బాండ్ల కొనుగోలు ద్వారా రుణ పరపతి భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది.
లాభాల బాటలో కేంద్ర చమురు సంస్థల షేర్లు
ముంబై
ఒకవైపు బ్రెంట్‌ ముడి చమురు ధర పడిపోగా, దేశీయంగా కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు బిపిసిఎల్‌, హెచ్‌పిసిఎల్‌ షేర్లు గురువారం లాభాల బాటలో పయనించాయి. అయితే డీజిల్‌ ధర మాత్రం యధావిధిగా పెరిగే అవకాశం ఉందని డీలర్లు అభిప్రాయ పడుతున్నారు. మధ్యాహ్న సమయానికి బిపిసిఎల్‌ షేర్‌ 1.34 శాతం, హెచ్‌పిసిఎల్‌ 4.16 శాతం, ఐఒసి 2.14 శాతం లబ్ధి పొందాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గుముఖం పట్టడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్‌ ధరలపై ప్రభుత్వ నియంత్రణ పాక్షికంగా ఎత్తివేయాలన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహా దారు కౌశిక్‌ బసు ప్రతిపాదన అమలుకు కొంత వ్యవధి పట్టే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి