7, జూన్ 2012, గురువారం

కొత్త సిఈసీగా సంపత్ నియామకం



న్యూఢిల్లీ,జూన్ 6: రాష్ట్ర క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ కమిషనర్ విఎస్ సంపత్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఖురేషీ జూన్ పదవ తేదీ పదవీ విరమణ చేయగానే సంపత్ ఆయన స్థానంలో ప్రధానాధికారి పదవిని చేపడతారు. రాష్టప్రతి ప్రతిభాదేవీ సింగ్ పాటిల్ బుధవారం నాడు సంపత్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నియమించేందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేసినట్లు తెలిసింది. సంపత్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశాలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి, కాగ్‌లను ఎంపిక చేసేందుకు ఒక కొలీజియంను నియమించాలని బిజెపి సీనియర్ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఇటీవల లేఖ రాయటం తెలిసిందే. అద్వానీ ప్రతిపాదనను డిఎంకె అధ్యక్షుడు ఎం.కరుణానిధి, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారట్ సమర్థించిన నేపథ్యంలో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంలో సీనియర్ కమిషనర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించటం గమనార్హం. 2009లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితుడైన సంపత్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి పదవిలో ఒకటిన్నర సంవత్సరం పని చేస్తారు. ఆయన పదవీ విరమణ చెందిన అనంతరం రాష్ట్ర క్యాడర్‌కు చెందిన మరో ఐఏఎస్ అధికారి బ్రహ్మ ఎన్నికల సంఘం ప్రధానాధికారి అయ్యే అవకాశాలున్నాయి. బ్రహ్మ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పని చేస్తుండటం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి