6, జూన్ 2012, బుధవారం

ఒక్క హిట్‌ వస్తే హీరోను పట్టుకోలేకపోతున్నాం


  • - డి.రామానాయుడు
వస్తువులకు ఐఎస్‌ఐ మార్కు ఎలాగో...తెలుగు సినిమా పొస్టర్‌పై 'నిర్మాత డి.రామానాయుడు' అన్న పేరు అలాంటింది. 'నమ్మినబంటు' సినిమాకు భాగస్వామిగా జీవితాన్ని ప్రారంభించి, ఎత్తుపల్లాలను దాటి ఒక్కోమెట్టు ఎక్కుతూ..నిర్మాతగా, నటుడిగా (హౌప్‌) స్టూడియో అధినేతగా ఎదిగిన ఆయన సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. కారంచేడులో 1936 జూన్‌ 6న పుట్టిన ఆయన నేటికి 76 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నో సంగతులను ఆయన మనముందుంచారు. 62లో ఇండిస్టీకి వచ్చిన ఆయన ఈ ఏడాది అర్థశతదినోత్సవానికి జేరుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రపంచంలోనే పెద్దపేరు తెచ్చుకోవాలి. అందుకే దేశంలోని అన్ని భాషల్లోనూ చిత్రాలు నిర్మించాను. ఒక్క పంజాబీ మిగిలింది. దాన్నికూడా ఈ ఏడాది పూర్తిచేస్తున్నా. ఈనెల 14 నుంచి కెనడాలో షూటింగ్‌ ఉంటుంది. ఆగస్టు నాటికి పూర్తిచేసి సెప్టెంబర్‌లో విడుదల చేస్తున్నా.
నా కోరిక తీరుస్తారోలేదో
నాకు ఒక్కటే కోరిక ఉంది. నేను కూడా ఆర్టిస్టునే. వెంకటేష్‌, రానా, నాగచైతన్య, నేను కలిసి ఒక సినిమా చేయాలనుకున్నా. ఆమధ్య పేపర్లో ఇచ్చినప్పటి నుంచి చాలామంది కథలు రెడీగా ఉన్నాయని వస్తున్నారు. పంజాబీ సినిమా అయ్యాక ఆ సినిమా గురించి ఆలోచిస్తా. బహుశా వచ్చే ఏడాది ఆరంభిస్తాను. దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్‌ కాలేదు. ఇది కాకుండా దర్శకునిగా నేను ఒక సినిమా తీయాలని కోరిక ఉంది. అదికూడా ప్రతిఘటన ఫంక్షన్‌లో వచ్చిన ఆలోచన. మా బ్యానర్‌లో 21మంది దర్శకుల్ని పరిచయం చేశాను.
హిట్‌ఫ్లాప్‌ ఒకేలా తీసుకోవాలి
కెరీర్‌ మొదట్లో అపజయాలున్నాయి. అప్పట్లో ఐదు లక్షలు నిర్మాత పెడితే. డిస్ట్రిబ్యూటర్లు సమానంగానే కొంత ఎక్కువగా డబ్బు ఇచ్చేవారు. ఇప్పుడు మేకింగ్‌ అంతా మారిపోయింది. ఒక్క హిట్‌ వస్తే హీరోను పట్టుకోలేకపోతున్నాం. అప్పట్లో అలా కాదు. ఇప్పటిలా ఫంక్షన్లు, పార్టీలు చేసుకునే అలవాటు లేదు. కలిసుందాం..రా చిత్రాన్ని హిందీలో తీశాను. చాలా నష్టపోయాను. ఇలా నేను పోగొట్టుకుంది ఎక్కువే. అందుకే ఎప్పుడూ ఒకేలా ఉండాలనేది నా పాలసీ.
రాముడు భీముడు చేయాలి
నేను తీసిన రాముడు-భీముడు, ప్రతిజ్ఞాపాలన బాగా ఆడాయి. పాపకోసం కాస్త ఎక్కువ ఖర్చయింది. నష్టాన్నే మిగిల్చింది. బొమ్మలుచెప్పిన కథలు బాగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన ప్రేమనగర్‌ నన్ను నిలబెట్టింది. ఈ సినిమాను ఇప్పుడు ఎన్ని సెట్లు వేసినా చేయలేం. ఆ అభినయాన్ని ఆర్టిస్టుల నుంచి రప్పించలేం. కానీ రాముడు-భీముడు మాత్రం తీయాలనుంది. అప్పట్లో ఎన్‌.టి.ఆర్‌. ఓకే అన్నారు. తీస్తే ఆయనకూ, నాకూ మంచి పేరు వస్తుంది.
సిన్సియర్‌గా చేయడమే
ఏ పనైనా సిన్సియర్‌గా చేయడమే ఈ యాభై ఏళ్ళలోనేను నేర్చుకుంది. ఇప్పటివరకు 130 సినిమాలు తీశాను. 25 కోట్లు నష్టపోయాను. ఉదయం 6గంటలకు వాకింగ్‌కు వెళితే... రాత్రి 10.30కల్లా ఇంటికి వచ్చేవాడిని. ఇలా క్రమబద్ధంగా టైంటేబుల్‌ వేసుకునేవాడిని. ఆ రూల్‌ ప్రకారమే రాజకీయనాయకుడిగా ఉన్నప్పుడు మా నియోజకర్గాలకు ఎన్నో పనులుచేశాను. అవన్నీ ఒక్కసారి గుర్తుచేసుకుంటే నాకే ఆశ్చర్యమేసింది. దాదాపు ఏడు కోట్లు నా స్వంతంగా ఖర్చు చేశాను. గెలిచినచోటా మళ్ళీ ఓడిపోయాను. చాలామంది మళ్ళీ రమ్మంటున్నారు. 'నేను రాజకీయాలకు పనికిరాను' అని మాత్రం గట్టిగా చెప్పగలను.
నిర్మాత గ్లామర్‌
నిర్మాత అనే గ్లామర్‌ చాలా పనులకు ఉపయోగపడింది. బాపట్ల ఏరియాలో రైల్వేస్టేషన్‌ డెవలప్‌మెంట్‌కోసం నేను ఎం.పి. అయ్యాక నిదుల కోసం రైల్వేమంత్రి వద్దకు వెళ్ళాను. బెంగాల్‌ మంత్రి.. నన్నుచూసి ఏ సినిమాలు తీశారని అడిగింది. ఆల్‌రెడీ బెంగాల్‌లోకూడా తీసిన సినిమా చెప్పేసరికి.. మరోమాట లేకుండా నిధులు శాంక్షన్‌ చేసేశారు. అలాగే నాబార్డ్‌ ఫండ్‌కూడా ఇలానే జరిగింది. అందులో ఇద్దరు మహిళలు. కలెక్టర్‌గారితో వెళ్ళాను. నిర్మాతగా ఆయన పరిచయం చేశారు. తెలుగు, తమిళ సినిమాలు గురించి చెప్పాను. హిందీలోకూడా తీశానని నేను చేసిన సినిమా పేర్లు చెబితే... ఆశ్చర్యపోయి... మీరా! అంటూ.. నేను 10కోట్లు అడిగితే వెంటనే ఇచ్చేశారు. ఇదంతా సినిమా గ్లామర్‌. నేను ఎంపి. అయ్యాక... ప్రతి పార్టీతోనూ చాలా క్లోజ్‌గా ఉండేవాడిని. కమ్యూనిస్టులు బాగా క్లోజ్‌.
సక్సెస్‌రేటు తక్కువే
50 ఏళ్ళ చరిత్రలో సినిమా సక్సెస్‌రేటు 10 శాతం మాత్రమే ఉంది. ఎప్పుడైనా ఒకటి...అరా ఎక్కువ కావచ్చు కానీ...ఆ గ్రాప్‌ అలానే ఉంది. ఎంతోమంది రావడం తీయడం ఫెయిల్‌ అయితే పోవడం జరుగుతుంది. అన్ని భాషల్లోనూ అదే పరిస్థితి. టీవీ ఆన్‌చేస్తే ఆరు సినిమాలు వేస్తున్నారు. మహిళలు అవన్నీ దాటుకుని ధియేటర్‌కు రావాలంటే. అంతకంటే మంచి సినిమా తీయాలి.
అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది
అప్పట్లో సినిమాకు కొన్ని లెక్కలుండేవి.. 25 శాతం ఏడుపు, 25 శాతం ప్రేమ, 25 శాతం కామెడీ, 25 శాతం ఫైట్లు. ఇప్పుడు ట్రెండ్‌మారింది. ఏడుపు బదులు ఎంటర్‌టైన్‌మెంట్‌ వచ్చింది. ఒక్కో దశలో సినిమా మొత్తం ఆక్రమించేసింది. ఎన్నో టీవీలు మనకున్నాయి. అన్నింటిల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ ఎక్కువగా చూపిస్తున్నారు. నేను టీవీ రంగంలోకి వచ్చే ఆలోచన లేనేలేదు.
వైజాగ్‌ తీసుకెళ్ళాలి
వైజాగ్‌ స్టూడియో అధునాతనంగా ఉంది. అక్కడ పలు భాషా చిత్రాలు నిర్మిస్తున్నారు. నా బ్యానర్‌లో చేసిన ఆర్టిస్టులందరినీ అక్కడికి తీసుకెళ్ళాలనుంది. పంజాబీ సినిమా అయ్యాక ప్లాన్‌ చేయాలని ఆలోచిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి