1, జూన్ 2012, శుక్రవారం

ప్రపంచ వేశ్యా దినం



డాక్టర్ల దినం, ఉపాధ్యాయుల దినం, ఇంజనీర్ల దినం...ఇలా ప్రతి వృత్తిలో ఉండే వారికీ ఒక రోజు ఉంది. అయితే ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తిలో ఉన్న వారికి కూడా ఇలా ఇక దినం ఉందా అంటే ఉంది. ప్రతి ఏటా జూన్ రెండవ తేధీని ప్రపంచ వేశ్యా దినంగా జరుపుకుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినంగా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్ల దినంగా, డాక్టర్ బీసీ రాయ్ జయంతిని డాక్టర్స్ డే గా జరుపుకుంటారు. మరి ఏ వేశ్య మాత జయంతిని ఇలా వేశ్యా దినంగా జరుపుకుంటారు అని అనుమానం వస్తే అది ఎవరిదో జయంతి కాదు. ఈ దినం వెనుక ఒక కథ ఉంది.
 
జూన్ 2, 1975. ఫ్రాన్స్ లోని ల్యోన్ నగరంలో ఉండే వేశ్యలందరూ నిరసన గళం ఎత్తారు. నగరంలోని చర్చిలో గుమి కూడి తమ నిరసన వ్యక్తం చేశారు. తమని పోలీసులు అన్యాయంగా వేధిస్తుంటారని, తమ తప్పు లేక పోయినా కెసులు బనాయించి, జరిమానాలు వసూలు చేస్తుంటారని వారి ఆవేదన. అయితే పోలీసులు దీన్ని లైట్‌గా తీసుకోలేదు. ఒక గంటలోగా చర్చిని ఖాళీ చేయకపోతే మీ పిల్లలని మీనుంచి లాగేస్తాం అని అల్టిమేటమ్ ఇచ్చారు. క్షణాల్లో ఈ విషయం నగరమంతా పాకి పోయింది. వేశ్యలైనా వీళ్ళూ ఆడవాళ్ళే కదా అని ఊరిలోని ఆడవాళ్ళు చాలా మంది వచ్చి వారికి సంఘీభావం తెలుపుతూ వారితో కలిసి పోయారు. అప్పుడు వేశ్యలెవరో, మామూలు ఆడవాళ్ళెవరో ఎవరూ చెప్పలేని పరిస్థితి. పోలీసులు దిగిరాక తప్పలేదు. వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి వారిని శాంతింపచేశారు. ఈ సంఘటనని పురస్కరించుకొని అప్పటినుంచి ప్రతి యేటా జూన్ రెండున ప్రపంచ వేశ్యా దినంగా జరుపుకుంటారు.
 
వీరికి ఒక అంతర్జాతీయ సంఘం కూడా ఉంది. దాని పేరు Scarlet Alliance. ఎలెనా జెఫ్రీస్ అనే అమ్మడు దీనికి అధ్యక్షురాలు. తమ పట్ల వివక్షత రూపుమాపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నదీమె. బ్యాంకులు తమకి లోన్లు ఇవ్వడానికి, వెనుకాడుతాయని, ఒక వేళ ఇచ్చినా అధిక వడ్డీ వసూలు చేస్తాయని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక ఆస్ట్రేలియాలోని, న్యూ సౌత్ వేల్స్‌లోని ఐవీ మెకింటోష్ మరొక రకమైన బాధని వ్యక్తం చేస్తుంది. ఆ రాష్ట్రంలో వ్యభిచారం చట్ట బద్ధం. "వార్తా పత్రికలలో పది డాలర్ల ప్రకటన నేను నా వృత్తి కోసం ఇవ్వాలనుకుంటే వంద డాలర్లు వసూలు చేస్తారు" అని అంటుంది ఈమె. "అన్ని వృత్తుల్లాగే ఇదీ ఒక వృత్తే. మేమూ అందరిలాగే అన్ని పన్నులు చెల్లిస్తాం. మా పట్ల వవక్షత ఎందుకు?" అన్నది వీళ్ల ప్రశ్న.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి