25, జూన్ 2012, సోమవారం

పేదరికం తగ్గుదలపై ప్రణాళికా సంఘం బొంకులు


1993-94లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభం కావడానికి ముందు దేశంలో పేదరికం 56 నుంచి 59 శాతం మధ్య ఉండేది. ఆ తరువాత ఇది బాగా వేగంగా పెరిగింది. 1993-94 తరువాత దశాబ్దం పాటు పేదరికం అత్యంత వేగంగా పెరిగింది. ప్రభుత్వ వ్యయంలో కోత, ధరల స్థిరీకరణ చర్యలను నిలిపివేయడం, రాయితీలపై రుణాలు మంజూరు చేయడాన్ని రద్దు చేయడం, ప్రపంచ మార్కెట్‌పై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి కల్పించడం ఇందుకు దోహదం చేశాయి. ఈ చర్యలన్నింటి సమిష్టి ఫలితంగా నిరుద్యోగం పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వస్తువులు, సరుకులకు డిమాండ్‌ పడిపోయింది. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయాయి.
గత ఐదు సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం ప్రభావాన్ని చవిచూస్తోంది. 2008లో ప్రారంభమైన మాంద్యం కారణంగా ప్రాథమిక వస్తువుల ధరలు పెరిగిపోవడం, 2009-10లో తీవ్ర కరువు సంభవించడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండటంతో జీవన వ్యయం మునుపెన్నడూ లేని స్థాయికి పెరిగింది. ఈ శతాబ్దంలో 2007 వరకూ క్రమంగా తగ్గిపోతున్న ఆహారధాన్యాల తలసరి ఉత్పత్తి ఆ తరువాత స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్న ఆహారధాన్యాల తలసరి పరిమాణం తగ్గిపోతోంది. భారీ స్థాయిలో ఎగుమతులు చేయడం, ప్రభుత్వ సేకరణ పెరగడం ఇందుకు కారణాలు. 2002-03లో నెలకొన్న క్షామం 2009-10లో పునరావృతమైంది. ఒకవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వ గోదాముల్లో ఆహార ధాన్యాలు ఆరున్నర కోట్ల టన్నుల స్థాయికి పేరుకుపోయాయి. కరువుకు ముందు కూడా 1.4 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను 2008లో ఎగుమతి చేశారు. ఒక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో ఎగుమతులు జరగడం ఇదే మొదటిసారి. మరోవైపు నిల్వలు మరో 1.7 కోట్ల టన్నులు పెరిగాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న తలసరి ఆహార ధాన్యాల పరిమాణం తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే తక్కువగా ఉంది.
అన్ని రకాల ఆహారధాన్యాల తలసరి వినియోగం ఇప్పటికే బాగా తగ్గిపోయింది. అది మరింతగా తగ్గిపోతుండటం డిమాండ్‌ ప్రతి ద్రవ్యోల్బణం భారీ స్థాయిలో పతనం కావడానికి సంకేతంగా నిలుస్తోంది. ప్రజల వద్ద కొనుగోలు శక్తి పెద్ద మొత్తంలో తగ్గుతోంది. ఉద్యోగావకాశాల వృద్ధి రేటు 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో భారీ స్థాయిలో పతనమైనట్లు 66వ రౌండ్‌ జాతీయ స్థాయీ సర్వే నివేదికలు స్పష్టం చేశాయి. మౌలిక వ్యయాలకు సంబంధించిన గణాంకాలతో 2011, ఆగస్టులో ఈ నివేదికలు విడుదలయ్యాయి. పోషకాహార పదార్థాల వినియోగంపై నివేదికను 2012, జనవరి చివర్లో విడుదల చేశారు. పేదరికం పెరిగిపోవడం కొనసాగుతూనే ఉందని ఈ నివేదిక ధృవీకరించింది. 2004-05తో పోలిస్తే ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రస్థాయికి చేరుకుంది. రోజుకు 2,200 కిలో కేలరీల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 69.5 శాతం మంది సరుకులు, సేవల నిమిత్తం అత్యంత స్వల్ప మొత్తం ఖర్చు చేశారు. 2009-10 నాటికి వీరి సంఖ్య 75 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 2,100 కిలో కేలరీలు పొందేందుకు అత్యంత స్పల్ప మొత్తం ఖర్చు చేసిన వారి సంఖ్య 64.5, 73 శాతం ఉన్నాయి. 1993-94లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభం కావడానికి ముందు దేశంలో పేదరికం 56 నుంచి 59 శాతం మధ్య ఉండేది. ఆ తరువాత ఇది బాగా వేగంగా పెరిగింది. 1993-94 తరువాత దశాబ్దం పాటు పేదరికం అత్యంత వేగంగా పెరిగింది. ప్రభుత్వ వ్యయంలో కోత, ధరల స్థిరీకరణ చర్యలను నిలిపివేయడం, రాయితీలపై రుణాలు మంజూరు చేయడాన్ని రద్దు చేయడం, ప్రపంచ మార్కెట్‌పై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి కల్పించడం ఇందుకు దోహదం చేశాయి. ఈ చర్యలన్నింటి సమిష్టి ఫలితంగా నిరుద్యోగం పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వస్తువులు, సరుకులకు డిమాండ్‌ పడిపోయింది. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయాయి. వాణిజ్య పంటలు పండిస్తున్న రైతులు వర్తక సరళీకరణ, ప్రపంచ మార్కెట్‌లో ధరలు నిలకడగా లేకపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. రైతుల కడగండ్లు వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభానికి దారితీశాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇప్పటికీ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వ వైఖరిలో ఇప్పటికీ మార్పు రావడం లేదు. అది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేస్తూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అందరినీ పణంగా పెట్టి అత్యున్నత స్థాయిలోని 5 శాతం మంది భూస్వాములు భూములను కబళించారు.
సంస్కరణలు అమలు చేసిన సమయంలో పట్టణ ప్రాంతాల్లో కూడా పేదరికం పెరుగుతూనే ఉంది. గత ఐదు సంవత్సరాలుగా పట్టణ ప్రాంతాల్లో పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో కంటే వేగంగా పెరుగుతోంది. అధిక ద్రవ్యోల్బణం, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం ఇందుకు కారణాలు. పెద్ద నగరాలు గల రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఢిల్లీ నగరంలో జీవన వ్యయం బాగా పెరిగిందని వివరణాత్మక విశ్లేషణలో వెల్లడైంది. మెజారిటీ ప్రజలు తీసుకునే ఆహారం, అందులో పోషక పదార్థాల స్థాయి బాగా తగ్గిపోయింది. 1993-94 నుంచి 2004-05 వరకూ మహారాష్ట్రలో 2,100 కేలరీల ఆహారాన్ని సైతం తీసుకోలేని వారి సంఖ్య 49 నుంచి 67.5 శాతానికి పెరిగింది. 2009-10 నాటికి అది 83 శాతం వద్ద స్థిరంగా ఉంది. దేశంలో పేదరికం అత్యంత భారీగా పెరిగింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 2,100 కేలరీల కంటే తక్కువ తీసుకునే వారి సంఖ్య 1993-94లో 35 శాతం ఉండగా 2004-05 నాటికి 67.5 శాతానికి పెరిగింది. 2009-10 నాటికి ఇది ఏకంగా 92 శాతానికి పెరిగింది. తలసరి ప్రొటీన్లు తీసుకోవడం తగ్గిపోతూనే ఉంది. పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలకు దీటుగా ప్రజల ఆదాయం పెరగక పోవడంతో అనేక కుటుంబాలు తమ ఆహార అవసరాలను త్యాగం చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా వైద్య, విద్య, సర్వీసుల వ్యయం భారీగా పెరిగి అందుబాటులో లేకుండా పోయినా ఖర్చులు అనివార్యం కావడంతో ప్రజలు ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవాల్సి వస్తోంది. ఈ సర్వీసులను ప్రయివేటీకరించడం కూడా వాటి వ్యయం పెరిగిపోవడానికి కారణం. ఆరంభంలో పట్టణ పేదరిక స్థాయి ఎక్కువగా ఉన్న తమిళనాడులో పరిస్థితి నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే కొంత మెరుగుపడింది.
జీవన ప్రమాణాలు ఇంత వేగంగా పతనమవుతుండటంతో ప్రజల ఆగ్రహం పెరగడం ఆశ్చర్యకరమైనదేమీ కాదు. నయా ఉదారవాద విధానాలను బహిరంగంగా, అంతర్గతంగా సమర్థిస్తున్న వారు జనాభాలో ఉన్నతస్థాయీ వర్గానికి చెందిన ఐదు శాతం మంది మాత్రమే. అత్యధిక ఆదాయం పొందుతున్న అగ్రకులాలకు చెందిన వారు అభివృద్ధి ఫలాలన్నింటినీ కైంకర్యం చేస్తున్నారు. ఉత్పాదక సర్వీసుల నుంచి ఉపాధి కోల్పోయేవారు తక్కువ వ్యయంతో అందించే సేవల నుంచి ప్రయోజనం పొందుతున్నారు. ఈ మేధావి వర్గంలో కొంతమంది ఆహార పదార్థాల వినియోగం, ఆహారంలో ప్రొటీన్‌ వంటి పోషక పదార్థాల వినియోగం తగ్గడాన్ని సమర్థిస్తుంటారు. వారి వాదనలు ఎలా ఉంటున్నాయంటే, ప్రజలు కావాలనే ఆకలితో అలమటిస్తున్నారట. పోషకాహారం తీసుకునే విషయంలో మన దేశం అనేక దేశాల కంటే బాగా వెనకబడింది. అమెరికాలో తలసరిన సంవత్సరానికి 890 కిలోల ధాన్యాన్ని తీసుకుంటారు. భారత దేశంలో ఇది 174 కిలోలే ఉంది. ప్రస్తుతం ఇది మరింతగా తగ్గి సాధారణ స్థాయి కంటే రెండున్నర రెట్లు తక్కువగా ఉంది.
పేదరిక రేఖ అన్ని రకాల సరుకులు, సేవలపై ఖర్చు పెట్టడానికి సంబంధించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోజువారీగా వరుసగా 2,200, 2,100 కేలరీలను తీసుకోవడాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి కారణం ఉంది. పేదరికం గురించి అంచనా వేసేందుకు ప్రణాళికా సంఘం వీటిని తొలిసారి వర్తింపజేసింది. పేదరికానికి ప్రణాళికా సంఘం ఇచ్చిన నిర్వచనాన్ని ఎన్నడూ మార్చలేదు. అన్ని రకాల సరుకులు, సేవలపై గుర్తించిన కుటుంబాల నెలసరి వినియోగ ప్రామాణికాలను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీగా 2,400 కేలరీలు, పట్టణాల్లో 2,100 కేలరీల కంటే తక్కువ వినియోగించడాన్ని పేదరికంగా ప్రణాళికా సంఘం నిర్వచించింది. 1973-74లో రూపొందించిన అంచనాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాణాలను 2,200కు కుదించారు. ఆయా కుటుంబాలు సాధారణంగా తీసుకునే ఆహారం పరిమాణం, కుటుంబంలో సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. కొనుగోలు చేసిన వస్తువులనే కాకుండా స్వయంగా ఉత్పత్తి చేసిన వస్తువుల వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
నమోదు చేసిన పరిమాణాల నుంచి రెండు సెట్ల సమాచారం అందుబాటులో ఉంటుంది. తీసుకునే పరిమాణాన్ని వ్యయంతో గుణించి మొత్తం వ్యయాన్ని నిర్ణయిస్తారు. ఆహార పదార్థాల పరిమాణాన్ని ఒక యూనిట్‌కు ప్రమాణ కేలరీ, ప్రొటీన్‌, కొవ్వు విలువలతో గుణిస్తే నెలవారీ పోషక పదార్థాల విలువను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల సంఖ్యతోనూ, ఆ తరువాత 30తోనే భాగహారం చేసి తలసరి రోజువారీ కేలరీలను లెక్కిస్తారు. నెలసరి ఖర్చు ప్రాతిపదికగా ఎన్‌ఎస్‌ఎస్‌ నివేదికలు నెలసరి ర్యాంకుల ఆధారంగా 12 గ్రూపుల సమాచారాన్ని అందిస్తాయి. తీసుకునే కేలరీలు ఆ కుటుంబ ఆర్థిక స్థోమత ప్రాతిపదికపై నిర్ణయిస్తారు. ఇది నిరుపేదలకు 1,300 గానూ, సంపన్నులకు 2,800గానూ ఉంది. పెట్టిన వ్యయం ప్రాతిపదికగా కేలరీలను గుర్తించలేమని కొంతమంది ఆర్థికవేత్తలు చేసే వ్యాఖ్యల్లో నిజం లేదని ఇందువల్ల స్పష్టమవుతోంది.
వాస్తవంగా తీసుకున్న సరుకులు, సేవల భౌతిక పరిమాణాలను బట్టి రూపొందడంతో పోషక పదార్థాలకు సంబంధించిన సమాచారం అత్యంత విశ్వసనీయమైందిగా ఉంటుంది. ప్రణాళికా సంఘం గత మార్చి నెలలో పేదరిక అంచనాలను విడుదల చేసింది. పేదరికం తగ్గిందని అది పేర్కొంది. అఖిల భారత స్థాయిలో హెచ్‌సిఆర్‌ (హెడ్‌కౌంట్‌ రేషియో) 2004-05లో 37.2 శాతం ఉండగా అది నేడు 7.3 శాతానికి పడిపోయింది. 2009-10లో ఇది 29.8 శాతం ఉంది. గ్రామీణ పేదరికం 8.0 శాతం తగ్గింది. ఇది 41.8 శాతం నుంచి 33.8 శాతానికి తగ్గిపోయాయి. పట్టణ పేదరికం 25.7 శాతం నుంచి 20.9, అంటే 4.8 శాతానికి పడిపోయింది.
ప్రణాళికా సంఘం పేదరికానికి తాను ఇచ్చిన నిర్వచనాన్నే ఉల్లంఘించింది. 1973-74లో దీన్ని కచ్చితంగా అంచనా వేసిన సంఘం దానిని 40 సంవత్సరాలపాటు అవిచ్ఛిన్నంగా కొనసాగించింది. ఆ తరువాత ఎప్పటికప్పుడు కొంత మార్పులు చేసుకుంటూ వచ్చింది కానీ మౌలిక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. జీవన వ్యయం పెరిగిన విషయాన్ని అది పట్టించుకోలేదు. 2004-05కు వచ్చేసరికి కమిషన్‌ రోజువారీ వ్యయాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వరుసగా రూ.12, రూ.18కి తగ్గించింది. వాస్తవానికి పోషక పదార్థాల ఆధారిత వ్యయం అందుకు మూడు రెట్లు ఉంది. టెండూల్కర్‌ కమిటీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ధరల సూచీ వంటి పొరపాటు విధానాన్ని అనుసరించింది. 2009-10 సంవత్సరానికి సవరించిన అధికార పేదరిక రేఖలు నెలకు వరుసగా రూ.673, రూ.860 లేదా రోజుకు వరుసగా రూ.22.4, రూ.28.7 ఉన్నాయి. ఈ లెక్కన 1,890, 1,700 కేలరీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అధికార ప్రమాణాలను తగ్గిస్తూ పోవడమే అధికార లెక్కలు వాస్తవాన్ని ప్రతిబింబించకపోవడానికి అసలు కారణం. ఒక పాఠశాలలో ఉత్తీర్ణతా మార్కులను గణనీయం, స్థిరంగా తగ్గిస్తూపోతుంటే ఫెయిల్‌ అయిన వారి సంఖ్య ఆ పాఠశాలలో తగ్గుతూపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. అయితే ఉత్తీర్ణతా శాతం పెరిగిందని ఆ పాఠశాల ప్రచారం చేసుకోవడం అసత్య ప్రచారమే అవుతుంది. ఎప్పుడూ ఒకే పౌష్టికాహార ప్రమాణాన్ని పాటించినప్పుడే పోలిక తీసుకురావడం సాధ్యమవుతుంది. లేనిపక్షంలో అది వాస్తవాన్ని ప్రతిబింబించదు. సంస్కరణల సమయంలో పేదరికం బాగా పెరిగిపోయినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ నగరంలో 2009-10లో తీసుకున్న ఆహారం 1,400 కేలరీలయితే అధికారిక పేదరిక రేఖ రూ.1,040 మాత్రమే. లేదా రోజుకు రూ.35 మాత్రమే. పోషక పదార్థాలు తీసుకోవాలంటే నెలకు కనీసం రూ.5,200 ఖర్చవుతుంది. అంటే అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లుంది. ఈ రెండేళ్లలో దీని ఖరీదు మరింతగా పెరిగింది. ప్రజల ఆదాయం మాత్రం పెద్దగా పెరగలేదు. అందువల్ల సహజంగానే పేదరికం పెరుగుతుంది. అయితే ప్రణాళికా సంఘం దీనిని గుర్తించింది. ప్రజలు తీసుకునే కేలరీల స్థాయిని తగ్గిస్తూ తప్పుదారి పట్టించే గణాంకాలనందిస్తోంది. జిడిపిలో వేతనాల వాటా గణనీయంగా తగ్గుతోంది. ముఖ్యంగా భారతదేశంలో మరింతగా తగ్గుతోంది. ధరల సూచీ కూడా ప్రజల వేతనాల కొనుగోలు శక్తిని నిర్థారించలేదనే విషయాన్ని కార్మికోద్యమ సంఘాల నాయకులు గుర్తించాలి. జీవన వ్యయంలో పెరుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తుండటం అవసరం. ఈ ధోరణులపై పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాటం చేయడం, ప్రజా ప్రతిఘటనను పెంపొందించడం అవసరం.
-ఉత్సా పట్నాయక్‌

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి