6, జూన్ 2012, బుధవారం

రాముడు-భీముడు’ సినిమా రానా చేస్తానంటే వద్దన్నాను







అగ్ర నిర్మాత డి.రామానాయుడు నేటితో 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే ఈ ఏడాదితోనే నిర్మాతగా కూడా 50వ పడిలోకి ప్రవేశిస్తున్నారాయన. ఈ సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఆయన అందుకోని అవార్డు లేదు... సాధించని రివార్డు లేదు... సృష్టించని రికార్డూ లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే ఆయనలోని ప్రత్యేకత. తన పుట్టిన రోజు సందర్భంగా తీరనున్న తన కోర్కెల గురించి, తీర్చుకోవాలనుకుంటున్న తన ఆకాంక్షల గురించి పత్రికల వారికి తెలిపారు రామానాయుడు.


ఏనాడూ ఫెయిల్ కాలేదు
1962లో ‘అనురాగం’ చిత్రాన్ని భాగస్థులతో కలిసి మొదలుపెట్టాను. అంటే... నిర్మాతగా నాకు అయిదు పదులు నిండాయి. ఈ యాభైఏళ్ల కాలంలో ఒక్కో సినిమా ఒక్కో అనుభూతినిచ్చింది. కళాకారులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల విషయంలో గానీ, వారికి సహకరించడంలో కానీ నిర్మాతగా నేను ఏనాడూ ఫెయిల్ కాలేదు.

సెప్టెంబర్‌లో పంజాబీ సినిమా
నిర్మాతగా అన్ని భాషల్లో సినిమాలు తీశాను. ఒక్క పంజాబీలో తప్ప. ఆ వెలితి కూడా ఈ ఏడాదితో తీరబోతోంది. ఇప్పటికే పంజాబీలో సినిమా మొదలుపెట్టా. ఈ నెల 14 నుంచి పంజాబ్, కెనడాల్లో షూటింగ్ చేస్తాం. తర్వాత ఆగస్టులో జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేస్తాం. దాంతో అన్ని భాషల్లో సినిమాలు నిర్మించిన క్రెడిట్ నాకు దక్కుతుంది.

అందరం కలిసి ఓ సినిమా చేస్తాం
మా అబ్బాయి వెంకటేష్‌తో పాటు మనవళ్లు రానా, నాగచైతన్యలు కూడా హీరోలుగా సక్సెస్ అయ్యారు. ఇది కుటుంబపెద్దగా నాకు గర్వకారణమైన విషయం. నేను కూడా ఓ రకంగా నటుణ్నే కాబట్టి... వారందరితో కలిసి ఓ సినిమాలో నటించాలనుంది. ఈ కోరికను ఇటీవలే నేను మీడియా ముందు వ్యక్తం చేయడంతో చాలామంది దర్శకులు మంచి కథలున్నాయని ఫోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం పంజాబీ సినిమా పనిలో బిజీగా ఉన్నాను ఆ సినిమా పని పూర్తికాగానే మేం అందరం కలిసి నటించే సినిమా గురించి ఆలోచిస్తా.

నాకూ ఎన్టీఆర్‌కీ ఇద్దరికీ మంచిది
‘రాముడు-భీముడు’తో ఎన్టీఆర్ సురేష్ ప్రొడక్షన్స్ అనే విత్తును నాటితే, ‘ప్రేమనగర్’తో అక్కినేని దాన్ని వృక్షంగా మార్చారు. అందుకే ఆ రెండూ నా జీవితంలో మరిచిపోలేని సినిమాలు. వీటిలో ‘రాముడు-భీముడు’ మళ్లీ తీయాలనుంది. ఆ సినిమా మళ్లీ తీస్తే... రానా చేస్తానన్నాడు. కానీ ఎన్టీఆర్ చేస్తేనే సబబుగా ఉంటుందని నేనే తనకు నచ్చజెప్పాను. ఎన్టీఆర్ ఆ సినిమా చేస్తే తనకూ మంచిదీ, నాకూ మంచిది. ఈ విషయాన్నే తనతో చెప్పాను కూడా. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.

పేర్లు వేయొద్దు అన్నారు
నేను డెరైక్ట్ చేయాలనుకుంటున్న విషయం మా సంస్థ ద్వారా పరిచయం అయిన దర్శకులందరికీ తెలిసింది. దాంతో వాళ్లు.. ‘మీరు డెరైక్ట్ చేస్తే... మీ దగ్గర దర్శకత్వ శాఖలో మేమందరం పనిచేస్తాం’ అని చెప్పారు. ‘మీ అందరూ చేస్తే మీరే తీశారనుకుంటారయ్యా’ అని నేనంటే... ‘మా పేర్లే వేయద్దు’ అన్నారు వాళ్లు. అదంతా వారి అభిమానం. త్వరలోనే నా దర్శకత్వంలో సినిమా ఉంటుంది.

రాజకీయాల్లో నేను అన్‌ఫిట్
బాపట్ల నియోజకవర్గానికి రాజకీయాలకు అతీతంగా నేను సేవ చేశాను. ప్రభుత్వం నుంచి నిధులను సేకరించే విషయంలోనూ, నియోజకవర్గాభివృద్ధి విషయంలోనూ ఎంతో చురుగ్గా కదిలేవాణ్ని. దానికి నా సినిమా గ్లామర్ కూడా చాలావరకూ ఉపకరించింది. నా సొంత డబ్బు ఏడున్నర కోట్ల రూపాయలు నా నియోజకవర్గానికి ఖర్చుపెట్టాను. ఆ పరంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నా. అయితే రాజకీయనాయకుడిగా మాత్రం నేను అన్‌ఫిట్. కానీ నా జాతకంలో మాత్రం మంత్రి పదవి వరిస్తుందని ఉంది. మరి డబ్బైఅయిదేళ్లు వచ్చేశాయి. మరి మంత్రిని ఎప్పుడు అవుతానో (నవ్వుతూ)...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి