19, జూన్ 2012, మంగళవారం

రాజకీయ దుర్గంధం


తాచెడిన కోతి వనమంతా చెడిచినట్లు కొందరు రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాల మూలంగా మొత్తం రాజకీయ వ్యవస్థకు చెడ్డపెరు వస్తోంది. జనబాహుళ్యం రాజకీయ నాయకులంటేనే అసహ్యించుకుంటున్నారు. చివరకు చిన్న పిల్లలు,ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సైతం రాజకీయ నాయకుల పట్ల యేహ్యభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల ప్రజల్లో ఉన్న ద్వేషం, కోపం, చీదరింపు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయతే ప్రజల్లోని ప్రతికూల అభిప్రాయాలను మార్చేందుకు రాజకీయ నాయకులు హేతుబద్దంగా వ్యవహరించే బదులు అక్కసును వెళ్లగక్కటం విచిత్రం. లోక్‌సభలో ఇటీవల రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయాలపై జరిగిన చర్చలో పాల్గొన్న మెజారిటీ పార్లమెంటు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇందుకు నిదర్శనం. కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో పని చేసే ఎన్.సి.ఇ.ఆర్.టి తొమ్మిది, పది, పదకొండు, పనె్నండు తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకంలోని భారత పార్లమెంటరీ వ్యవస్థ అనే పాఠంలో కొందరు సీనియర్ జాతీయ నాయకులపై పలువురు కార్టూనిస్టులు గీసిన వ్యంగ్య చిత్రాలతోకూడిన ఒక అంశాన్ని చేర్చారు. వివిధ నాయకుల తీరు తెన్నులకు అద్దం పట్టే ఈ పాఠంలో చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు పార్లమెంటు సభ్యులకు తీవ్ర మనస్థాపం కలిగించాయి. తమ గురించి ఎవరు ఏమనుకున్నా తమకు పరవా లేదు కానీ కేంద్ర మానవ వనరుల శాఖ ప్రచురించే పుస్తకాల్లో తమను అవమానించటం ఏమిటంటూ లోక్‌సభలో సంకీర్ణ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. లోక్‌సభ సభ్యులు పార్టీ పరిమితులను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం గమనార్హం. పార్లమెంటు సభ్యులను అవమానించే విధంగా ఉన్న పాఠ్యాంశాన్ని విద్యార్థుల చేత చదివిస్తున్నందుకు మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సమైక్యంగా డిమాండ్ చేశారు. కార్టూన్ల పాఠంపై ప్రసంగించిన లోక్‌సభ సభ్యులు...రాజకీయ నాయకులను, రాజకీయ వ్యవస్థను ప్రజలు ఎలా చీదరించుకుంటున్నారో, అసహ్యించుకున్నారో, ఎంత ఆగ్రహంతో ఉన్నారో పూసగుచ్చినట్లు చెప్పారు. మొదట శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ మాట్లాడుతూ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకునేందుకు ఎంత మాత్రం సిద్ధంగా లేరు. నేరస్తులు, హంతకులు, వారితో తామెందుకు చేరుతామని విద్యార్థులు తమను ప్రశ్నించారని వివరించారు. రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటిదంటూ ఈ మూల స్థంభాన్ని తొలగించే కుట్ర జరుగుతోందని సంజయ్ నిరుపం, సి.పి.ఐ పక్షం నాయకుడు గురుదాస్‌దాస్‌గుప్తా ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవస్థను నవ్వుల పాలు చేయటం కొందరికి అలవాటుగా మారిందని బి.జె.పి సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. మన చుట్టు ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం కనుమరుగైపోతున్నా భారత దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి రాజకీయ నాయకులే కారణమంటూ వారు తమ వీపును తామె చరుచుకున్నారు. పెద్ద వాళ్లు తమను విమర్శిస్తే విమర్శించనివ్వండి కానీ చిన్న పిల్లల చూపులో కూడా తమ పరువు, ప్రతిష్ట తీస్తారా అంటూ లోక్‌సభ సభ్యులు మంత్రి కపిల్ సిబల్‌పై విరుచుకు పడ్డారు. రాజకీయ నాయకులపై జరుగుతున్న విష ప్రచారాన్ని అడ్డుకోవటంతోపాటు దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని మెజారిటీ లోక్‌సభ సభ్యులు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులను నేరస్తులు,హంతకులు, దోపిడిదొంగలుగా చిత్రీకరించే తప్పుడు, విష ప్రచారం జరుగుతోందని ముప్పై రెండు మంది లోక్‌సభ సభ్యులు ఆరోపించారు. కేవలం ఒకేఒక లోక్‌సభ సభ్యుడు షరీఫుద్దీన్ షారిక్ మాత్రం రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం సరైందేనని కుండ బద్దల కొట్టినట్లు చెప్పారు. ప్రజలు మనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నదని ఆయన వాదించారు. శాసన సభ్యులు,పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తరువాత, మంత్రి పదవులు చేపట్టిన తరువాత ఐదారు సంవత్సరాల్లో మనం కోట్లకు ఎలా పడగెత్తుతున్నామని షారిక్ ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచారు. మనం తప్పు చేస్తున్నాము కాబట్టే ప్రజలు మనను నేరస్తులు, దోపిడిదొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎదురు తిరిగారు. మనం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి, మనలోకి మనం తొంగి చూసుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే ఇతర లోక్‌సభ సభ్యులు ఆయనతో ఏకీభవించేందుకు ఎంత మాత్రం సిద్ధంగా లేరు. రాజకీయ వ్యవస్థ కుప్పకూలితే ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదం ముంచుకు వస్తుందనేది నిజమే కానీ రాజకీయ వ్యవస్థ కుళ్లిపోవటం వలన ప్రజాస్వామ్య వ్యవస్థ విషతుల్యమవుతోందనేది కూడా పచ్చి నిజం. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమై అరవై సంవత్సరాలు పూర్తి అవుతున్న సంధర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పెద్ద కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ అరవై సంవత్సరాల ప్రయాణంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నది. రాజకీయ నాయకుల పట్ల ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. గతంలో జాతిపిత మహాత్మా గాంధీతో పాటు మొదటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్ నేహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, వౌలానా ఆజాద్, బాబాసాహేబ్ అంబేద్కర్ తదితర నాయకులు యువత,విద్యార్థులతోపాటు పెద్దవారికి కూడా ఆదర్శంగా ఉండేవారు. ఇప్పుడలాంటివారే కనిపించటం లేదు. యువతకు ఆదర్శంగా నిలబడే స్థాయి ఉన్న నాయకులు దివిటీలు పెట్టి వెతికినా కనిపించటం లేదు. తమ తప్పుడు చర్యల మూలంగా ఛీత్కారానికి గురి అవుతున్నారు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా స్వంత సేవ మాని ప్రజాసేవపై దృష్టి కేంద్రీకరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి